భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో రాణి లక్ష్మీబాయి (1835-58) పేరు విననివారుండరు. ఝాన్సీ ప్రాంతానికి చెందిన ధైర్యసాహసోపేతురాలైన మహారాణి ఆమె. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిషు వారి పాలనను ఎదిరించిన వీరనారి ఆమె. బ్రిటిషు వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి ఝాన్సీ లక్ష్మీబాయి ఓ ప్రతీక. వారణాసిలో మోరోపంత్ థాంబేకు ఆమె జన్మించారు. మణికర్ణిక (మను) అనేది ఆమె చిన్నప్పటి పేరు. అప్పట్లో చిన్న మరాఠా సంస్థానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధర రావుకు ఆమెను ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన తరువాత ఆమె లక్ష్మీబాయిగా పేరొందింది. వారసు లెవరూ లేకుండానే గంగాధరరావు మరణించాడు. చనిపోవడానికి ముందు దామోదర్ అనే మగ శిశువును ఆయన దత్తత తీసుకున్నాడు.
అప్పట్లో లార్డ్ డల్‌హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా ఉండేవాడు. దామోదర్‌ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజ ప్రతినిధిగా అంగీక రించడానికి డల్‌హౌసీ నిరాకరించాడు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ సంస్థానాన్ని బ్రిటిషు సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. రాణి లక్ష్మీబాయికి అయిదు వేల రూపాయల చిన్న మొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే, ఈ అగౌరవాన్నీ, పరాయి వారికి లోబడి ఉండవలసి రావడనాన్నీ రాణి లక్ష్మీ బాయి జీర్ణించుకోలేక పోయింది. ఝాన్సీ సంస్థానాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరాదని దీక్ష పూనింది. ఆ తరువాత కొద్ది కాలానికే అసలు సిసలు మరాఠా మహారాణిగా బ్రిటీషు వారితో పోరాడే అవకాశం ఆమెకు వచ్చింది.
1857 మే నెలలో మీరట్, ఢిల్లీలలో సిపాయిలు బ్రిటీషు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఆ విధంగా భారతదేశంలో బ్రిటీషు వారిపై పోరాటం ప్రారంభమైంది. అక్కడ నుంచి అది ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. కాలక్రమంలో ఝాన్సీలో కూడా తిరుగుబాటు తలెత్తింది. ఝాన్సీ సంస్థానమంతటా రాణి లక్ష్మీ బాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటీష్ జనరల్ హ్యూ రోజ్‌పై పోరాటం సాగిస్తూ, రాణి లక్ష్మీబాయి తమ ఝాన్సీ కోటను ధైర్యంగా సంరక్షించింది. అయితే, తన పరిస్థితి అపాయకరంగా మారుతోందని గమనించిన ఆమె బ్రిటీషు సేనల్ని కల్పి ప్రాంతం దగ్గర నిలువరించింది. మరో స్వాతంత్య్ర సమర యోధుడు తాంతియా తోపే అక్కడ ఆమెతో చేతులు కలిపాడు. సిపాయిలను సైన్యంలో చేర్చుకుంటూ, రాణి లక్ష్మీబాయి స్వయంగా పోరాటంలో పాల్గొంది. అయితే, బ్రిటీషు వారు యమునా నదీ తీరంలో కల్పి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపేలు ఇద్దరూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. దాంతో, తిరుగుబాటు ఆగి పోయిందని బ్రటీష్ జనరల్ రోజ్ భావించాడు. అయితే, ప్రసిద్ధ గ్వాలియర్ కోటను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీబాయి, తాంతియా తోపేలు బ్రిటీషు వారిని అదిరిపడేటట్లు చేశారు. గ్వాలియర్ మహారాజు కోట వదిలి పారిపోయాడు. ఆయన బలగాల్లో అత్యధిక భాగం రాణి లక్ష్మీబాయి పక్షం వచ్చేశాయి. దెబ్బతిన్న బ్రిటీషువారు గ్వాలియర్ కోటపై ఒక్కసారిగా దాడి చేశారు. లక్ష్మీబాయి శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తూ తీవ్ర పోరాటం సాగించినప్పటికీ, ఆ యుద్ధంలో ఆమె మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూర ప్రాంతంలో అసువులు బాసింది. ఆ పోరాటంలో సంఖ్యాపరంగానూ, ఆయుధాల విషయంలోనూ బ్రిటీషువారిది పైచేయి కావడంతో లక్ష్మీబాయి అనుయాయులు ఓటమి పాలయ్యారు.
3 Comments
Ten years back i listen this story again now this movement my feeling so nice thank you so much
ReplyDeletetq support this website and read articals
DeleteMaa. Tuje salaam
ReplyDeleteThank You