సెక్యులరిజం పూర్వొత్తరాలు - about secularism in telugu - what is secularism

megaminds
0
సెక్యులరిజం పూర్వొత్తరాలు


సెక్యులరిజం పూర్వొత్తరాలు - about secularism in telugu - what is secularism

అధికారం కోసం కన్నతండ్రిని బందీని చేసి, ఆయనకు ప్రీతిపాత్రుడైన తన సొంత అన్నను నరికి ఆ తలకాయను బహుమతిగా తండ్రికి పంపించిన ‘సెక్యులర్ మహానుభావుడు’ ఔరంగజేబు. ఈ మొఘల్ చక్రవర్తి అధికారం కోసం ప్రదర్శించిన అసహనం అంతా ఇంతా కాదు. అధికార వారసత్వం కోసం తన తండ్రి షాజహాన్ వృద్ధుడయ్యేవరకో, మరణించే వరకో వేచి చూడకుండా అతణ్ణి జైల్లో బంధించాడు. తనను బంధించి ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు కదా! అని షాజహాన్ ఎంతో చింతించేవాడు. తాను జైల్లో వుండి ఏం చేయాలి? అన్న ప్రశ్న షాజహాన్‌ను వేధించడంతో అతని మనసులో ఏదో ఆలోచన స్ఫురించి ‘కనీసం 30 మంది ముస్లిం విద్యార్థులను తన వద్దకు పంపే ఏర్పాటు చేస్తే వారికి పవిత్ర ఖురాన్‌ను నేర్పిస్తానని’ తన కొడుకు, రాజు ఔరంగజేబుకు వర్తమానం పంపించాడు షాజహాన్. ఈ విషయంపై ఔరంగజేబు తన ఆస్థాన సభ్యుల ముందు చేసిన వ్యాఖ్యానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం కలిగింది కూడా!

ఆ వృద్ధుడు (షాజహాన్) అధికారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అతడేమీ చక్రవర్తి కాదు, కానీ 30 మంది విద్యార్థులు కావాలట. ఖురాన్ బోధించే నెపంతో ఆ ముప్పై మంది విద్యార్థులపైన మళ్లీ ఆయనకు అధికారం వస్తుంది’ అంటాడు ఔరంగజేబు. అధికార దాహం ఎంత తీవ్రమైందో ప్రబోధించే ఘట్టం ఇది. సరిగ్గా ఆ ఔరంగజేబు అడుగుజాడల్లో నడిచే ఈ దేశ ‘సెక్యులర్ గ్యాంగ్’ అదే పనిని కొనసాగిస్తోంది. అధికారం పొందడానికి పెట్టుకున్న అందమైన ముద్దుపేరు ‘సెక్యులరిజం’. ఎన్ని అవినీతి పనులు చేసినా, దేశాన్ని ఎంతలా దోచుకున్నా, ఫ్రజాస్వామ్యాన్ని తమ ఇళ్లముందు కావలి కుక్కలా కట్టేసుకున్నా చేతికి ‘సెక్యులరిజం’ అనే ‘పవిత్ర’ కంకణం ఉంటే చాలు.. వాళ్లు మహానుభావులే.

నిజానికి ‘సెక్యులరిజం’ శబ్దం ఐరోపా సమాజంలోని చారిత్రక, సామాజిక, మత విధానాలకు సంబంధించింది. అందుకే ఏ విదేశీయుడైనా భారతదేశానికి వస్తే ఫలానా పార్టీ సెక్యులర్, ఫలానా పార్టీ కమ్యునల్ అంటే అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఐరోపా దేశాల్లో సెక్యులర్ పదం వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. భాషాశాస్త్రంలో అర్థగ్రామ్యత, అర్థనిమ్నత, అర్థ గౌరవం లాంటి సూత్రాలున్నాయి. ఒక పదానికి ఓ కాలంలో ఉన్న అర్థం తదనంతర కాలంలో మారిపోయి వేరే అర్థం వస్తుంది. ఉదాహరణకు ‘చెంబు’ అనే పదానికి ఒకప్పుడు రాగితో చేసిన పాత్ర అని అర్ధం. కానీ పోనుపోను అన్ని లోహాలతో చేసిన నీళ్లు తాగే పాత్రకు ‘చెంబు’ అని అర్థం స్థిరపడింది. అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో పెద్ద నూనె డబ్బాలో నూనె ఖాళీ అయ్యాక, అందులో వేరే వస్తువులు నింపినా దాన్ని ‘నూనె డబ్బా’ అని పిలవడం చూస్తాం. సెక్యులరిజం యూరప్ దేశాల్లో ఓ మత చారిత్రక పరిణామాల నుండి పుట్టిన పదం. అది ఇపుడు మన దేశంలో వికృత రాజకీయ క్రీడకు వేదికైంది. అరుణ్ శౌరి లాంటి మేధావి దానిని ఓ టీవీ చర్చలో ‘సెక్యులరిజం అనే పదం భారత్‌లో ప్రాస్టిట్యూట్‌గా వాడుకున్నారు’ అన్నాడు.

సెక్యులరిజం పదానికి యూరప్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీశ 5, 6 శతాబ్దాల నుండి 15, 16 శతాబ్దాల వరకు యూరప్ క్రైస్తవ మతాధిపతుల అధీనంలోని ‘చర్చ్’ అధీనంలో ఉండేది. రాజ్యంపై ‘చర్చ్’కే స ర్వాధికారాలు ఉండేవి. క్రీ.శ 4వ శతాబ్దికి చెందిన సెయింట్ ఆగస్టియన్‌ను ‘క్రైస్తవ మత రాజనీతి పిత’గా, సిద్ధాంత కర్తగా భావిస్తారు. ఆయన తన రచనలో చెప్పిన ‘ప్రతివారూ చర్చి అధీనంలో ఉండాలి, చర్చే ప్రజలకు సర్వాధికారి, క్రైస్తవుడు కానివాడు భూమిమీద ఉండకూడదు’ అన్న మాటలు నాటి చర్చి ఆధిపత్యం ఎంత ప్రబలంగా ఉండేదే నిరూపిస్తుంది. చర్చ్‌ల పాలనలో దురాగతాలు భరించలేక అనేక తిరుగుబాట్లు వచ్చాయి. 15, 16, 17 శతాబ్దాల్లో అనేకమంది తత్వవేత్తలు, రాజకీయ ఉద్యమకారులు క్రైస్తవ మత పాలన నుండి యూరప్ ఖండాన్ని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసారు. వాల్టేర్, రూసో, జాన్‌లాక్, థామస్ హబ్స్ వంటివారు అనేక రచనలు చేసారు.


అందులో ముఖ్యంగా థామస్ హబ్స్ రాసిన ‘లెవియాథన్’ పుస్తకంలో సగం వరకూ ‘చర్చి అపరాధాలు’ ఉన్నట్టు చెప్తారు. ఆధునిక రాజనీతి శాస్త్రాల్లో మొదటి పుస్తకంగా యూరప్ వారు భావించే జాన్‌లాక్ రచన ‘ట్యూటటైజ్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్’ అనే పుస్తకమంతా ఆనాడు సాగించిన క్రైస్తవ మత దౌష్ట్యాలను ఖండించింది. చర్చి పాలనకు వ్యతిరేకంగా సెక్యులరిజం పదం ప్రయోగించబడింది. కానీ మన దేశంలో చర్చి పాలనను మళ్లీ తేవడానికి సెక్యులరిజం అనే పదం వినియోగించడం విడ్డూరం. మతానికి, ధర్మానికి స్పష్టమైన తేడా ఉంది. ‘హిందుత్వం’ మతం కాదు ధర్మం. మతానికి రాజకీయ ప్రయోజనం ఎక్కువ, ఆధ్యాత్మికత తక్కువ. తత్వ భాగానికి అందులో ప్రాముఖ్యం లేదు. కానీ ధర్మానికి జీవన విధానం, ప్రవర్తన చాలా ముఖ్యం. ధర్మం ప్రవర్తనపై ఆధారపడితే, మతం విశ్వాసం, అవిశ్వాసం మీద ఆధారపడుతుంది. ధర్మంలో మనిషి జీవిస్తే, మతంలో అనుసరిస్తాడు. ధర్మానికి విస్తృతి ఎక్కువ. అది సముద్రం లాంటిది. ఎన్ని నదులొచ్చినా తనలో కలుపుకోగలదు సముద్రం. అందుకే హిందూ ధర్మంపై ఎన్ని మతాల దాడులు జరిగినా, వాటన్నిటినీ తనలో జీర్ణం చేసుకుంది. మతాల్లో అలౌకికత్వం ఎక్కువ. ఆనాడు పాశ్చాత్య దేశాల్లోని ఈ అనవసర అలౌకిక తత్వాలకు వ్యతిరేకంగా అక్కడి మేధావులు సెక్యులరిజం (లౌకికమైన, ఐహికమైన) అనే పద ప్రయోగం చేసారు.

మన దేశంలో మతం కింద రాజ్యపాలన ఎప్పుడూ జరగలేదు. కానీ ‘సెక్యులరిజం’ పదాన్ని మన దగ్గరకు దిగుమతి చేసుకున్న మేధావులు దాని చుట్టూ అనేక కథలను అల్లడం కోసమే మన చరిత్రను మొదట ధ్వంసం చేసారు. హిందూ ధర్మాన్ని ‘మతం’గా దిగజార్చడానికి పాశ్చాత్యులు బాటలు వేస్తే భారతీయ సైద్ధాంతిక మేధావులు దానికి మరింతగా రంగులు అద్దారు. వెండిడోనిగర్, రామిల్లా థాపర్, ఎ.కె.రామానుజన్, జెస్సీలేఖికా వంటివారు రామాయణాన్ని, రాముడిని బండబూతులు తిడతారు. అది సాహిత్యం కాబట్టి ‘మేం విమర్శిస్తాం’ అంటారు. అదే సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మనం అడిగితే ‘అదొక మత గ్రంథం’ అంటూ దబాయిస్తారు. ఈ ద్వంద్వ వైఖరి గత యాభై ఏళ్లనుండి కొనసాగిస్తునే ఉన్నారు. ఇదంతా వాళ్ల దృష్టిలో సెక్యులరిజం!

1916 తరువాత గాంధీజీ భారత రాజకీయాల్లోకి వచ్చాక ‘సెక్యులరిజం’ అనే పదం విచిత్ర రూపాన్ని పొందింది. ‘సర్వమత సమభావన’ అనే కొత్త అర్థం గాంధీజీ కల్పించాడు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ లాంటి సంస్థలను వాటి రాజకీయాలను అర్థం చేసుకున్న గాంధీజీ తాత్కాలిక ఉపశమనం కోసం ఈ కొత్త అర్థం సృష్టించాడు. నెహ్రూ కాలానికి వచ్చేసరికి మరో కొత్త అవతారంలో సెక్యులరిజం రూపుదాల్చింది. ఒక మతాన్ని సంతృప్తి పరచడమే సెక్యులరిజం అనే భావన నిర్మాణం కావడానికి మన స్వాతంత్రోద్యమంలోని ఓ పుటను మనం తెరిచి చూడాలి. 1942లో క్రిప్స్ రాయబారం పరిణామాల నేపథ్యంలో 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.


ఇందులో బ్రిటిష్ ఇండియా-గవర్నర్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. నెహ్రూ, కృపలానీ, పటేల్, డా.సర్వేపల్లి, ఖాన్ అబ్దు గఫార్‌ఖాన్, టాండన్, డా. అంబేద్కర్, శ్రీనివాస అయ్యంగార్ వంటి ప్రముఖులు అందులో ఉన్నారు. సుమారు 1946 నుండి 1949 వరకు రాజ్యాంగ రచన మొదలైంది. ఈ మధ్యలో దేశవిభజన జరిగింది. రెండుదేశాలు మతాల ఆధారంగా విడిపోకూడదన్న పెద్దల ఆలోచనతో రాజ్యాంగంలో దేశ విభజనకు ముందే ‘మైనార్టీ’ అనే పదం సృష్టించబడింది. ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనార్టీలకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. అది కూడా దేశ విభజన జరగవద్దన్న సంకల్పంతో రాజ్యాంగవేత్తలు వాటిని చేర్చారు. అందులో కూడా భాష, జాతి, వంశం (తరం), సంతతి అనే నాలుగు అంశాలు మైనార్టీగా రాజ్యాంగ నిపుణులు చెప్తే నెహ్రూ అనంతర రాజకీయ, సిద్ధాంత వాదులంతా మైనార్టీ పదానికి క్రైస్తవం, ముస్లిం అనే పదాలను మాత్రమే తీసుకున్నారు. అదే క్రమంలో గత డెబ్బై ఏళ్లుగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇప్పుడు మైనార్టీలను సంతుష్టీకరణ చేయడమే ‘సెక్యులరిజం’ అన్నంతగా ఈ పదం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ‘మెజార్టీ’ ఆధారంగా మన దేశంలో రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లేవు. మెజార్టీ ప్రజలు ఎప్పుడూ పౌరులుగానే రాజ్యాంగబద్ధమైన జీవితంలో ఉండాలి. మైనార్టీలకు ఈ 25-30 ప్రకరణల వల్ల ప్రత్యేక అధికారం ఒకవైపు, భారత పౌరునిగా ప్రత్యేక అధికారం ఇంకోవైపు అనుభవించవచ్చు. ‘హిందువు’ కేవలం పౌరునిగా మాత్రమే ఈ దేశంలో తన జీవితం కొనసాగిస్తాడు. హిందువుల సంఖ్య ఎక్కువగా వుండడంతో ‘మెజార్టీ’ అని ముద్రవేసి నోరు మూయిస్తున్నారు. కానీ రేపు హిందువుల సంఖ్య తగ్గిపోతే రాజ్యాంగపరంగా మెజార్టీ ప్రజల పరిస్థితి అగమ్యగోచరమే. దీని సూక్ష్మరూపం ఇపుడు మనం కాశ్మీర్‌లో చూడవచ్చు. లక్షలాది కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయనుండి తరిమివేయబడ్డారు. కాశ్మీర్ రాజ్యాంగంలో సెక్యులరిజం శబ్దానికి స్థానం లేదు. అక్కడ మైనార్టీలైన హిందువులకు విలువలేదు. అక్కడ మైనార్టీ-మెజార్టీ వాదం తలకిందులైంది. ఇప్పుడక్కడ పాక్ ప్రేరిత, మత ప్రేరిత శక్తులు ప్రభుత్వాలకే సవాల్ విసురుతున్నాయి.

మెజార్టీ మతం ఆధారంగా ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేనందునే రామకృష్ణ మిషన్ లాంటి హిందూ ధార్మిక సంస్థ ఒకప్పుడు కలకత్తా కోర్టులో తమను హిందూయేతర సంస్థగా గుర్తించమని పిటిషన్ వేసింది. ‘హైందవ ధర్మ శంఖారావం’ ప్రపంచ యవనికపై చేసిన స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ఇలా కోరడం మనల్ని విభ్రాంతుల్ని చేస్తుంది. ఆర్టికల్ 25 ప్రకారం మైనార్టీలకు మత ప్రచారం చేసుకునే హక్కు సంక్రమించింది. ఏ మత దేశంలో కూడా ఇలాంటి ప్రత్యేక విధానం లేదు. దీనివల్ల విస్తృత మత మార్పిడికి అవకాశం లభించింది. ఇది ఉపయోగించుకుని చర్చిలు తమ సామ్రాజ్య విస్తరణ చేస్తున్నాయి. ఈ ఆర్టికల్ వల్లనే ఇటీవల నేరస్తుడిగా దేశం విడిచిపోయిన జకీర్ నాయక్ బహిరంగంగా మత మార్పిడి చేయగలిగాడు. ఈ మతాంతీకరణల్లో ఆధ్యాత్మికత కన్నా రాజ్య విస్తరణ, తమ సంఖ్య పెంచుకోవడమే ప్రధానంగా కనిపిస్తుంది. హిందూ ధర్మానికి సంబంధించిన ఏ మఠం, మందిరం వ్యవహారాల్లోనైనా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవచ్చు. కర్నాటకలో ఎన్నోచోట్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ మైనార్టీ మత సంస్థల్లోగానీ, విద్యా సంస్థల్లో గానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. వాళ్ల పాఠశాలల్లో వాళ్లకు ఇష్టం వచ్చిన విద్యను వాళ్లు అభ్యసించవచ్చు. మత గ్రంధాలు చదువుకోవచ్చు. మరి హిందూ గ్రంథాలను వేటినీ ప్రత్యేక పాఠశాలల్లో చదవలేం. ప్రభుత్వ పాఠశాలల్లో అది సాధ్యపడదు. ఇంకెక్కడ హైందవ ప్రాచీనవిద్యను చదివేది? ఇదంతా సెక్యులరిజం అనే గొడుగు కిందనే జరుగుతుంది. సెక్యులరిజం అనే పదాన్ని మత ప్రమేయం లేని రాజ్యం నుండి, అర్థం నుండి దిగజార్చి కొన్ని మతాలను సంతుష్టీకరించి మరి కొన్ని మతాలను ముఖ్యంగా హిందూమతాన్ని విమర్శించాలనే ధోరణి ఈరోజు కొనసాగుతోంది. అంతెందుకు..? నిన్న మొన్నటి వరకు నేపాల్ హిందూ దేశం.

మావోయిస్టు ఉద్యమాల వల్ల అక్కడి ప్రభుత్వాలు కూలిపోగా కొత్త రాజ్యాంగ రచన ప్రారంభం అవుతుందంటే ఇక్కడి వామపక్షాలు ఆ రాజ్యాంగం కూడా సెక్యులర్‌గా ఉండాలంటున్నారు. వీళ్లెవరూ మతతత్వ రాజ్యాలకు సుద్దులు చెప్పరు, చెప్పలేరు. వీళ్లలాగే గతంలో మన గణతంత్ర దినోత్సవ అతిథిగా అమెరికా అధ్యక్షుడు వచ్చాడు. భారత్‌లో అన్ని మతాలు సమానంగా వుండేందుకు చర్యలు తీసుకోవాలని బహిరంగ ఉపన్యాసమే ఇచ్చి వెళ్లాడు. ఇక్కడి నుండి నేరుగా సౌదీ వెళ్లి వాళ్లకు అనుకూలంగా మాట్లాడాడు. కానీ అక్కడ ‘అన్నిదేశాల ప్రజలను సమానంగా చూడమ’ని ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. ముస్లింలలోని అంతర్భాగమైన షియాలకు సమాన హక్కులు ఇవ్వాలని కూడ చెప్పలేకపోయాడు. ఇదీ వరస..!

భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే పవిత్రగ్రంథం. దానిని తుచ తప్పకుండా ఇక్కడ అనుసరిస్తారు. అంతేకాని హిందూ ధర్మం ఏనాడూ పునాదిగా చేసుకోలేదు. సెక్యులరిజం పేరుతో కుహనా లౌకికవాదులు హిందువులకే పాఠాలు ఎక్కువగా చెప్తారు. హిందుత్వాన్ని తిట్టడమే సెక్యులరిజం అనే భ్రమలో, ప్రమాదంలో దేశ ప్రజలను పడేసారు. దేశాన్ని విధ్వంసం చేసే వ్యక్తి అయినాసరే సెక్యులరిస్టు అనే ముద్ర వేసుకుంటే చాలు అతను ఈ దేశంలో రాజకీయవేత్తగా చెలామణి అవుతున్నాడు. ఎంత అవినీతిలో మునిగి తేలినా సరే సెక్యులరిస్టుగా మీడియాలోని ఒక వర్గం వారిని కీర్తిస్తుంది. ప్రజలకు అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, వసతుల కల్పన ఇవన్నీ సెక్యులరిజం ముందు దిగదుడుపే.
 
ఈ పరిస్థితులన్నింటినీ ముందే ఊహించిన మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తన ‘థాట్స్ ఆఫ్ పాకిస్తాన్’ అనే గ్రంథంలో ఇలాంటి రాజకీయాలకు ఓ అద్భుతమైన పేరుపెట్టారు. ఆనాటి ముస్లిం లీగ్, జిన్నా రాజకీయాలను గ్రావమిన్ పాలిటిక్స్, ‘దుర్బలత్వం’ పేరుతో రాజకీయాలు చేయడం అని దానికి ఆయనే అర్థం చెప్పాడు. అది డెబ్బై ఏళ్లనుండి జరుగుతూనే ఉంది. దానికి వామపక్ష మేధావులు పెట్టిన అకడమిక్ పేరు ‘సెక్యులరిజం’. దాని అసలర్థం వదిలేసి నూతనార్థం వెంబడి వెళ్తున్న మన విధానాలు మారితేనే దేశం అభివృద్ధి పథంలో వెళ్లగలదు. సత్యాన్ని అణచాలనుకుంటే అది సాధ్యం కాదు. అది ఉవ్వెత్తున లేస్తుంది. ఈ డెబ్బై ఏళ్లనుండి జరిగిన అణచివేత ఈరోజు కట్టలు తెంచుకుని హిమోత్తుంగ తరంగంలా దూసుకొస్తోంది. దాన్ని ఆపడం అంత సులభం కాదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top