Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జమ్మూ కాశ్మీర్‌లో వెలుగుచూడని నిజాలు-jammu kashmir history in telugu

అంతా ‘కాశ్మీర్’ అంటుంటారు. నిజానికి అది జమ్మూ కాశ్మీర్. ఇందులో జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లున్నాయి. ఇవాల్టి సమస్య 22 జిల్లాల్లో కేవలం కాశ్మ...

అంతా ‘కాశ్మీర్’ అంటుంటారు. నిజానికి అది జమ్మూ కాశ్మీర్. ఇందులో జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లున్నాయి. ఇవాల్టి సమస్య 22 జిల్లాల్లో కేవలం కాశ్మీరుకు చెందిన 5 జిల్లాలలో 15 శాతానికి పరిమితమైనది మాత్రమే. కాని యిది మొత్తం జమ్మూ కాశ్మీర్‌కు చెందినదిగా అంతా భావిస్తుంటారు. మీడియా కూడా అలా చిత్రిస్తోంది. జమ్మూ, లడఖ్‌లలో ఏ గోలా లేదు. ఉత్తర కాశ్మీర్‌లో ఏ గొడవా లేదు. దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుత్‌గాం, పుల్వామా జిల్లాలోనే సమస్య వుంది. ఈ జిల్లాలలో కేవలం 15 శాతానికి మాత్రమే అల్లర్లు పరిమితమైనాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో భాగమే. అక్టోబరు 26, 1947 భారత్‌లో విలీనమైన కాశ్మీర్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వుంది. ఇక్కడ 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటికీ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో 24 కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తాయి. ఫిబ్రవరి 6, 1956న కాశ్మీర్ అసెంబ్లీ దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది కూడ. దీని ప్రకారం ఆగస్టు 15, 1947నాడు కాశ్మీర్‌లో ఏ భూభాగాలున్నాయో అవన్నీ ఈ విలీనంలో భాగమవుతాయని చెప్పబడింది. 1994 ఫిబ్రవరి 22నాడు భారత పార్లమెంటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామని తీర్మానించింది. ఈరోజు ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌తో కలిసి వుండాలనుకుంటున్నారు. అంతేకాదు, పాకిస్తాన్‌లోని సింథ్, బెలూచిస్తాన్, పంజాబ్ ప్రాంతాల ప్రజలు కూడా భారత్‌తోనే కలిసి జీవించాలనుకుంటున్నారు.
స్వామి రామతీర్థ భారత కిరీటము కాశ్మీరము నా శిరస్సు అన్నారు. తల లేని శరీరాన్ని ఊహించడం ఎలా సాధ్యంకాదో, కాశ్మీరులేని భారత్‌ని ఊహించలేము. మనం నిర్వహించే నిత్య పూజాదికాల్లో చెప్పబడే జనపదాల జాబితాలో అంగ, వంగ, కళింగ, కాశ్మీర్, కాంభిజ అంటూ చెబుతుంటారు. కాశ్మీరు చరిత్ర పేరు రాజతరంగిణి. కవి కల్హణుడు. 12వ శతాబ్దంలో రాశాడు. శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడు. మహమ్మద్ గజనీ కాశ్మీర్‌పైకి దండెత్తిన రెండు సందర్భాల్లోనూ రాజాసంగ్రామ్‌సింగ్ చిత్తుగా ఓడించాడు. కాశ్మీరును దేవభూమి అనేవారు. నేడది అందాల కాశ్మీరం, కాదు కల్లోల కాశ్మీరం అయింది. 14వ శతాబ్దంలో కాశ్మీరు రాజ్యాన్ని ఏలిన సహదేవుడు చేరదీసిన యిద్దరు ముస్లిం రాజులవల్ల కాశ్మీరు విలాసభూమి అయింది. తరువాత మహారాణా రంజిత్‌సింగ్ పాలన 27 సం.లు సాగింది. ఆంగ్లేయుల కాలంలో రాజా గులాబ్‌సింగ్ రాజయ్యాడు. తరువాత మహారాణా రణవీర్‌సింగ్ పాలన చేపట్టారు. పూంచ్ రాజోరి జిల్లాలో పునరాగమనాన్ని కాశ్మీరు పండితులు అడ్డుపడడంతో మహారాజు నిస్సహాయుడయ్యాడు. ఆ నిస్సహాయతే నేడున్న కాశ్మీర్ పరిణామాలకు దారితీసింది.
1989లో జమ్మూ కాశ్మీర్‌నుంచి 4 లక్షల మంది పండితులను వెళ్ళగొట్టారు. వారికి న్యాయం జరగవలసిందే. కాని ప్రస్తుతం కాశ్మీరు సమస్య హిందూ ముస్లిం సమస్య కాదు. అది జాతీయవాదులకు విదేశీ శక్తులకు జరుగుతున్న పోరాటం. అయితే ముస్లింలో షియావర్గం, బక్రావాలాలు భారత్‌కు అనుకూలం. సున్నీలు భారత్‌కు వ్యతిరేకం. కాశ్మీర్‌లో 4,5 జిల్లాల్లో అల్లరిచేస్తున్న 150 మంది సున్నీ వర్గానికి చెందినవారే. జమ్మూకాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల మధ్య వివక్షకు సంబంధించిన అనేక వివరాలను జమ్మూకాశ్మీర్ అధ్యయన సంస్థ బయటపెట్టింది.
1947లో మొత్తం జమ్మూకాశ్మీర్ వైశాల్యం 2,22,336 చ.కి.మీ.
1948లో పాకిస్తాన్ 83,294 చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇందులో 5180 చ.కి.మీ. భూభాగం 1963లో చైనాకు బహుకరించింది. చైనా లడక్‌లో 1962లో 37,555 కి.మీ. భూభాగాన్ని ఆక్రమించుకుంది.
జమ్మూకాశ్మీర్ భారత్‌లో అవిభాజ్యమైన అంతర్భాగం, భారత రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. కాని పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం బెలూచిస్తాన్, కైబర్ పంక్తుఖ్వా, పంజాబు, సింథ్‌లు మాత్రమే పాకిస్తాన్‌లో భాగం. జమ్మూకాశ్మీర్ ప్రస్తావన ఎక్కడా యిందులో లేదు. అంతేకాదు పాకిస్తాన్ సుప్రీంకోర్టు 14 సెప్టెంబరు 1994 యిచ్చిన తీర్పుననుసరించి ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్, బాల్టిస్తాన్‌లు భారత్‌లోని జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అంతర్భాగం కాని పాకిస్తాన్‌కు చెందేవి కావు. పేరుకి అజాదీ జమ్మూకాశ్మీర్ కౌన్సిల్ వుంది. కాని 1953 నుంచి 1974వరకు ఎన్నోసార్లు పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని రద్దుచేయడం జరిగింది. ఇక్కడి ప్రజలకు ప్రాథమిక హక్కుల్లేవు. అక్కడ అరాచకం నెలకొంది. తీవ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్ గురించి మనం అర్థం చేసుకోని విషయం ఏమిటంటే అక్కడి పోలీసుల వీరోచితమైన యుద్ధం. తీవ్రవాదులను, రాళ్ళువిసిరే ముఠాలను ఎదుర్కొంటున్నది వీరే. అందులో దెబ్బలు తింటున్నది ప్రాణాలు కోల్పోతున్నది వీరే. సైన్యం సరిహద్దుల్లో పోరాడుతున్నది.
జమ్మూకాశ్మీర్‌లో మీడియా కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆక్రమిత కాశ్మీర్‌కు బదులు ‘అజాదీ కాశ్మీర్’ మాట వాడతారు. టెర్రరిస్టు పదం వాడకుండా మిలిటెంట్ అనే పదం వాడతారు. తీవ్రవాదులు అనకుండా సాయుధులు అంటారు. ఒకప్పుడు 15 ఉర్దూ పత్రికలు ఒక ఆంగ్ల పత్రిక వుండేవి. గత కొనే్నళ్ళలో సుమారు 270 ఉర్దూ పత్రికలు, 11 ఆంగ్ల పత్రికలు వెలిశాయి. జాతీయ దృక్పథం ఎక్కడా కానరాదు. రాళ్ళు విసురుతున్న చిన్న గుంపును ప్రజాగ్రహంగా ప్రజాఉద్యమంగా చిత్రించి వార్తలు రాస్తుంటారు. రైజింగ్ కాశ్మీర్ అనే ఆంగ్ల పత్రిక సంపాదకుడు పుజాత్ బుఖారీ, మొదట ఉగ్రవాదులకు కాపుకాసినవారే. ఈయన సోదరుడు పిడిపి బిజెపి మంత్రివర్గంలో సభ్యుడు కూడ. తీవ్రవాదంతో విసిగివేసారిన కాశ్మీర్ లోయలో పరిస్థితులు మారాలని ఆయన భావించాడు. చర్చలు జరగాలని భావించాడు. ఇంతలోనే తీవ్రవాదులు ఆయన్ను మట్టుపెట్టారు. జమ్మూకాశ్మీర్‌లో బిజెపి కఠిన నిర్ణయం తీసుకుని పిడిపితో పొత్తు వదిలించుకుంది. గవర్నరు పాలన విధించబడింది. ఇప్పుడు రాళ్ళు రువ్వే ఘటనలు మాయమయిపోయాయి. ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తే అల్లరి అంతా సర్దుకుంటుంది. గత కొనే్నళ్లుగా అనేకమంది తీవ్రవాదం వదలి ప్రధాన జాతీయ స్రవంతిలో కలుస్తున్నారు. కాని ఈ వార్తలు పత్రికల్లో రావడం లేదు. సరెండర్డ్ టెర్రరిస్ట్స్ ఆర్గనైజేషన్ అక్కడ ఒక సంస్థ పనిచేస్తున్నది. ఇందులో 4000 మంది సభ్యులున్నారు. వీరి మంచిచెడు చూస్తూ వీరిని సరియైన మార్గంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నిస్తున్నది. సైన్యం ‘సద్భావన’పేర ఒక కార్యక్రమం నడుపుతున్నది. ఇందులో భాగంగా అనేక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇందులో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
వందలాది మంది టీచర్లు, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీటిని ఆర్మీ గుడ్‌విల్ స్కూళ్లు అంటారు. 46 స్కూళ్ళ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 1900 పాఠశాలలకు అన్నివిధాల సహాయ సహకారాలనందిస్తున్నది సైన్యం. గత 15 ఏళ్ళుగా యిది జరుగుతున్నది. సైన్యం దీనిని వొక సామాజిక బాధ్యతగా స్వీకరించింది. విద్యార్థులకు సైన్యం వైద్య సహాయం అందిస్తుంది. జాతీయ భావన పెంపొందించేందుకు యాత్రల్ని నిర్వహిస్తుంది. విద్యార్థుల నైపణ్యాభివృద్ధిమీద కూడా శ్రద్ధ వహిస్తుంది. విద్యార్థుల్ని చక్కటి దేశ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సైన్యం కృషిచేస్తుంది. ఈమధ్య రాళ్ళురువ్విన సంఘటనలు ఆగిన తరువాత సైన్యం తీవ్రవాదుల గాలింపులు జరుపుతున్నపుడు స్థానికులు సైన్యం యోగక్షేమాలు తెలుసుకుంటూ సహకరిస్తున్నారన్న వార్తలు, సైన్యాధిపతి రావత్ కూడా యువకులతో కలిసి కబుర్లు చెబుతున్న దృశ్యాలు పత్రికల్లో కనిపించాయి. జమ్మూకాశ్మీర్‌లో యువతీ యువకుల శక్తిసామర్థ్యాలు యిపుడిపుడే వెలుగుచూస్తున్నాయి. రువేదా సలామ్ జమ్మూకాశ్మీర్‌లో మొదటి మహిళా ఐపిఎస్ అధికారి. ఇక్రారక్సూల్ మహిళా పోలీసు అధికారిగా తమిళనాడులో సేవలందిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ అమ్మాయి, తాజామూల్ ఇస్లాం ప్రపంచ కిక్ బాక్సింగ్‌లో, 8 ఏళ్ళలోపు ఆడపిల్లల శ్రేణిలో గెలిచింది. అహమద్ అలీన్ నాయక్, మేజర్ జనరల్‌గా భారత సైన్యంలో సేవలందిస్తున్న 1974వ సంవత్సరానికి చెందిన అధికారి, రోయింగ్ క్రీడలో అర్జున అవార్డును సాధించారు. ఈయన జమ్మూకాశ్మీరుకు చెందిన మొదటి ముస్లిం జనరల్. ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్. అబ్దుల్ హమీద్, తెలుగు రాష్ట్రాల్లో రామయ్యలాగానే లక్ష మొక్కలు నాటిన పర్యావరణ వేత్త. రాజోరికి చెందిన రుక్సానా కాసర్ అనే మహిళ ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదుల్ని చంపి సాహస అవార్డును దక్కించుకుంది. మహమ్మద్ అల్త్ఫా అనే జమ్మూకాశ్మీర్ యోధుడు వందలాది తీవ్రవాదులను చంపి కాశ్మీర్ రక్షణకోసం నిలబడ్డాడు. మక్బూల్ భట్ అనే తీవ్రవాది గురించి అందరికీ తెలుసు, కాని మక్బూల్ షేర్‌వాని గురించి చాలామందికి తెలియదు. 1947లో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ సైనికులను ముప్పుతిప్పలుపెట్టిన 19 ఏళ్ళ యువకుడు. వేల మంది పాకిస్తాన్ సేనలను బారాముల్లానుంచి దారి తప్పించి శ్రీనగర్‌వైపు వెళ్ళకుండా తన వాహనం మీద వెళ్తూ, భారత సేనలకు తగినంత సమయం దొరికేలాచేసిన సాహసి. ఆ నాల్గురోజుల సమయంలో భారత సైన్యం శ్రీనగర్‌కు చేరుకుంది. తమను ఈ యువకుడు వెర్రివాళ్ళను చేశాడన్న విషయం తెలిసిన పాక్ సేనలు ఈ యువకుడిని వెదికి పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి చంపేశాయి. చివరకు భారత్ సైన్యం బారాముల్లాలో మక్బూల్ షేర్‌వాని మృతదేహం కనుగొని అంత్యక్రియలు జరిపించింది. ఇప్పటికీ జాతీయవాదులంతా నవంబరులో ప్రతి ఏటా మక్బూల్ షేర్వాని దేశంకోసం అమరుడైన విషయం స్మరించుకొని నివాళులర్పిస్తారు. మతం పేర ఉన్మాదం, ఉగ్రవాదం సృష్టిస్తున్న మూకలకు, జాతీయవాదులకు జరుగుపోరాటమే జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్నది. ఇందులో విజయం జాతీయవాదులదే.
*
ప్రాంతం పేరు జమ్ము కాశ్మీర్ లడాఖ్
1. వైశాల్యం 26,293 చ.కి.మీ. 15,853 చ.కి.మీ 59,241 చ.కి.మీ.
2. శాసనసభ స్థానాలు 37 46 4
3. లోక్‌సభ స్థానాలు 2 3 1
4. సరాసరిగా శాసనసభ
నియోజకవర్గంలో ఓటర్లు 66,592 53,396
5. రెవెన్యూ ఆదాయం 70% 30%
6. సివిల్ సెక్రటేరియట్‌లో
ఉద్యోగుల శాతం 10% 90%
7. విద్యుదుత్పత్తి వాడకం 350మె.వా 22 మెవా 300 మె.వా.
8. కేంద్ర నిధుల వ్యయం 10% 90%
9. జనాభా 56,00,000 50,00,000 3,00,000
-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ 9676190888

1 comment