Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా?

కాశ్మీర్ సమస్య ఇంత కఠినం కావడానికి ప్రధాన కారణం తొలి ప్రధాని పండిట్ నెహ్రు నుండి పలు రాజకీయ పక్షాలు, ఓట్ల బ్యాంకు రాజకీయాలను పరిగణనలోకి ...కాశ్మీర్ సమస్య ఇంత కఠినం కావడానికి ప్రధాన కారణం తొలి ప్రధాని పండిట్ నెహ్రు నుండి పలు రాజకీయ పక్షాలు, ఓట్ల బ్యాంకు రాజకీయాలను పరిగణనలోకి తీసుకోవడమే. దేశ సమగ్రత, దేశ రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేక పోవడమే. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన విధానం రూపొందించి, ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం ఎవ్వరూ చేయకపోవడమే. ఆ దిశలో కొంత మేరకు నిజాయతీతో ప్రయత్నం చేసింది వాజపేయి మాత్రమే. పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ వంటి వారు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారు. అయితే వోట్ బ్యాంకు రాజకీయాల కారణంగా వారు చెప్పుకోదగిన విజయం సాధించలేకపోయారు.
పుల్వామాలో జవానులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి దేశ ప్రజలను కలచివేస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈ సమస్య ఇంత జటిలంగా మారడానికి కారణం ఎవ్వరు అనే చర్చను ఇప్పుడు చేయడం కాకుండా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తామనే అంశంపై దృష్టి సారించవలసి ఉంది. ప్రజాస్వామ్యంలో, ఆధునిక ప్రపంచంలో ఏ సమస్య అయినా రాజకీయ ప్రక్రియ ద్వారానే తగు పరిష్కారం పొందగలదు. ఆ విధంగా కాకుండా సైనిక బలగాన్ని ఉపయోగించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే విష పరిణామాలకు దారితీస్తుందని గ్రహించాలి.
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఎక్కడ కూడా సైనికులను ఉపయోగించి పరిష్కారం కనుగొనడం ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం కోసం సాయుధుల ప్రమేయం అవసరమే! కానీ వారే పరిష్కారం అని భావించడం విధానపరమైన దివాళాకోరు తనాన్ని వెల్లడి చేస్తుంది. శ్రీలంక, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, నేడు సిరియా వంటి చోట్ల బలప్రయోగంతో ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం ఎంత మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో చూస్తున్నాము. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు అమెరికా వంటి అగ్రరాజ్యానే్న రాజకీయ, ఆర్థిక అస్థిరతకు నెట్టివేశాయి.
కాశ్మీర్ లోయలో ఉగ్రవాద సమస్యకు సైన్యమే పరిష్కారం అనే దురభిప్రాయంతో రాజకీయ నాయ కత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేయడం, ఒక విధంగా నిర్లక్ష్య పూర్వకంగా వ్యవహ రించడం కారణంగా నేడు ప్రమాదకర స్థాయికి చేరుకొం ది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి పలుసార్లు ప్రధాని నరేంద్ర మోదీని కలసి రాజకీయ పక్రియ ప్రారంభం కోసం ప్రయత్నం చేయండి అని కోరారు. కానీ ఆ దిశలో ఒక్క ప్రయత్నం కూడా ప్రస్తుత ప్రభుత్వం చేయలేదు.
కనీసం ప్రధాని స్వయంగా చొరవ తీసుకొని ఉంటే, సీనియర్ కేంద్ర మంత్రులకు పురమాయించి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. కానీ ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రాలుగా మారిన రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు అహంకార ధోరణితో వ్యవహరించిన కారణంగా పరిస్థితి అదుపు తప్పుతున్నదని గమనించాలి. గత 56 నెలల్లో అక్కడ 488 మంది సైనికులు చనిపోయారు. అంటే దాదాపు కార్గిల్ యుద్ధంలో చనిపోయినంత మంది చనిపోయారు. ఇంతటి భారీ త్యాగాలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ?
స్వయంగా సైన్యాధిపతి బిపిన్ రావత్ రెండు నెలల క్రితం కాశ్మీర్‌లో ఉగ్రవాదులను అరికట్టడంలో సైన్యం తమ వంతు కృషి చేస్తున్నదని, కానీ ఈ విషయంలో ఇక రాజకీయ నాయకత్వం చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఒక సంవత్సరం క్రితం జమ్మూ కాశ్మీర్ డిజిపి సైతం ఇటువంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. తాము ఉగ్రవాదాన్ని కట్టడి చేసాం గానీ, ఈ విషయంలో ముందడుగు వేయవలసింది రాజకీయ నాయకత్వమే అని తెలిపారు. అంటే సైనికులు, పోలీసులు స్వయంగా తమ పాత్ర పరిమితమే అని, పూర్తి పరిష్కారం కోసం అడుగు వేయవలసింది రాజకీయ నాయకత్వం అని స్పష్టం చేస్తున్నా ఈ విషయంలో రాజకీయ నాయకత్వం చొరవ తీసుకోకపోవడం విచారకరం.
రాజకీయ చొరవ అంటే ఉగ్రవాదులతో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో, కాశ్మీర్ లోయలోని వేర్పాటు వాదులతో రాజీ పడటమే అని, వారితో చర్చలు జరిపి, వారి గొంతెమ్మ కోర్కెలకు తల వంచడమే అనే దురభిప్రాయాన్ని దేశ ప్రజలలో కల్గించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ జోక్యం అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ద్వారా పాకిస్థాన్‌ను, ఉగ్రవాదులను ఏకాకులను చేయడం, వారిని మన దారికి వచ్చేటట్లు చేసుకోవడమే అని గమనించాలి.
పుల్వామా ఉగ్రదాడి గురించి తెలియగానే మొత్తం దేశం ఆగ్రహంతో, ఆవేదనతో ఊగిపోతూ అమరులైన మన సైనికుల పట్ల ఆందోళన చెందుతూ ఉంటే ప్రధాన మంత్రి ఏమి చేస్తున్నారు ? తీరుబడిగా ఒక ప్రచారం సినిమా షూటింగ్‌లో మునిగిపోయి ఉన్నారు. దేశ భద్రత విషయమై ఈ ప్రభుత్వం మొదటి సారిగా జరిపిన అఖిల పక్ష సమావేశంలో కేవలం మీడియా సమావేశం వలే ప్రసంగాలకు పరిమితమై పోయింది. ప్రధాని పాల్గొని, ఉమ్మడిగా ఒక రాజకీయ వ్యూహం రూపొందించే ప్రయత్నం చేసి ఉంటే మరో రకమైన సందేశం ఇచ్చినట్టు ఉండేది.
రాజ్యాంగ పక్రియలోనే ఇంకా కాశ్మీర్ సమస్యను పరిష్కరించే అవకాశాలు ఉన్నా ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఉదాహరణకు మన రాజ్యాంగం ప్రకారం ఆక్రమిత కాశ్మీర్‌కు పార్లమెంట్‌లో, జమ్మూ కాశ్మీర్ శాసన సభలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం కూడా ఆ దేశంలో భాగం కాదు. అది కాశ్మీర్ లోయలోని ప్రాంతం కూడా కాదు. నాడు షైక్ అబ్దుల్లా, నెహ్రూల ధోరణి కారణంగా మనం వదులుకోవలసి వచ్చిన లడక్, జమ్ముల ప్రాంతాలలోని భాగాలు.
ఆక్రమిత కాశ్మీర్‌లో  ప్రజలు ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారు. మనదేశంలో 36 వేలమంది శరణార్థులుగా ఉన్నారు. వివిధ దేశాలలో కూడా శరణార్థులుగా ఉన్నారు. మరో వంక 6 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు శరణార్థులుగా దేశంలో వివిధ చోట్ల ఉన్నారు. 24 సీట్లను నామినేషన్ ద్వారా గవర్నర్ అసెంబ్లీకి నియమించవచ్చు.
20 మంది ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని, నలుగురు కాశ్మీర్ పండిట్‌లను నామినేట్ చేస్తే వారి వాదనలకు రాజకీయ బలం చేకూరుతుంది. మరోవంక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జనాభా రీత్యా తక్కువగా ఉన్న కాశ్మీర్ లోయ ఆధిపత్యం, అంటే ముస్లింల ఆధిక్యత తగ్గిపోతుంది. అప్పుడు అక్కడి రాజకీయ పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు సాధ్యం కాగలవు.
మరోవైపు ఇద్దరు మహిళలు - ఒకరు కాశ్మీర్ పండిట్, మరొకరు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం వారిని కూడా గవర్నర్ నామినేట్ చేయవచ్చు. అదేవిధంగా మరో ఏడుగురిని లోక్‌సభకు నామినేట్ చేయవచ్చు. వారిలో ఐదుగురు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుండి, ఇద్దరు కాశ్మీర్ పండిట్ ల నుంచి చేయవచ్చు. ఈ స్థానాలను గత 70 ఏళలుగా భర్తీ చేసే ప్రయత్నం చేయకపోవడం ఒకవిధంగా రాజ్యాం గాన్ని అవమానపరచడమే.
ఆక్రమిత కాశ్మీర్ ప్రజా ప్రతినిధులుగా నామినేట్ అయిన ఎంపీలు, ఎమ్యెల్యేలు ప్రపంచ వేదికలపై తమ వాణిని వినిపించడం ప్రారంభిస్తే, ఆ ప్రాంత ప్రజలెవ్వరికీ, పాకిస్థాన్‌లో అటువంటి రాజకీయ స్వాతంత్య్రం లేకపోవడం జరిగితే పరిస్థితులు ఏ విధంగా మారగలవో చెప్పనవసరం లేదు. కాశ్మీర్ విషయంలో భారత్‌కు అంతర్జాతీయంగా అనూహ్యమైన రాజకీయ మద్దతు లభించే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నం ఎందుకు చేయడం లేదు?
పాకిస్థాన్ విధానం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటున్నదనే అభిప్రాయం పలు వర్గాలలో వ్యక్తం అవుతున్నది. భారతదేశం పట్ల అనుసరించ వలసిన వైఖరి గురించి పాకిస్థాన్‌లో తొలి నుండి ఏకాభిప్రాయం నెలకొంది. భుట్టో హయాంలో భారత్‌ను ఇక సంప్రదాయ యుద్ధంలో గెలవలేమని కచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుండే ప్రచ్ఛన్న యుద్ధం చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా, మన దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సైనిక పాలనలో ఉన్నా - ఈ విధానాల్లో ఎటువంటి మార్పు లేదు. వారిలో భిన్నాభిప్రాయాలు లేనే లేవు. అయితే భారతదేశంలో పాకిస్థాన్ పట్ల అటువంటి ఏకాభిప్రాయం ఏర్పడక పోవడం దురదృష్టకరం. ఒకవిధంగా మన రాజకీయ వైఫల్యం. పాకిస్థాన్ తో చర్చలు జరపాలా, వద్దా? ఆర్టికల్ 370ని ఉంచాలా, రద్దు చేయాలా? ఆర్టికల్ 35ఏ ని ఉంచాలా? రద్దు చేయాలా? వంటి అంశాలపై దేశంలో ఏర్పడుతున్న భిన్నాభిప్రాయాలు మన ప్రధాన బలహీనత అని గ్రహించాలి. ఆ దిశలో చెప్పుకోదగిన ప్రయత్నాలు జరగడం లేదు.
పుల్వామా దాడి అనంతరం తగు సమాధానం చెప్పే అధికారం సైన్యానికి ఇచ్చానని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఆ మరుసటిరోజే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే తగు సమాధానం చెప్పగలమని వాయు సేనాధిపతి ప్రకటించారు. మన దేశంలో నిర్ణయాలు తీసుకోవలసిన రాజకీయ నాయకత్వం కానీ, పాకిస్థాన్‌లో వలే సైనిక నాయకత్వం కాదని మరచిపోతున్నామా? జాతీయ భద్రత అంశాలను రాజకీయ వివాద అంశంగా మార్చి, లబ్ధి పొందే ప్రయత్నాలు దాదాపుగా నేడు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఆ విధంగా చేయడం ద్వారా కాశ్మీర్ అంశాన్ని మరింత జటిలం కావిస్తున్నాయని గుర్తించలేకపోతున్నారు.


-చలసాని నరేంద్ర

No comments