karimul haque life story- పద్మశ్రీ కరీముల్ హక్


కరీముల్ హక్ పశ్చిమబెంగాలులో తేయాకు తోటల్లో కార్మికుడు. స్థానికంగా బైక్ అంబులెన్స్ దాదా గా పేరుపొందాడు. జల్పాయిగురి జిల్లాలోని ధాలాబరీతో పాటు ఆ పరిసర గ్రామాల్లోని వ్యాధి గ్రస్తులను తన మోటరు సైకిల్ అంబులెన్స్ పై ఆసుపత్రికి చేరుస్తూ ఆపద్బాంధవుడిగా సేవలందిస్తున్నందుకుగాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
50 యేళ్ళ ఈ తేయాకు తోటల కార్మికుడు గ్రామీణులకు ఆశాకిరణమై నాడు. చాలా యేండ్లక్రితం తన తల్లికి అత్యవసర వైద్యసహాయం అవసరమైనప్పుడు కరీముల్ హక్ సాయం కోసం ప్రతి తలుపు తట్టాడు. అంబులెన్స్ దొరక్క సమయానికి వైద్య సహాయం అందక తలి కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన దరిమిలా అంబులెన్స్ సేవలు లేక వేరెవ్వరూ మరణించరాదని కరీముల్ హక్ నిశ్చయించుకున్నాడు.
14 ఏండ్ల క్రిందట ఒకనాడు తన తోటి కార్మికుల్లో ఒకడు తేయాకు తోటలోనే కుప్పకూలి పోయాడు అంబులెన్స్ తమకు అందే అవకాశం లేనందున తన బైకునే అంబులెన్స్ గా అప్పుడే ఆలోచన తొలిసారిగా ఆయన మదిలో మెదిలింది, ఆ కార్మికుణ్ణి తన వీపుకు కట్టుకొని వెనుకసీటుపై కూర్చునేలా చేసి బైకుమీద జల్పాయిగురి సదర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆ తోటకార్మికుడికి సకాలంలో వైద్యసహాయం అంది ఆరోగ్యం పుంజుకున్నాడు. ఈ సంఘటన తర్వాత బైక్ అంబులెన్స్ ఆయనకు ఒక పూర్తి స్థాయి భావనగా సేవకార్యంగా స్థిరపడింది.
తన గ్రామంలోనే కాక ఆ పరిసర ప్రాంతంలోని 20 గ్రామాల్లో నివసించే ప్రజలందరికీ కరీం ఆపద్బాంధవుడైనాడు, ఆ గ్రామాల్లో రోడ్లు, విద్యుత్తు, మొబైల్ సేవలువంటి ప్రాధమిక సౌకర్యాలేవి లభించేవి కావు. 45 కి.మీ. పరిధిలో ఆసుపత్రి అనేదే లేదు. ఉచితంగానే ఇప్పటివరకు సుమారుగా 3000 నుంచి 3500 మందిని అలా బైక్ అంబులెన్స్ సేవతో ఆసుపత్రికి చేర్చాడు.
ఆయన రాజదం గ్రామనివాసి. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కోడళ్ళు ఉన్నారు. కుమారులు కిళ్ళీషాపు, సెల్ ఫోన్ రిపేరు షాపులతో కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. కరీముల్ హక్ నెలసరి ఆదాయం చాలా తక్కువ. జీవితంలో ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ అవసరంలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్ళటంలో ఎప్పుడూ వెనకాడడు.
ఆయన జీవితంలో సగానికిపైగా బైక్ ఇంధనానికి, పేదలకు కావలసిన మందులకే ఖర్చవుతుంటుంది. అవసరమైన అన్ని వసతులతోకూడిన ఆధునిక అంబులెన్సును తన గ్రామానికి సమకూర్చాలన్నదే ఆయనకున్న ఒకే ఒక కల.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments