Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన మంథని ముద్దుబిడ్డ-dahagam lakshmi narayana - megaminds

                                       క్షామం....భయంకరమైన క్షామం...మనుషులు మనుషుల్ని పీక్కుతినేటంతటి క్షామం...ఆకలితో అలమటించే వారికి కాసిం...

                                       క్షామం....భయంకరమైన క్షామం...మనుషులు మనుషుల్ని పీక్కుతినేటంతటి క్షామం...ఆకలితో అలమటించే వారికి కాసింత గంజి పోయాలి. "ఎవరెంత విరాళం ఇస్తారు?" ప్రభుత్వం ధనవంతుల్ని అడిగింది. సేట్లు, సుబేదార్లు వందలు, వేలు చదివించుకున్నారు. ఒకరిద్దరు లక్ష దాకా వచ్చి ఆగిపోయారు. "లక్ష్మీనారాయణ్ సాబ్.... మరి మీ వంతు?" గవర్నర్ అడిగారు...తలపాగా, కళ్లద్దాలు, నిలువెత్తు విగ్రహం ఉన్న సదరు లక్ష్మీనారాయణ చెదరని చిరునవ్వుతో "ఇదిగో నా ఇనప్పెట్టె తాళం చెవి" అని చేతికిచ్చాడు. అందరూ ఘొల్లుమని నవ్వారు. అందరినీ తన ఇంటికి రమ్మని లక్ష్మీనారాయణ ఆహ్వానించాడు. ఇనప్పెట్టెని సేవకులు మోసుకొచ్చారు. గవర్నర్ గారు తాళం తెరిచారు. అందులో లక్షల విలువ చేసే బంగారం, కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు....ఆ రోజుల్లో అది అరు లక్షల విలువ చేస్తుంది. ఇప్పుడు కోట్లు విలువ చేస్తుంది.
                             డబ్బంటే ఏమిటి? డబ్బును ఏం చేయాలి? ఈ సంగతి చాలా మందికి తెలియదు. ధనవంతులకు అస్సలు తెలియదు. డబ్బంటే ఏమిటో, దాన్నేం చేయాలో లక్ష్మీనారాయణకు తెలుసు.పేరు లక్ష్మీనారాయణ.... ఆయన లక్ష్మీనారాయణుడిలాగానే బతికాడు...ఆయన కథ చాలా విచిత్రం....ఆయన కథ రెండు రాష్ట్రాల్లో విస్తరించింది..... కటిక పేదరికం, కడలేని ఐశ్వర్యం, సకల వైభోగం, సర్వస్వత్యాగం ... ఈ ఎక్స్ ట్రీమ్స్ మధ్యే ఆయన జీవితం సాగింది.
                              కరీంనగర్ జిల్లా మంథని నుంచి పుల్లయ్య గారనే పురోహితులు ఉదరపోషణార్థం 1850 ప్రాంతంలో నాగపూర్ దగ్గర్లోని దహగామ్ కి వలస వెళ్లారు. ఆయనకి ముగ్గురు కొడుకులు. ముగ్గుర్లో పెద్దవాడు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణకి పద్ధెనిమిదేళ్లు వచ్చేసరికి తండ్రి పోయాడు. తల్లి మంథనికి వచ్చేయాలనుకుంది. కానీ పేదరికం నాగపూర్ దాటనీయలేదు. లక్ష్మీనారాయణ ఒక పెంకులు ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అలా పనిచేస్తూనే 12 వ తరగతి దాకా చదివాడు. చదువంటే ఎంత ఇష్టమంటే కటికపేదరికంలోనూ పుస్తకాలు కొనేవాడు. టెక్నాలజీ అన్నా, సైన్సు అన్నా తెగ ఇష్టం. ప్రాచీన భారత విజ్ఞానం నుంచి పాశ్చాత్య విజ్ఞానం దాకా అన్నీ చదివేశాడు. 
                               యజమానికి అతి నమ్మకమైన పనివాడిగా మారారు లక్ష్మీనారాయణ. ఆయన వ్యాపారాన్ని మూడు పువ్వులు, మూడు వేల కాయలుగా మార్చాడు. యజమానికి భార్యాపిల్లలు లేరు. ఆయన పోతూ పోతూ వ్యాపారాన్ని లక్ష్మీనారాయణకి అప్పచెప్పి వెళ్లిపోయాడు. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వ్యాపారం ముప్ఫై వేల కాయలైంది. మూడు లక్షల మొక్కలైంది. 
                            మాంగనీస్ గనుల వ్యాపారంలోకి వెళ్లాడు. అక్కడా పట్టిందల్లా మ్యాంగనీసైంది. తవ్వితే ఒక్క ఎకరాకి 500 బళ్లలో మ్యాంగనీస్ బయటకొచ్చేది. ఆయన మన దేశం నుంచి విదేశాలకు మాంగనీస్ ఎగుమతి చేసిన తొలి వ్యాపారవేత్త అయ్యాడు. అంతకన్నా గొప్పేమిటంటే ... ఆయన ఇంట్లో బ్రిటిషర్లు సర్వర్లుగా పనిచేసేవారు. అలా తెల్లోళ్ల చేత చాకిరీ చేయించుకున్న మొట్టమొదటి భారతీయుడు కూడా అతనే...1920లో ఆయన సెంట్రల్ ప్రావిన్సెస్ (నేటి మధ్యప్రదేశ్, విదర్భ)లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన చేసిన ప్రసంగాలు 770 పేజీల పుస్తకమయ్యాయి. కాంప్టీ పట్టణానికి మునిసిపల్ చైర్మన్ అయ్యాడు. తరువాత పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. బ్రిటిషర్లు ఆయనకి రాయబహద్దూర్ బిరుదిచ్చారు. ఆయన తన లక్ష పుస్తకాల లైబ్రరీ మొత్తం వాల్తేరు (నేటి విశాఖపట్నం) లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తుకి (నేటి ఆంధ్ర యూనివర్సిటీకి) ఇచ్చేశారు. (అప్పట్లో తెలంగాణ, ఆంధ్ర ఫీలింగులు లేవు మరి!) ఆంధ్ర యూనివర్సిటీలో చెదలు తినకుండా మిగిలిన పాతపుస్తకాల్లో వెతికితే ఆయన సంతకం ఉన్న పుస్తకం ఒక్కటైనా దొరికి తీరుతుంది. జీవన సంధ్యాకాలంలో ఆయన తన యావదాస్తిని నాగపూర్ విశ్వవిద్యాలయానికి ఇచ్చేశారు. అప్పట్లో అది 35 లక్షలు... ఇప్పట్లో ఎంతో లెక్కేసుకోవాలన్న కోరిక ఉన్నవాళ్లు దయచేసి కాలిక్యులేటర్లు బయటకి తీయండి. ఈ రోజు నాగపూర్ యూనివర్సిటీ ఉందంటే అది లక్ష్మీనారాయణ దయవల్లే. సైన్సు టెక్నాలజీల పట్ల ఉన్న అభిరుచితో యూనివర్సిటీలో ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. దేశంలోని సర్వోత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదొకటి. 
                                  తమాషా ఏమిటంటే లక్ష్మీనారాయణ తన యావదాస్తిని ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చేద్దామనే వచ్చాడు. అప్పటి వీసీ గారికి తీరిక లేక లక్ష్మీనారాయణకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అందుకే ఆ యూనివర్సిటీకి డిసప్పాయింట్ మెంటే మిగిలింది. విశాఖ వెళ్లవయ్యా అంటే నాగపూర్ నాన్నా రమ్మంది. 
ఆయన లేదనకుండా, కాదనకుండా వేల మంది పేద విద్యార్థులకు ఆజీవనకాలమూ ఆర్థికసాయం చేశారు. మధ్యభారతంలో తొలితరం విద్యాధికుల్లో చాలామందికి ఆయన సాయమే ఆధారమైంది. నాగపూర్ కే గర్వకారణమైన హితవాద పత్రికకి, గోపాల కృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి లక్షల రూపాయల విరాళాలిచ్చారు. తన నౌకర్లు, చాకర్లకి, బంధువులు, మిత్రులకు ఎకరాల కొద్దీ భూములు ఇచ్చారు. 
                      ఆయన పేరు దహగాం లక్ష్మీనారాయణ. ఆయన మన మంథని బిడ్డ...ఆయన దహగాం గారాల బిడ్డ...చదువుల కోసం వచ్చే వారందరినీ సాదరంగా ఆహ్వానించేందుకు నాగపూర్ లోని లక్ష్మీనారాయణ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ముందు దహగాం లక్ష్మీనారాయణ విగ్రహం ఇప్పటికీ నిలుచునే ఉంది. 
చనిపోతూ చనిపోతూ వీలునామాలో ఆయన ఇలా వ్రాశారు.

"నేను చాలా మంది మిత్రులకు అప్పులు ఇచ్చాను. నేను బతికుండగా వారు తిరిగి ఇస్తే సరేసరి. ఇవ్వని వారి దగ్గర నుంచి నేను చనిపోయాక ఒక్క పైసా కూడా వసూలు చేయవద్దు."
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments