Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రక్షాబంధన్-రాఖీ పండుగ- Raksha Bandhan Speech

భారతదేశంలో జరిగే ఉత్సవాలు మన పూర్వజుల దార్శనికతకు మచ్చుతునకలు. సమాజం మనుగడకు, వికాసానికి అవసరమైన దృష్టికోణాన్ని, జీవన దిశను అందించే దివ్...

భారతదేశంలో జరిగే ఉత్సవాలు మన పూర్వజుల దార్శనికతకు మచ్చుతునకలు. సమాజం మనుగడకు, వికాసానికి అవసరమైన దృష్టికోణాన్ని, జీవన దిశను అందించే దివ్యౌషధాలు. మన జాతి అనాదిగా జరుపుకునే ఉత్సవాలలో శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే రక్షాబంధన్‌కు ఇటువంటి విశిష్టత, ప్రత్యేకత ఉంది.
కాలగమనంలో సమాజ భద్రతకు, రక్షణకు సవాళ్లు ఎదురయ్యే సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో సమాజం మనోబలం నిలబెట్టి, వందరెట్లు పెంచి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని అందుకునే శక్తిని ఇచ్చేది రక్షాబంధన్‌ ఉత్సవం.
పౌరాణిక, చారిత్రక సందర్భాలు
రక్షాబంధన్‌ ప్రాశస్త్యాన్ని తెలియజేసే అనేక సన్నివేశాలు చరిత్రలో కనబడతాయి. భాగవత పురాణంలో బలిచక్రవర్తి శ్రీమహావిష్ణువు నుండి వరాన్ని పొంది ఆయనను తన బందీగా చేసుకుని, పాతాళలోకంలో తన ఇంటివేలుపుగా పూజిస్తుంటాడు. లక్ష్మీదేవి విష్ణువును ఎలాగైనా వైకుంఠానికి రప్పించాలని అనుకుని బలిచక్రవర్తికి రక్షాసూత్రం (రాఖీ) కట్టింది. దానికి ప్రతిగా ఏదైనా కోరిక కోరుకోమన్న బలి చక్రవర్తిని లక్ష్మీదేవి విష్ణువు వైకుంఠానికి తిరిగి చేరాలని కోరుకుంది. అలా రక్షాసూత్రం ద్వారా లక్ష్మి మహాబలసంపన్నుడైన బలిచక్రవర్తిని మంచి చేసుకుని విష్ణువును గెలుచుకుంది.
భవిష్యపురాణంలో రాక్షసుల దండయాత్రలో దేవేంద్రుడు బలహీనుడై ఓటమి అంచున ఉన్న సమయంలో ఇంద్రుని భార్య శచీదేవి దేవతలందరి తరపున దేవేంద్రునికి ‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్షేమాచలమాచల’ (దేనికి మహాబలసంపన్నుడైన బలిచక్రవర్తి కూడా వశమయ్యాడో, దానిని నీకు కడుతున్నాను. ఈ రక్షణ శక్తి తొలగకుండు గాక!) అని రక్షాసూత్రం కడుతుంది. ఆ శక్తి వలన దేవేంద్రుడు రాక్షసులపై గెలిచి విజయుడయ్యాడు. నాటినుండి రక్షాబంధన్‌ రోజున ఈ శ్లోకాన్ని పఠించడం ఆనవాయితీ అయింది.
తరువాతి కాలంలో రాజపుత్ర స్త్రీలు తమ రాజ్యానికి విదేశీయుల నుండి ముప్పు ఏర్పడినప్పుడు పొరుగు రాజులకు రక్షలు పంపేవారు. ఆ రక్షలు అందుకున్న రాజులు తమ సోదరీమణులకు రక్షాకవచంగా నిలిచి ఆ రాజ్యాలను రక్షించేవారు.
బ్రిటీషువారు కుట్రతో 1905లో బెంగాల్‌ విభజన చేసినప్పుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కలకత్తాలో సామాజిక రక్షాబంధన్‌ నిర్వహించి తద్వారా మహాశక్తి నిర్మించి బ్రిటిష్‌ వారి పన్నాగాలను తుత్తునియలు చేసారు. బెంగాల్‌ విభజన రద్దయింది. దేశం ముక్కలు కాకుండా ఆగింది.
సత్సంబంధాలకు రక్షాబంధన్‌ స్ఫూర్తి
మనిషి దేశవిదేశాల్లో తన మేధస్సుద్వారా బుల్లెట్‌ రైళ్లు, సూపర్‌ కంప్యూటర్లు కనుగొన్నాడు. కాని మానవ సంబంధాలను మెరుగుపరుచుకునే విజ్ఞానం కనుగొనలేదు. వ్యక్తికీ కుటుంబంలోని మరొక వ్యక్తికీ మధ్య, ఒక కుటుంబానికీ మరొక కుటుంబానికీ మధ్య, మెరుగైన సంబంధాలు ఎంతో అవసరం. ఒక విదేశీ ఎన్‌సైక్లోపిడియాలో రక్షాబంధన్‌ గురించి It is one of the several occassions in which family ties are well affirmed in India అని రాశారు. మనిషికి శాంతి, సుఖం వస్తువుల ద్వారా దొరకుతుందని పాశ్చాత్యులు భావించారు. కానీ చక్కని మానవ సబంధాలే సుఖశాంతులకు మూలమని మన పూర్వీకులు దర్శించారు. వాటిని పెంచిపోషించుకునే వివిధ పద్ధతులను సాంప్రదాయాలుగా, ఉత్సవాలుగా మన ఋషులు మన జీవన విధానంలో అమర్చారు. సోదర భావాన్ని మన కుటుంబం నుండి సమాజానికీ విస్తరించారు.
సంస్కృతి రక్షణ – రక్షాబంధన్‌
పరస్త్రీని తల్లిగా, పరులసొమ్ము మట్టిగా, సమస్త సృష్టిని భగవంతుని రూపంగా తలచి జీవించే శ్రేష్ట సంస్కృతికి వారసులం మనం. విశ్వకళ్యాణం కోసం ఈ సంస్కృతిని మనం పదిలంగా కాపాడుకుని తరువాతి తరాలకు అందించాలి. మన కుటుంబాలు, గ్రామాలు ఈ మహోన్నత సంస్కృతికి పట్టుకొమ్మలుగా నిలవాలి. ఆధునీకరణ పేరుతో నేడు మనం పాశ్చాత్య జీవన విధానాన్ని అనుకరిస్తూ మన కుటుంబ విలువలను దిగజార్చుకుంటున్నాం. ఆ స్థితి నుండి మన సమాజాన్ని రక్షించుకోవవలసిన అవసరం నేడు ఏర్పడింది. అందుకు మనకు స్ఫూర్తినిచ్చేది రక్షాబంధన్‌ మహోత్సవం.
సరిహద్దులు భద్రం కావాలి
దేశ రక్షణలో పాల్గొనడంతో సమానమైన పుణ్యం, వ్రతం, యాగం మరేదీ లేదని ఆర్యోక్తి. మనదేశ భూభాగాలను ఆక్రమించుకునేందుకు వాయువ్య, ఉత్తర, ఈశాన్య, సరిహద్దుల వైపునుండి శత్రుదేశాలు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో 76 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నదేశం శతాబ్దం చివరకు 32 లక్షల చదరపు కిలోమీటర్లకు కుంచించుకు పోయింది. ఒక శతాబ్దంలో 50 శాతానికి పైగా తన స్వంత భూభాగాన్ని కోల్పోయిన దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటేనేమో! నేటికీ వాయువ్యం నుండి పాకిస్తాన్‌ కాశ్మీర్‌ను, ఈశాన్యం నుండి చైనా అరుణాచల్‌ను ఆక్రమించు కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ దురాక్రమణను తిప్పి కొట్టేందుకు మన సైన్యం చూపుతున్న ధైర్యసాహసాలు అద్భుతమైనవి. మన దేశ ప్రజలు, ప్రభుత్వాలు సైన్యానికి అండగా నిలవాలి. ఇది అవసరమైనంతగా లేకపోవడం దురదృష్టకరం.
1948లో పాకిస్తాన్‌ మనదేశంలోకి చొరబడి కాశ్మీర్‌లో కొంత భాగం ఆక్రమించగా మన సైన్యం వారిని వెనక్కి తరిమికొట్టడం ప్రారంభించింది. ఆ ప్రక్రియ పూర్తికాకుండానే అప్పటి మన బలహీన నాయకత్వం మన సైన్యానికి యుద్ధవిరమణ ఆదేశాలు జారీ చేసింది. దాంతో విలువైన ఆ భూభాగం నేటికీ మన వశం కాలేదు. గత అనుభవాల నుండి మనం పాఠం నేర్వాలి. సైన్యం స్వేచ్ఛను హరించే చట్టాలను రూపొందించి, వారి బలిదానాలను తృణీకరించడ మంటే వారిని అవమానపరచడమేనని గ్రహించాలి. ఇటువంటి చట్టాలను అమలు పరచమని వత్తిడి చేసే అధికార వ్యామోహ రాజకీయ పక్షాలు మనదేశంలో ఉండటం దురదృష్టకరం. దేశభద్రతను ఛిద్రంచేసే ఇటువంటి వారికి ప్రజాస్వామ్యం గుణపాఠం చెప్పకపోతే మళ్లీ మరోసారి మన విలువైన భూభాగాలు కోల్పోయే ప్రమాదం దాపురిస్తుంది. ఈ మధ్య జరిగిన డోక్లామ్‌ సంఘటన అటువంటిదే. ఆ సమయంలో ప్రస్తుత మన సైన్యం, ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రశంసనీయమైనది. ఈ రక్షాబంధన పర్వం దేశరక్షణ చేసే సైన్యానికి, ఇతర రాజ్యాంగ వ్యవస్థలను ధృడం చేసేలా మనకు స్ఫూర్తినివ్వాలి.
దేశ ఆంతరిక భద్రతకు మరో పెనుసవాలు బంగ్లాదేశ్‌ నుండి భారత్‌లోకి వస్తున్న అక్రమ చొరబాటుదార్లు. ఈ సంఖ్య ఈశాన్యంలో ప్రస్తుతం 2 కోట్లకు చేరిందని, వీరంతా ఓటర్లుగా నమోదై దాదాపు 200 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రభావం చూపగలుగుతున్నారని నివేదికలు చెపుతున్నాయి. లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు వీరిని తమ అరాచక కార్యకలాపాలకు వినియోగించుకునే ప్రమాదాన్ని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను నిరోధించటానికి అక్రమంగా ప్రవేశించిన వారిని ప్రభావం చూపే పరిధి నుండి తొలగించాలని భావించి, సుప్రీంకోర్టు, ప్రభుత్వం జాతీయ పౌర నమోదును ప్రారంభించటం హర్షించదగ్గ పరిణామం. అది విజయవంత మవ్వాలని కోరుకుందాం.
సమరసతకు స్ఫూర్తి
మనం రాజ్యాంగం సాక్షిగా సమాజ సమానత్వ సాధనలో చాలా అడుగులు ముందుకేసాం. ఇంకా రాజ్యాంగ ఫలాలు పౌరులందరికీ అందడానికి చాలా కృషి జరగాలి. దానితో పాటు సౌభ్రాతృత్వాన్ని, సమరసతను సాధించడంలో మరింత వేగంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. భారతమాత సంతానమైన మనం అన్నదమ్ములవలె కులాల కతీతంగా అన్యోన్యంగా కలసిమెలసి జీవించే స్థితి అనతికాలంలోనే సాధించాలి. మన హృదయాలు, దేవాలయాలు, జలాశయాలు, స్మశానాలు అన్నీ కుల వివక్షకు తావులేని ప్రదేశాలుగా రూపొందాలి. ఇది జరగకపోతే దీని కారణంగా నిర్మాణమయ్యే అసంతృప్తి, అభద్రతా భావన ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది.
1950లో డా||బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇదే విషయాన్ని రాజ్యాంగ సభలో ప్రస్తావిస్తూ ’26 జనవరి నాడు మనం రాజకీయపరమైన, రాజ్యాంగపరమైన సమానత్వాన్ని స్వీకరించాము. అనతికాలంలోనే సామాజిక, ఆర్థిక సమానతను కూడా సాధించాలి. అది జరగకపోతే అది పొందలేకపోయిన వ్యక్తులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నించే ప్రమాదముంది’ అన్నారు.
2009లో డిల్లీలో అరెస్టయిన కోబర్‌గాండీ అనే మావోయిస్టునేత వద్ద అర్బన్‌ మావోయిజం విస్తరణకై రూపొందించిన డాక్యుమెంట్‌ లభ్యమైంది. దానిలో ‘నగరాలలో ఎస్‌సి-ఎస్‌టిల, బలహీనవర్గాల, మైనార్టీల, మహిళల అసంతృప్తి ఉద్యమాలను ఆసరాగా తీసుకోవాలి. వారికి ఆర్థిక, మేథో సహాయాలను అందించాలి. తిరిగి వారినుండి మనకు కావలసిన ఆర్థిక, మానవ వనరులను పెంపొందించుకోవాలి’ అని ఉంది. ఈ అర్బన్‌ మావోయిజమ్‌ కోసం కొన్ని విశ్వవిద్యాలయాలను, కొన్ని ముఖ్య నగరాలను, వాటిని కలుపుతూ కారిడార్లను గుర్తించారు. కొన్ని ఎన్‌.జి.ఓ.లను, కబీర్‌ కళామంచ్‌ వంటి కళావేదికలను కూడా ఈ కార్య విస్తరణకు ఎంచుకున్నారు.
మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌లో 2017 డిశంబర్‌ 31న ఎల్గార్‌ పరిషద్‌ ఏర్పాటుచేసిన సభలో గుజరాత్‌ ఎం.ఎల్‌.ఏ. జిగ్నేష్‌ మేవానీ, జెఎన్‌యు విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌, వేముల రోహిత్‌ తల్లి రాధిక తదితరులంతా పాల్గొని ఎస్‌సి-ఎస్‌టిలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశారు. ఆ మర్నాడు మహారాష్ట్ర అంతటా జరిగిన అల్లర్లలో కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసం జరిగింది. ఒకరు చనిపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన పూనా పోలీసు శాఖ అల్లర్లకు కారణమైన ఐదుగురు వ్యక్తులను, వారికి మావోయిస్టులతో ఉన్న సంబంధాలను వెల్లడి చేసింది. అంతేకాక ఈ సభకు మావోయిస్టుల ఆర్థిక సహాయం అందిందనీ, దీనికి 2 నెలల ముందే యోజన జరిగిందనీ పూనా జాయింట్‌ పోలీస్‌ కమీషనర్‌ వెల్లడించారు.
జరిగే నేరాలకు, కుల వివక్ష, వర్ణవివక్ష, మతవివక్ష రంగుపూసి అంతర్గత విబేధాలు సృష్టించి, విద్వేషాలు రగిలించి మన సమాజాన్ని మరింత బలహీన పరిచేందుకు దేశంలోని విజాతీయ, అసాంఘిక శక్తులన్నీ ఒక్క తాటిపైకి వచ్చి కుట్రలు పన్నుతున్నట్లు అనేక వరుస సంఘటనల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. ఈ జాతి విద్రోహకర మూకలన్నీ వాతావరణాన్ని మరింత కలుషితం చేసి కరాళనృత్యం చేస్తాయి. అవి ఉత్పన్నం చేసే భ్రమలకు లోను కాకుండా జాతి సమైక్యతకు, సమగ్రతకు తూట్లు పడనీయకుండా కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ స్ఫూర్తి అందించేదే మన రక్షాబంధనం.
నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష. మనం ఈ జాతి సమైక్యతకు, సమగ్రతకు సార్వభౌమతకు రక్ష అనేదే ఈ విళంబి నామ సంవత్సర రక్షాబంధనం అందించే స్ఫూర్తి, సందేశం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments