Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఏడుపాయల వనదుర్గ ఎక్కడ ఉందో తెలుసా? - raka sudhakar

నదులు కలిసే చోట, నదులు పాయలయ్యే చోట, పర్వత మాలికల పాదదేశాన, కొండల శిఖరాలపైన దేవాలయాలు, తీర్థయాత్రా స్థలాలు ఎందుకుంటాయి? వాటికి పవిత్రతను ఆప...

నదులు కలిసే చోట, నదులు పాయలయ్యే చోట, పర్వత మాలికల పాదదేశాన, కొండల శిఖరాలపైన దేవాలయాలు, తీర్థయాత్రా స్థలాలు ఎందుకుంటాయి? వాటికి పవిత్రతను ఆపాదించి, పూజనీయాలుగా చేసి, తప్పనిసరిగా ఏడాదికి ఒకటిరెండు సార్లు దర్శనం చేసుకుతీరాలని ఎందుకంటారు? మనిషి అంతరాంతరాల్లో దాగున్న ఆధ్మాత్మికతను ఆవాహన చేయడానికా? ప్రకృతితో మమేకమై, జగదారాధన జగదీశ్వరారాధనల అద్వైత తత్వాన్ని ఆవిష్కరించేందుకా? గండశిలలను సైతం నునుపుతేలింపచేసే నీటి ప్రవాహం ఒకటి కాదు రెండు కాదు ఏడు పాయలై కొద్దిసేపటికే మళ్లీ ఒక్కటయ్యే జలలీలనుచూపించే మెదక్ జిల్లా ఏడుపాయలకు వెళ్లగానే మన మనసుల్లో మెదిలే భావాలివే.

మనిషి మనసులో వివిధ వికారాలకు ప్రతీకల్లాంటి బండరాళ్లు...వాటిని కడిగి, తుడిచి, కరిగించి, నునుపుతేలించే సంస్కార శక్తి రూపిణియైన నిరంతర జలస్రవంతి. సాధనాపథంలో ఎక్కాల్సిన ఎత్తులను సూచించే కొండలు. ఆధ్యాత్మిక యాత్రలో చూడాల్సిన లోతుల్ని చూపించే లోయలు, ఎల్లెడలా వ్యాపించిన పరమేశ్వరీ తత్వానికి ప్రతీకగా పరుచుకున్న పచ్చదనపు అడవులు, వీటన్నిటి మధ్య చరాచర సృష్టికి అధిష్ఠాత్రిగా, అధినేత్రిగా కొలువైన వనదేవత...ఇదే ఏడుపాయలలో మన మనోనేత్రాలముందు ఆవిష్కృతమయ్యే దృశ్యం.
మెదక్ జిల్లా ఏడుపాయలకు మనల్ని తీసుకువెళ్లే దారి ఒక అద్భుతం. గుమ్మడిదల, నర్సాపూర్ ల మధ్య పరచుకున్న పోచారం అడవుల గుండా వెళ్లాలి. హైదరాబాదు జీడిమెట్లను దాటేసి ముందుకు వెళ్లిన తరువాత, మహానగరం రొద మూసుకుపోయి, మహారణ్యం ఎద తెరుచుకుంటుంది. దట్టమైన అడవిలో మెలికలు తిరుగుతూ నల్లతాచులా వెళ్లే తారురోడ్డు, ఒంటరి దారిలో "భయం లేదు" అని చెప్పేందుకు దారి పొడవునా అభయాంజనేయుడి మందిరాలు, అక్కడక్కడా వనవాసం చేస్తున్న సీతారాముల మందిరాలు ఉంటాయి. ఎత్తులు ఎక్కుతూ, లోతులు దిగుతూ నర్సాపూర్ దాటి, పాపన్నపేట చేరి, అక్కడ నుంచి మరో పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నాగసానిపల్లె వస్తుంది. నాగసానిపల్లెలోనే ఏడుపాయల తీర్థక్షేత్రం ఉంది. మొత్తం దూరం 112 కి.మీ అయినా దూరం తెలియదు. భారం తెలియదు. (నిజామాబాద్ నుంచి వస్తే 140 కి.మీ దూరం ఉంటుంది. మెదక్ పట్టణం నుంచి 18 కిమీ ఉంటుంది.)
కన్నడ నేల నుంచి పారి ప్రవహించి వచ్చే మంజీర నది కన్నడ సంస్కృతీ సౌరభాన్ని కూడా ఇక్కడికి మోసుకొస్తుంది. అందుకే ఈ ప్రదేశంలో తెలుగు, కన్నడ శైలులు కలగలిసి ప్రవహిస్తాయి. కవి డా. సి నారాయణ రెడ్డి
"ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర
ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీర
నీవు పొరలిన దారిలో ఇక్షుదండాలు
నీవు పారిన దారిలో అమృతభాండాలు"
అని పులకించి వ్రాసింది ఈ మంజీర గురించే.

మంజీర నాగసానిపల్లె దగ్గర పెద్దగుట్ట సొరంగం ఉంది. అక్కడ మంజీరను గరుడగంగ అంటారు. అక్కడే మంజీర ఏడుపాయలౌతుంది. ముందు రెండు పాయలౌతుంది. ఒక పాయను వశిష్ట, ఇంకోపాయను జమదగ్ని అంటారు. వశిష్ట నుంచి విశ్వామిత్ర అనే ఇంకో పాయ ఏర్పడుతుంది. జమదగ్ని పాయ నుంచి గౌతమ, భరద్వాజ, ఆత్రేయ, కాశ్యప అనే పాయలు ఏర్పడతాయి. సప్త ఋషుల పేర్లే సప్తపాయలకు పేర్లయ్యాయి. ఈ ఏడు పాయల మధ్యే పెద్దగుట్టను ఆనుకుని వనదుర్గాదేవి అమ్మవారు వెలసింది. వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ పాయలు వనదుర్గ వెనుకనుంచి, ఆత్రేయ, కాశ్యప, జమదగ్ని పాయలు ముందునుంచి ప్రవహించి, కొద్ది దూరానికే మళ్లీ కలిసిపోతాయి.
వనదుర్గ మందిరాన్ని చూసినప్పుడు ఒక వంద సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయి, రోడ్లు, విద్యుత్తు, రవాణా సదుపాయాలు లేని రోజుల్లో కీకారణ్యానికి కాపలాగా శార్దూల వాహినిలా అమ్మ వారు స్వేచ్ఛగా చరించిన చిత్రం కళ్లముందు మెదలాడుతుంది. నిశ్శబ్ద వనంలో మంజీర వనదుర్గ పాద మంజీరాల్లా సవ్వడి చేస్తున్న దృశ్యం కదలాడుతుంది. నేటి ఆధునిక సదుపాయాల పొరలలోనుంచి కూడా నాటి పాతదనం మనల్ని స్పృశించకమానదు.
కొన్ని యుగాల వెనక్కి వెళితే పరీక్షిత్తును తక్షకుడు కాటేయడంతో ఆగ్రహించిన జనమేజయుడు ఈ మంజీర తీరంలోనే సర్పయాగం చేసిన దృశ్యం మనం ఊహించుకోవచ్చు. యాగానికి విఘ్నం కల్పించేందుకు సర్పజాతి మంజీర జలాలతో యాగస్థలాన్ని ముంచెత్తేస్తుంది. ఇప్పటికీ భూగర్భశాస్త పరిశోధనలు చేయగా మంజీర నది అట్టడుగున బూడిద పెద్ద పరిమాణంలో దొరికిందట. నాగసానిపల్లె అన్న పేరు కూడా సర్పయాగం వల్లే వచ్చిందని జనశ్రుతి.
అనంతర కాలంలో ఈ వనరక్షకిగా, వన దేవతగా అమ్మవారు ఇక్కడే కొలువయ్యారు. సామ్రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ రాజులు వనదుర్గ అమ్మవారిని తమ సామ్రాజ్యపు సరిహద్దు దేవతగా కొలిచారు. దేవగిరి యాదవ సామ్రాజ్యం, తుగ్లక్ సామ్రాజ్యం నుంచి కాపాడుకునేందుకు మెదక్ లో పసుపువాగుకి సమీపంలో ఎత్తైన కొండ మీద కోటను నిర్మించారు. పన్నెండో శతాబ్దంలో మెదక్ నగరాన్ని సిద్ధాపూర్ అనేవారు. ఈ కోటనుంచి 18 కి.మీ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వనదుర్గ మందిరం నిర్మించారు. అప్పటినుంచే శివరాత్రికి, మాఘీ అమావాస్యకి, విజయదశమికి జాతరలు, ఉత్సవాలు జరపడం మొదలైంది. శివరాత్రి తరువాత బండి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయింది. ప్రజలు బండ్లు కట్టుకుని వచ్చి, ఏడుపాయల దగ్గరే మకాం వేసి, పంటలకు ముందు, కోతల తరువాత వచ్చి తొలి ధాన్యం వండి, అమ్మవారికి సమర్పించుకుని ఆ తరువాతే అమ్మవారి ప్రసాదాన్ని తినడం ఆచారంగా మారింది. నిజామాబాద్, మెదక్, కర్నాటక నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రావడం మొదలైంది. బలులు ఇచ్చే అలవాటు కూడా చాలా మందికి ఉంది. ఇదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మ జాతర తరువాత ఇంత భారీ సంఖ్యలో జనం వచ్చే జాతర అంటే ఏడుపాయల జాతరే. ఏటా దాదాపు 30 లక్షల మంది వస్తారని అంచనా.
ఏడుపాయల సమీపంలోని ఏత్తర శత మండలం, పాపాల మడుగు, మునిపుట్ట, తపోభూమి వంటి క్షేత్రాలకు కూడా భక్తుల రాకపోకలు పెరిగాయి. పాపాల మడుగులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయన్నది నమ్మకం.
అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఒక అద్భుత అనుభూతి కలుగుతుంది. చీకటి, వెలుతురులు అమ్మవారి విగ్రహానికి తెలియని దివ్యత్వాన్ని ఆపాదిస్తాయి. యుగాలుగా ఈ వనాన్ని కాపాడుతున్న తల్లిగా ఆమె దర్శనమిస్తుంది. ఆధునిక నిర్మాణం, సిమెంటు దిమ్మెలు, స్టీలు ట్యూబులు, ఇసుమంత దానమిచ్చి, ఇంతింతగా వేయించుకున్న నేమ్ ప్లేట్ల పైపై ఆవరణల లోనుంచి అమ్మవారి అనాది తత్వం, అనంత సత్యం మనకు కనిపిస్తాయి. తీర్థక్షేత్ర పవిత్రతను గుర్తించని వారి వికృతచేష్టలు, మద్యపానం, మల విసర్జనాల వల్ల కలిగే జుగుప్స వంటివన్నీ వనదేవత పవిత్ర రూపదర్శనంతో మటుమాయమైపోతాయి.

తిరిగివస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తెలుపు, ఎరుపు నామాలు పూసుకున్న కొండరాళ్లు ఆశీస్సులందించే అభయహస్తాల్లా కనిపిస్తాయి. తప్పక మళ్లీవస్తామమ్మా అని మన చేత చెప్పక చెప్పిస్తాయి. ఏడుపాయలను వదిలి వస్తూంటే నెమ్మదినెమ్మదిగా పన్నెండో శతాబ్దకు కాకతీయుల కత్తుల ఖణేళ్ ఖణేళ్ల నుంచి నుంచి కాలయంత్రం సాయంతో కార్లు, కరెంటుస్తంభాల నేటి యుగంలోకి వచ్చేసిన భావం కలుగుతుంది.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments