atal bihari vajpayee life history in telugu- అటల్ బిహారీ వాజ్ పాయ్ జీ జీవిత చరిత్ర

megaminds
0

అటల్ బిహారీ వాజపేయి (జ.డిసెంబర్ 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' మార్చి 27 2015 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.

ప్రారంభ జీవితం మరియు విద్య:
                    భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ,ఆంగ్లము మరియు సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనారు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.
                 వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో "పూర్తి స్థాయి సేవకుడు" అనగా ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యారు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశారు.
               రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ యొక్క విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ పంపబడ్డ వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న "రాష్ట్రధర్మ" (హిందీ మాసపత్రిక), "పాంచజన్య" (హిందీ వారపత్రిక) పత్రికలు మరియు స్వదేశ్" మరియు "వీర్ అర్జున్" వంటి దిన పత్రికలలో పనిచేయటం ప్రారంభించాడు. వాజపేయి జీవితాంతం వివాహమాడకుండా బ్రహ్మచారిగా జీవించారు.
ప్రారంభ రాజకీయ జీవితం:
                1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టు కాబడిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది. ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని వ్రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు.
                1951 లో క్రొత్తగా యేర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణపక్ష రాజకీయపార్టీలో పనిచేయడానికి, ఆర్.ఎస్.ఎస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని నియమించింది. ఈ సంస్థ ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పనిచేస్తున్న హిందూ రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ యొక్క ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క అనుయాయిగా మరియు సహాయకునిగా మారాడు. 1954 లో ముఖర్జీ, కాశ్మీరులో, కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు ఆయన వెంటే ఉన్నాడు. ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కాశ్మీరు జైలులో మరణించాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి భారతదేశ దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు.
                   ఆయనకు గల వాగ్ధాటి మరియు సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్ లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ యొక్క మొత్తం బాధ్యత, యువ వాజపేయిపై పడింది. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్ మరియు లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్ ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించారు.
రాజకీయ జీవితం (1975–1995):
         1975 నుండి 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రేస్ పార్టీకి చెందిన ప్రధాని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు కాబడినారు. 1977 లో సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్ ను క్రొత్తగా యేర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశారు.
                  1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖామాత్యులుగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజపేయి, స్వతంత్రంగా గౌరవప్రథమైన రాజకీయవేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగాడు. 1979లో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్దిరోజులకే జనతాపార్టీ కూడా విఛ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతాపార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా, జనతాపార్టీలోని వివిధ వర్గాల యొక్క అంతర్గత విభేదాలవల్ల విసిగిపోయి సంకీర్ణంలోనుండి బయటకు వచ్చింది.
                   వాజపేయి, జనసంఘ్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ మరియు భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని యేర్పరచారు. ఆ తర్వాత ఆయన బి.జె.పి యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా యున్నారు. ఆయన జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రేస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించారు.
Image result for atal bihari vajpayee life history in telugu
                             భారతీయ జనతాపార్టీ, పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతిరేకించినా, ఆ పరిస్థితికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యొక్క "విభజన మరియు అవినీతి రాజకీయాలు జాతీయ సమైక్యత మరియు సమగ్రతలకు ఫణంగా పెట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి" అని ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లు స్టార్ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరాగాంధీ హత్యకు గురైన తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది. 1984 ఎన్నికలలో బి.జె.పి లోక్‌సభలో రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా మరియు విపక్ష నాయకునిగా కొనసాగారు.
                           అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, విశ్వహిందూ పరిషత్ మరియు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కలసి చేపట్టిన రామ జన్మభూమి మందిర ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ గళాన్నిచ్చింది. 1995 మార్చిలో గుజరాత్ మరియు మహారాష్ట్ర లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని సాధించింది. 1994లో కర్ణాటకలో జరిగిన అసెంభ్లీ ఎన్నికలలో మంచి విజయాలను సాధించింది. ఈ విధంగా జాతీయస్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 1995 నవంబరులో ముంబాయిలో జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. 1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది.
భారత ప్రధానమంత్రిగా (1996 to 2004):
                   వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

తొలి పర్యాయం: 
                    మే 1996 సానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. ఆనాటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం యేర్పాటు చేయుటకు ఆహ్వానించారు. అపుడు వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజరిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు.
రెండవ పర్యాయం: 1998–1999
                   1996 నుండి 1998 ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్‌సభ రద్దై, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవశం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్ని బి.జె.పిలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా యేర్పడ్డాయి. వాజపేయి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
                               ఎన్.డి.ఏ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఏప్రిల్ 17, 1999 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది. విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం యేర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని కలిగి యుండనందున మరలా లోక్ సభ రద్దయినది. మరలా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగేంత వరకూ వాజపేయి ప్రధానమంత్రిగా కొనసాగారు.
అణు పరీక్షలు:
                         1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి. రెండు వారాల అనంతరం పాకిస్థాన్ తన సొంత అణుపరీక్షలతో స్పందించింది. భారతదేశపు అణు పరీక్షలను రష్యా, ఫ్రాన్స్ మొదలైన కొన్ని దేశాలు సమర్థించాయి. యు.ఎస్.ఎ, కెనడా, జపాన్, బ్రిటన్ మరియు ఐరోపా దేశాలు భారతదేశానికి సమాచారం, వనరులు మరియు సాంకేతికాంశాలలో సహాయంపై ఆంక్షలు విధించాయి. తమ అణు సామర్ధ్యాన్ని, అణ్వాయుధంగా మలచే విషయమై భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని, అంతర్జాతీయ ఆంక్షలు సమర్ధవంతంగా నిరోధించలేకపోయాయి. వాజపేయి ప్రభుత్వం ఈ చర్యలను ముందే ఊహించి, పరిగణనలోకి తీసుకొని, తదనుగుణంగా ప్రణాళిక ఏర్పరుచుకున్నది.
                    లాహోర్ సదస్సు 1988 చివరలో మరియు 1999 మొదట్లో వాజపేయి పాకిస్థాన్ తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించారు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వాజపేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్థాన్ తో నూతన శాంతి ఒప్పందంకోసం పాకిస్థాన్ ను ఆహ్వానించాడు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్ ఒప్పందం, ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని, వర్తకసంబంధాలు విస్తరించాలని మరియు సహృద్భావం పెంపొందించాలని ఉల్లేఖించింది. అణ్వాయుధరహిత దక్షిణాసియా అనే దార్శనిక లక్ష్యాన్ని ఉద్బోధించింది. ఈ ఒప్పందం 1998 అణుపరీక్షల తర్వాత ఇరుదేశాలలోనే కాక, దక్షిణాసియా మరియు ఇతర ప్రపంచంలో నెలకొన్న ఉత్కంఠతను ఉపశమించింది
కార్గిల్ యుద్ధము:
          కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి (వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది. వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).
మూడవ పర్యాయం: 1999–2004
                           కార్గిల్ పరిణామాల తరువాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్‌సభ 303 స్థానాలు గెలిచి, భారత పార్లమెంటులో స్థిరమైన మెజారిటీని పొందింది. వాజపేయి అక్టోబరు 13,1999 న మూడవసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్:
                           డిసెంబర్ 1999 కాఠ్మండు నుండి కొత్త ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం-814 ను ఆప్ఘనిస్థాన్ కు చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ చేయడంతో జాతీయ సంక్షోభం ఉద్భవించింది. హైజాకర్లు, భారతదేశపు జైలులో ఉన్న మౌలానా మసూద్ అజహర్ అనే తీవ్రవాదిని విడిచిపెట్టాలనే కోరికతో పాటు అనేక డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. ప్రయాణికులు కుటుంబాలు, రాజకీయ ప్రతిపక్షాల నుండి తీవ్రవత్తిడికి తలొగ్గి భారత ప్రభుత్వం హైజాకర్ల డిమాండ్లను ఒప్పుకుంది. అప్పటి విదేశాంగమంత్రి అయిన జశ్వంత్ సింగ్ ఆప్ఘనిస్థాన్ వెళ్ళీ, అజహర్ ను అప్పగించి, ప్రయాణీకులను విడుదల చేయించారు.
జాతీయ రహదార్ల ప్రాజెక్టు, విదేశీ విధానం మరియు ఆర్థిక సంస్కరణలు:
              వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక మరియు మౌలిక సంస్కరణలను చేపట్టారు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించారు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవెటీకరించారు. గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యు.పి.ఏ ప్రభుత్వం 2013, జూలై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది.
"నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు" మరియు "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన" వాజపేయి యొక్క అభిమాన ప్రాజెక్టులు.
                 2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 యేళ్లలో భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు ముందు రెండు సంవతర్సాల క్రితమే భారత్ ప్రోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి ఉండటం, సంవత్సరం ముందే కార్గిల్ యుద్ధం జరిగి ఉండటం, తదనంతరం పాకిస్తాన్ సైనికపాలనలోకి వెళ్ళటం వంటి సంఘటనల పూర్వరంగంతో జరిగిన ఈ పర్యటన, ప్రఛ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న పెనుమార్పులను ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి మరియు అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల ప్రధాన ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాల అభివృద్ధికి అవలంబించవలసిన మార్గంపై, ప్రధాని వాజపేయి మరియు అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసారు.
Image result for atal bihari vajpayee life history in telugu
దేశాంగ విధానంలో, హిందూత్వ అజెండాను చేపట్టాలనే విషయమై, బి.జె.పి ప్రభుత్వం దాని సైద్ధాంతిక గురువు అయిన అర్.ఎస్.ఎస్ మరియు హిందూ అతివాద సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. కానీ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్ధతుతో కొనసాగుచున్నందున, అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టడం, కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుచేయటం మరియు అన్ని మతాలకు సమంగా వర్తించేట్టు ఉమ్మడి సివిల్ కోడ్ అమలుపరచడం వంటి అంశాలను తీసుకురావడానికి కష్టతరమైనది. 2000 జనవరి 17న వాజపేయి పరిపాలనపై అసంతృప్తితో బి.జె.పి లోని కొంతమంది అతివాద నాయకులు, ఆర్.ఎస్.ఎస్ నాయకులు జనసంఘ్ ను పునః ప్రారంభించాలని నిర్ణయించారని నివేదికలు వెలువడ్డాయి. పూర్వపు జనసంఘ్ అధ్యక్షుడైన బాలరాజ్ మధోక్ ఆర్.ఎస్.ఎస్. అధ్యక్షుడైన రాజేంద్రసింగ్ కు మద్దతు ఇవ్వవలసినదిగా లేఖ వ్రాసారు.
                  బి.జె.పి జాతీయ విద్యావిధానాన్ని, పాఠ్యాంశాలను కాషాయీకరిస్తుందన్న ఆరోపణలనెదుర్కొన్నది. అప్పటి హోం మంత్రి ఎల్.కె.అద్వానీ మరియు మానవ వనరుల మంత్రి అయిన మురళీ మనోహర్ జోషీలు 1992 లో జరిగిన బాబ్రీ మసీదు కేసులో, తమ ప్రసంగాలతో మూకలను రెచ్చగొట్టి, కూల్చివేతకు కారణమయ్యారనే నేరాన్ని మోపబడ్డారు. మసీదు కూల్చివేతకు ముందురోజు వాజపేయి చేసిన వివాదాస్పద ప్రసంగం, వాజపేయిని కూడా తీవ్ర ప్రజావిమర్శకు గురిచేసింది. న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షతన వెలువడిన 2009 నివేదిక, మసీదు విధ్వంసానికి 68 మందిని నిందితులుగా పేర్కొంది, వారిలో పెక్కుమంది బి.జె.పి. నాయకులు మరియు కొద్దిమంది బ్యూరాక్రాట్లు ఉన్నారు. నివేదికలో పేర్కొన బడిన వారిలో మాజీ ప్రధాని మంత్రి ఎ.బి.వాజ్‌పేయి, (2009) నాటి భారతీయ జనతా పార్టీ పార్టీ పార్లమెంటు నాయకుడు ఎల్.కె.అద్వానీ ఉన్నారు. నివేదికలో మసీదు విధ్వంస సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ పై కఠిన విమర్శలు చేశారు. అయోధ్యలో మసీదు యొక్క విధ్వంస సమయంలో చూస్తూ మౌనంగా ఉండిపోయిన పోలీసు అధికారులను, ఉన్నతాధికారులను నియమించినందుకు అతడు నిందింపబడ్డాడు. లిబర్హాన్ కమీషన్ నివేదికలో ఎన్డీయే ప్రభుత్వంలో మాజీ విద్యాశాఖామంత్రి మురళీ మనోహర్ జోషి కూడా నేరస్తుడయ్యాడు. ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా ఇండియన్ పోలీస్ అధికారిణి అంజూ గుప్త హాజరయ్యింది. విధ్వంసం జరిగిన రోజున అద్వానీ యొక్క భద్రతాధికారిణిగా ఉన్న అంజూ గుప్త, అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసారని ఆమె బయటపెట్టింది. ఆర్.ఎస్.ఎస్ కూడా తరచూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఫణంగా పెట్టి, విదేశీ వస్తువులను, విదేశీ పోటీని పెంపొందించే పెట్టుబడిదారీ స్వేఛ్ఛా విఫణి విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించేది.
                   వాజపేయి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీల ప్రైవేటీకరణ వలన అనేక కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల కోపానికి గురైంది. భారతీయ ఆర్థికరంగాన్ని సమూలంగా పరివర్తనం చేసి, విస్తరించే దిశగా వాజపేయి వ్యాపారరంగానికి మద్దతునిస్తూ, స్వేఛ్ఛా విఫణి సంస్కరణలను ప్రోత్సహించాడు. గత ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించిన ఈ సంస్కరణలు, 1996లో అస్థిర ప్రభుత్వాలు పాలనలో ఉండటం వల్ల మరియు 1997లో సంభవించిన ఆసియా ఆర్థిక సంక్షోభం వల్ల నిలిచిపోయాయి. పోటీతత్వం పెంపొందించడం, సమాచార సాంకేతికత మరియు ఇతర సాంకేతిక పరిశ్రమలకు అదనపు పెట్టుబడి మరియు మద్దతు సమాకూర్చడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వర్తక, పెట్టుబడులు మరియు వాణిజ్య చట్టాలపై నియంత్రణ సడలించడం వంటి చర్యలు అన్నీ విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేసి, ఆర్థికరంగ విస్తరణకు శ్రీకారం చుట్టాయి.
                 రెండు సంవత్సరాల సంస్కరణాకాలం, ప్రభుత్వంలో అంతర్గత కలహాలతో పాటు, ప్రభుత్వం యొక్క దిశపై అయోమయంతో కూడుకొని ఉంది. ఆ కాలంలో క్షీణిస్తున్న వాజపేయి ఆరోగ్యం కూడా ప్రజాసక్తిని చూరగొన్నది. తన కాళ్లపై పడుతున్న ఒత్తిడికి ఉపశమనం కల్పించేందుకు వాజపేయి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ప్రధాన మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
                2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ముడుపుల వ్యవహారంపై తెహల్కా డాట్‌ కాం అనే వార్తాసంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌ (రహస్య దర్యాప్తు) నిర్వహించింది. ఆయుధాల డీలర్‌గా వచ్చిన ఓ విలేకరి లక్ష్మణ్‌కు ఒక కాంట్రాక్ట్‌కోసం లక్ష రూపాయలు ముడుపులిచ్చారు. రహస్యంగా అమర్చిన కెమెరాలు బంగారు లక్ష్మణ్‌ లంచం తీసుకోవడాన్ని చిత్రీకరించాయి. నకిలీ రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు నకిలీ ఆయుధ డీలర్లతో లాలూచిపడి బంగారు లక్ష్మణ్‌ లంచం తీసుకుంటున్నట్టు తెహల్కా డాట్‌ కాం చిత్రించి, వెలుగులోకి తెచ్చిన ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
                             వాజపేయి భారత పాకిస్థాన్ ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుటకు గాను ఆగ్రా ఒప్పందం కొరకు పాకిస్థాన్ అధ్యక్షుడు అయిన పర్వేజ్ ముషారఫ్ను ఢిల్లీకి ఆహ్వానించాడు. అంతకు ముందు కార్గిల్ యుద్ధానికి ప్రణాళిక రచించిన వ్యక్తిని ఆహ్వానించడం, పాకిస్తాన్‌తో ప్రతిష్టంబనను తొలగించడానికి వాజపేయి చేసిన రెండవ ప్రధాన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఆహ్వానాన్ని అంగీకరించి ముషారఫ్ ఢిల్లీకి వచ్చాడు. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముషారఫ్ ఢిల్లీలోని తన జన్మస్థానాన్ని కూడా సందర్శించాడు. అయితే ముషారఫ్ కాశ్మీరు సమస్యను పక్కనపెట్టి ఇతర అంశాలను చర్చించడానికి నిరాకరించడంతో ఆగ్రా సమావేశం విఫలమైంది.
                 2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక మరియు సెకండరీ విద్య యొక్క అభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2001 పార్లమెంటు దాడి:
           2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్నీ హతమార్చారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం పార్లమెంట్ భవన్ ఆవరణంలో స్మారక సభలు, వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. తీవ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన తీవ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి అఫ్జల్ పెట్టుకున్న వినతిపత్రం పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును నిలిపేవేశారు. ఈ చీకటి రోజు జ్ఞాపకార్థంగా భారతీయ జనతా పార్టీ కొన్ని సీడీలను విడుదల చేసింది. పార్లమెంట్‌పై దాడి జరిగిన సమయంలో తీసిన వీడియో చిత్రాలతో కూడిన సీడీని ఆ పార్టీ విడుదల చేసింది. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రేస్ పార్టీ, అఫ్జల్ మహ్మద్‌ ఉరిశిక్ష అమలు కాకుండా చేస్తోందని భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది. పార్లమెంటుపై దాడి చేసిన అప్జల్‌ గురుకు బహిరంగంగా ఉరి శిక్ష అమలు చేసినట్లయితే కసబ్‌ లాంటి వాళ్ళు దేశంపై దాడి చేసే వారు కాదని విశ్వహిందూ పరిషత్‌ అభిప్రాయపడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలంటే భారత ప్రభుత్వం అప్జల్‌ గురు, కసబ్‌ను ఉరి తీయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు.
Image result for atal bihari vajpayee life history in telugu
2004 సార్వత్రిక ఎన్నికలు:
               2004 సార్వత్రిక ఎన్నికలలో ఎన్.డి.ఎ తన ఆధిక్యత నిలుపుకొంటుందని అందరూ భావించారు. అంతకు ముందు బి.జె.పి రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్ గఢ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో సాధించిన విజయాలతో, ప్రజాభిప్రాయం భారతీయ జనతా పార్టీకు మద్దతుగా ఉందనే ఉద్దేశంతో, దానిని సద్వినియోగం చేసుకొనే దిశగా, 13 వ లోక్‌సభను ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తి కాకుండానే ప్రభుత్వం రద్దుచేసి, ఎన్నికలు నిర్వహించింది. "ఇండియా షైనింగ్" అనే నినాదాన్ని బాగా ఉపయోగించుకోవాలని తలచి, భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని చాటుతూ అనేక ప్రకటనలు విడుదలచేసింది. అయితే ఆ ఎన్నికలలో ఎన్.డి.ఎ భాగస్వామ్య పక్షాలు దాదాపు సగందాకా సీట్లను కోల్పోయాయి. సోనియా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రేస్ అత్యధిక స్థానాలను పొందింది. కాంగ్రేస్ దాని భాగస్వామ్య పక్షాలతో కలసి యు.పి.ఎ కూటమి యేర్పడింది. డా. మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిని అధిష్టించారు. వాజపేయి తన పదవికి రాజీనామా చేస్తూ, క్రొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్నందిస్తానని ప్రకటించారు.
          ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి నిరాకరించారు. నాయకత్వ బాధ్యతను లాల్ కృష్ణ అద్వానీకి అప్పగించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగ అద్వానీ ఎన్నికైనారు. అయితే వాజపేయి ఎన్.డి.ఎ కూటమి యొక్క అధ్యక్షునిగా మాత్రం కొనసాగాడు.
తరువాత జీవితం:
             2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తరువాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించుకున్నారు. ఈ సమావేశంలో వాజపేయి "ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ మరియు ప్రమోద్ మహాజన్ లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు" అని ప్రకటించారు.
భారతదేశ రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించారు.
           2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరారు. పరిస్థితి క్షీణించడంతో వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్ళు ఉండి, ఆ తరువాత కోలుకొన్నారు. అనారోగ్య కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేయలేకపోయారు. ఆయన భారత దేశ ఓటర్లకు బి.జే.పికి మద్దతు ఇవ్వాలని లేఖ వ్రాసారు. ఆయన యిదివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో లోక్ సభ నియోజకవర్గం నుండి లాల్జీ టాండన్ పోటీ చేశారు. భారతదేశమంతటా భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో తిరోగమనం పట్టినా, వాజపేయి సహకారంతో లాల్జీ టాండన్ లక్నో నియోజకవర్గం నుండి విజయం సాధించగలిగారు.
వ్యక్తిగత జీవితం మరియు అభిరుచులు:
            ఆయనకు భారతీయ సంగీతం మరియు నాట్యం అంటే యిష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని యిష్టం.
స్వతహాగా కవైన వాజపేయి తను వ్రాసిన కవితల గూర్చి ఈ విధంగా చెప్పుకున్నారు. "My poetry is a declaration of war, not an exordium to defeat. It is not the defeated soldier's drumbeat of despair, but the fighting warrior's will to win. It is not the despirited voice of dejection but the stirring shout of victory."
అవార్డులు:
1992, పద్మవిభూషణ్
1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం
1994, లోకమాన్య తిలక్ పురస్కారం
1994, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
1994, భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
2014 : భారతరత్న
నిర్వహించిన పదవులు:
1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్
1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
1962 – సభ్యుడు, రాజ్యసభ
1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
1980-84, 1986 మరియు 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
16 మే 1996 – 31 మే 1996 – భారతదేశ ప్రధానమంత్రి.
1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
13 అక్టోబరు 1999 నుండి 13 మే 2004– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)
రచనలు:
సామాజిక మరియు రాజకీయ
నేషనల్ ఇంటిగ్రేషన్. (1961).
డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ. (1977).
న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. (1979).
హీల్ ద వూండ్స్: వాజ్‌పేయిస్ అప్పీల్ ఆన్ అస్సాం ట్రాజెడీ టు ద పార్లమెంట్. (1983).
వెన్ విల్ అట్రాసిటీస్ ఆన్ హరిజన్స్ స్టాప్?: ఏ.బి.వాజపేయ్స్ స్పీచ్ ఇన్ రాజ్యసభ. (1988).
కుఛ్ లేఖ్, కుఛ్ భాషణ్. (1996).
సెక్యులర్‌వాద్: భారతీయ పరికల్పన (డా. రాజేంద్రప్రసాద్ స్మారక్ వ్యాఖ్యాన్‌మాలా). (1996).
బిందు-బిందు విచార్. (1997).
రాజ్‌నీతీ కి రప్తీలీ రెహమ్. (1997).
న దైన్యం న పలాయనం (హిందీ సంచిక). (1998).
బాక్ టు స్క్వైర్ వన్. (1998).
డిసైసివ్ డేస్. (1999).
శక్తి సే శాంతి. (1999).
'విచార్ బిందూ (హిందీ సంచిక). (2000).
నయూ చునౌతీ, నయా అవసర్ (హిందీ సంచిక). (2002).
ఇండియాస్ పర్‌స్పెక్టివ్స్ ఆన్ ఏషియన్ అండ్ ది ఏషియా-పసిఫిక్ రీజన్. (2003).
Source: Wikipedia

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

                                    మంచి మిత్రుడు మరియు మంచి శిశ్యుడు తో వాజ్ పాయ్ జీ

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top