Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ జీవిత చరిత్ర - jagadish chandra bose in telugu

బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడ...

బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు.

జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ చంద్రబోస్‌ తండ్రికి తమ పిల్లలు ఆంగ్లేయ భాషా స్కూల్లో చదవటం నచ్చలేదు. పిల్లలు మొదట మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాషలో విద్యనభ్యసిస్తే చిన్నతనం నుంచి మన సంస్కృతీ, పరంపరలను అర్థం చేసుకుంటారని ఆయన భావించే వారు. ఆ విషయం బోస్‌ 1915లో బిక్షంపూర్‌ సమావేశంలో గట్టిగా చెప్పాడు. ‘నేను చదువుతున్న స్కూల్లో నా పక్కన మా తండ్రి దగ్గర పని చేస్తున్న ముస్లిం బంట్రోతు కొడుకు ఒక వైపు, ఒక జాలరి అబ్బాయి మరో వైపు కూర్చునే వారు. వారు నా తోటి ఆటగాళ్ళు కూడా. స్కూలు విడిచిన తరువాత వారిద్దరితో నేను మా ఇంటికి వెళ్లగా ఛాందస కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ బేదభావం చూపకుండా వారికీ తిను బండారాలను ఇచ్చేది. హిందూ, ముస్లిం సంప్రదాయాల మధ్య వైషమ్యాలుంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ ఇద్దరు నాకు జంతువుల కథలు చెప్పే వారు. బహుశా ఆ కారణంగానే నాకు ప్రాణుల మీద ప్రకృతి మీద ఆసక్తి కలిగి ఉంటుంది’ అన్నాడు.
జగదీశ్‌ చంద్రబోస్‌ 1869లో మొట్టమొదట హరే స్కూల్లో చేరాడు. ఆ తరువాత కలకత్తాలోని సెయింట్‌ జూనియర్‌ పాఠశాలలో 1875లో చేరాడు. తర్వాత కలకత్తా యూనివర్సిటీలో చేరి ‘నేచురల్‌ సైన్స్‌లో బి.ఎ. పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు.
జగదీశ్‌ చంద్రబోస్‌కు ఐ.సి.ఎస్‌ పరీక్ష పాసవ్వాలన్న కోరిక ఉన్నా అతని తండ్రికి అది నచ్చలేదు. ‘నీ మీద వేరెవరు ఆధిపత్యం చూపించకూడదు. నీ మీద నీవే ఆధిపత్యం చూపించుకోవాలి కాబట్టి సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు వెళ్ళకు. అధ్యాపక వృత్తిని మాత్రమే చేపట్టు’ అని బోస్‌తో భగవాన్‌ చంద్రబోస్‌ చెప్పారు. తన కొడుకును డాకర్ట్‌ను చేయాలని భగవాన్‌ చంద్రబోస్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ను లండన్‌ పంపించాడు. అయితే అనారోగ్యం కారణంగా బోస్‌ మెడిసిన్‌ చదవలేకపోయాడు. చంద్రబోస్‌ ప్రకృతి విజ్ఞానంలో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి ప్రమాణ పత్రం పొంది తదుపరి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎస్‌.సి చేశాడు.
జగదీశ్‌ చంద్రబోస్‌ అనేక విద్యలను అభ్యసించాడు. వైద్యము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, పురావస్తు శాస్త్రములలో పారంగతుడే కాక సైన్సు కథలను రాయడంలో బోస్‌ సిద్ధహస్తుడు. రేడియో సూక్ష్మ తరంగాల మీద పరిశోధనలు చేశాడు. రేడియో ఆవిష్కరణ మీద బోస్‌కు నోబుల్‌ ప్రైజ్‌ రావలసి ఉన్నా మార్కోనీకిచ్చి బేధాభావం చూపారంటారు. వృక్షశాస్త్రం మీద బోస్‌ చేసిన యోగదానం బహు మూల్యమైనది. అతని ప్రతిభను గుర్తించి చంద్రుని మీద ఒక శిఖర బిలానికి (క్రేటల్‌) అతని పేరు పెట్టారు.
1895లో బోస్‌ ధాతు సంబంధిత డిటెక్టర్‌లోనికి తరంగాలను పంపించాడు. దాని ఫలితంగా డిటెక్టర్‌ పైన కొన్ని సంకేత చిత్రాలు వచ్చాయి. ఇదే ప్రయోగం మరల మరల చేసి చూశాడు. అప్పుడు కొంత తేడాను గమనించాడు. సంకేత చిత్రాలు ప్రారంభంలో ఎంత స్పష్టంగా వచ్చాయో ! మరల మరల ప్రయోగం చేసిన కొలది సంకేత చిత్రాల గతి మందగించినట్లు కన్పించింది. దాన్ని చూసి బోస్‌ ఆశ్చర్యపోయాడు. నిర్జీవధాతు పదార్థం (డిటెక్టర్‌)లో ప్రతిసారి ఒకే విధమైన సంకేత చిత్రాల ప్రతిపాదన కనిపించాలి. ప్రాణులలో మాత్రమే సంవేదన ఎక్కువ, తక్కువలుగా కనిపించాలి. అలసట వచ్చినప్పుడు (ప్రతిపాదన) సంవేదన మందగిస్తుంది. డిటెక్టర్‌లో ప్రతిపాదన ఎక్కువ తక్కువలవటం చూసి అనుమానం ఏర్పడింది. కొంతసేపు డిటెక్టర్‌కు విశ్రాంతి ఇచ్చినప్పుడు సంకేత చిత్రాలు మొదటి మాదిరిగానే వచ్చాయి. ఇలా ఎందుకు అవుతుందని ఆలోచించాడు. ప్రయోగాన్ని మళ్ళీ చేసి చూశాడు. చాలా నిశితంగా పరిశీలించి, పరీక్షించిన పిదప నిర్ణీత పదార్థాల్లో కూడా ప్రాణశక్తితో కూడిన సంవేదనశీలత ఉందని సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తేడా ఏమిటంటే నిర్జీవ పదార్థం నిశ్చేష్ట (ఇనర్ట్‌)గా ఉంటుంది అంతే ! జగదీశ్‌ చంద్రబోస్‌ దీన్ని నిరూపించిన సమయంలో పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిస్థితి ఎలా ఉందో కింది ఉదంతం ద్వారా మనకు తెలుస్తుంది. రాయల్‌ సైంటిఫిక్‌ సొసైటీలో జగదీశ్‌ చంద్రబోస్‌ ఉపన్యాసం జరగాల్సి ఉంది. ఇంగ్లండ్‌ దేశపు సుప్రసిద్ధ జీవశాస్త్రవేత్త హార్టాగీ కోహాబ్జ్‌ను ఓ శాస్త్రవేత్త ఇలా ప్రశ్నిస్తాడు. ‘ఈ రోజు జగదీశ్‌ చంద్రబోస్‌ గారి ఉపన్యాసం ఉంది. అతడు జీవులలోను, నిర్జీవులలోను ప్రాణముందని నిరూపించాడు. మీరు ఉపన్యాసం వినడానికి వెళ్ళారా ?’ అని అడుగుతాడు. అందుకు హార్టాగ్‌ ఇచ్చిన సమాధానం ‘నేను ఇంకా స్పృహలోనే ఉన్నాను. నేనేమి తప్పతాగి లేను. మీరు నన్నెలా అర్థం చేసుకుంటున్నారు. నేనిలాంటి ఊహా కల్పితాలను ఎలా నమ్ముతాననుకొంటున్నారు?’ అన్నాడు.
అయితే బోస్‌ ఉపన్యాసాన్ని విని గేలిచేయాలనే ఉద్దేశంతో హార్టాగ్‌ కోహాబ్జ్‌ ఆ సభకు వస్తాడు. ఇలా మరెందరో పరిహాసాలాడాలని, అతడ్ని అవమాన పరచాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. జగదీశ్‌ చంద్రబోస్‌ అక్కడ కేవలం మౌలిక భాషణ మాత్రమే ఇవ్వలేదు. తగిన యంత్ర పరికరాల సహాయంతో ప్రత్యక్షంగా ప్రయోగాత్మ కంగా ప్రదర్శన చేస్తూ తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. గేలిచేసే దృష్టితో, ఉపేక్షా భావంతో సభకు వచ్చిన వారందరూ 15 నిముషాలు గడవగానే ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేశారు. సభా ప్రాంగణం మారుమోగింది. హాలంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది. ప్రదర్శన, ఉపన్యాసం ముగియగానే సభాధ్యక్షులు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నించవచ్చని మూడుసార్లు అన్నారు. తర్వాత సుప్రసిద్ధ జీవశాస్త్రవేత్త హార్టాగ్‌ లేచి ‘ఎలాంటి సందేహాలు లేవు. అడగవలసిన ప్రశ్నలూ లేవు. బహుమ¬దయుడు అత్యంత ప్రమాణ పూర్వకంగా తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. అప్పుడప్పుడు ఆయన భాషణ విని, ప్రయోగం చూసి కొంత సందేహం కలిగినా మరు క్షణమే రెండవ ప్రయోగంతో ఆ సందేహం పటాపంచ లయింది’ అన్నాడు. ‘ఏకాత్మక చేతనత్వాన్ని నిరూపించిన జగదీశ్‌ చంద్రబోస్‌ సఫల సిద్ధాంతాన్ని శంక రహితంగా విశ్వసిస్తున్నాను’ అని సభాధ్యక్షుడు పేర్కొన్నారు.

జగదీశ్‌ చంద్రబోస్‌ చెట్లపైన అనేకానేక ప్రయోగాలు చేశాడు. తన వెంట మొక్కలను తోడుగా తీసుకొని విశ్వయాత్రను విజయవంతంగా కొనసాగించాడు. అనేక సున్నిత యంత్రాలను తయారు చేశాడు. వాటి ద్వారా మొక్కలలో జరిగే ప్రతిక్రియల్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అతను క్రోక్సోగ్రాఫ్‌ అనే యంత్రాన్ని తయారుచేశాడు. ఆ యంత్రం సంవేదనలను, స్పందనలను కోటి రెట్లు అధికంచేసి చూపిస్తుంది. మొక్కలకు యంత్రాన్ని కట్టి ఉంచినప్పుడు రోజంతా ఆ మొక్క పొందిన అనుభూతులను కథగా ఆ యంత్రం తెలుపుతుంది.
బోస్‌కి పరిశోధనలు కొనసాగించడానికి తగినంత డబ్బు ఉండేది కాదు. సోదరి నివేదిత అతని ప్రజ్ఞాపాటవాలకు ప్రభావితురాలై ప్రజల నుండి విరాళాలు సేకరించి అతనికి ఆర్థిక సహాయం అందజేసేది. లేకపోతే అతను తయారుచేసిన యంత్రాలకు, ఉపకరణాలకు పేటెంట్‌ దొరికి ఉండేది కాదు. బోస్‌ తన ప్రయోగాల కారణంగా సమాజానికి లాభం చేకూరుతుందని ఇతరులను ప్రోత్సహించే వాడు. అతను రూపొందించిన యంత్రాలను వ్యాపార ప్రయోజనం కోసం బోస్‌ వాడుకోలేదు. ‘ధనం సంపాదించాలన్న పేరాశ విడిచి పెట్టమని, సద్బుద్ధిని అలవరచుకోమని, నీవు చేసిన కృషికి నీకు న్యాయంగా ఏమి లభిస్తుందో దానితో మనస్సును సంతృప్తి పరచుకోమని, మూర్ఖునిగా మిగిలి పోవద్దని’ శ్రీ శంకరాచార్యులు ఆయనకు హితవు చెప్పారు. జగదీశ్‌ చంద్రబోస్‌ అతనికి వారసుడు అందుకే నిస్వార్థంగా పరిశోధనలు చేసి విశ్వాంతరాళంలో ఖ్యాతిని, కీర్తిని ఆర్జించాడు. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి భారతీయ ఉపఖండంలో అతను పునాదులు వేశాడు.
బిరుదులు
జగదీశ్‌ చంద్రబోస్‌కు 1903లో కంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద ఇండియన్‌ ఎంపైర్‌, 1911లో కంపేనియన్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా, 1917లో వైట్‌ బేచులర్‌ బిరుదులనిచ్చి బ్రటిష్‌ ఇండియా ప్రభుత్వం సత్కరించింది. 1920లో ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి సత్కారం ఉపాధిని పొందాడు. జాన్‌ స్టార్ట్‌ ర్యాలీలో కొంతకాలం విద్యా విషయిక సలహాదారుగా పని చేశాడు. బోస్‌ తన జీవితాన్ని అధ్యాపక వృత్తికి, పరిశోధనలకు అంకితం చేశాడు.
జగదీశ్‌ చంద్ర బోస్‌ శత జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 1958 నుంచి జెబిఎన్‌ఎస్‌టిఎస్‌ పేరుతో ఉపకార వేత నాలు అందిస్తోంది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఒక పోస్టల్‌ స్టాంపుని అతని ఛాయా చిత్రంతో విడుదల చేసింది.
సురేంద్రనాథ్‌ బోస్‌, మేఘనాథ సహ, ప్రశాంత చంద్ర, మ¬లానోబిస్‌, శిశిర కుమార్‌ మిశ్రా, దేవేంద్ర మోహన్‌బోస్‌ వంటి పేరుపొందిన శాస్త్రవేత్తలు అతని శిష్యులలో కొందరు.
అతని విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో పేర్కొనదగినవి రెస్పాన్స్‌ ఇన్‌ ది లివింగ్‌ అండ్‌ నాన్‌ లివింగ్‌ (1902), ద నెర్రస్‌ మెకానిజమ్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌ (1926). ఇవి కాక అనేక వ్యాసాలను రాశాడు. జగదీశ్‌ చంద్రబోస్‌ 1937 నవంబరు 23 న 79 సంవత్సరాల వయస్సులో గిరిఢీ (ఝార్ఖండ్‌)లో మరణించాడు.
జగదీశ్‌ చంద్రబోస్‌ తన ప్రయోగాలను అనుభవాలను యూనిట్‌ ఆఫ్‌ లైఫ్‌, వాయిస్‌ ఆఫ్‌ వైఫ్‌ అనే వ్యాస సంపుటాల ద్వారా వివరించాడు. పశు పక్ష్యాదులలో, క్రమికీటకాలలోనే కాదు సమస్త జగత్తులోనూ ఒకే ఆత్మ ఉందనే మన ప్రాచీన మహర్షుల అమృత వచనాలను నిరూపించిన ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్‌.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. Thankyou sir chandrabose gari gurinchi teliyani vishayalu teliyajeshsru dhanvadamulu

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..