Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఇంతకీ ఆ నది ఎక్కడ పుట్టింది? - raka sudhakar

చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు....తోలుబూట్లూ...దుమ్ముపట్టిన సాక్సు...టిబటన్లు ధరించే లాంగ్‌ కోటూ, నెత్తిన టోపీ... చేతిలో ప్రార్థనా చ...



చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు....తోలుబూట్లూ...దుమ్ముపట్టిన సాక్సు...టిబటన్లు ధరించే లాంగ్‌ కోటూ, నెత్తిన టోపీ...
చేతిలో ప్రార్థనా చక్రం...టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం...దానిపై "ఓం మణిపద్మేహం" అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు ప్రార్థన చేసినట్టు. టిబిట్‌ కొండసానువుల్లో...మాయల లోయల్లో...జలప్రవాహాల గలగలలు...ఇక్కడో గుడిసే...అక్కడో గోంపా (బౌద్ధ మందిరం) అలాంటి దారిలో ఆయన వెళ్తున్నాడు...
కానీ ఆయన లామా కాదు...ఆయన చేతిలో ఉన్న ప్రేయర్‌ వీల్‌ నిజం కాదు...
ఆ కాగితంపై రహస్య సాంకేతిక భాషలో ఏదో రాసి ఉంది. ఆ దారం దూరాలను కొలిచేందుకు ఉంది.. చిన్న డబ్బాలో ఓ సెక్స్‌టెంట్‌ ఉంది. అది రూరాలను, ఎత్తునీ కొలిచేందుకు ఉపయోగిస్తారు.
లామా వేషంలో ఉన్న ఈ రహస్యమయ వ్యక్తి ఎవరు?
ఆయన ఏం చేయడానికని టిబెట్‌లో ఇలా తిరుగుతున్నారు? ఆయన పేరు కిషన్‌ సింగ్‌ రావత్‌.
ఈయనెవరు?
చూడటానికి మంగోలాయిడ్‌ ముఖం, చప్పిడిముక్కు...చిన్ని కళ్లు....
టిబెట్‌కి చెందిన ఈయన పేరు కిన్‌థూప్‌....
పెద్ద పెద్ద కొయ్యదుంగలపై ఏదో రాస్తున్నాడు....అవేవో అంకెలు...ఏవేవో అక్షరాలు...
ఆ దుంగలను శరవేగంగా ప్రవహిస్తున్న నదిలోకి వదిలేస్తున్నాడు.
ఒకటి....రెండు....మూడు....నాలుగు.....
ఇలా కొయ్యదుంగలు నదిలోకి విసురుతూనే ఉన్నాడు...
ఎందుకు? ఏమిటి ఆయన చేస్తున్న పని?? ఏమిటి ఆయన లక్ష్యం???
పేరు నైన్‌సింగ్‌ రావత్‌....
ఉత్తరాంచల్‌లోని కుమాయూలోని మిలామ్‌ గ్రామం ఈయనది.
కానీ టిబెట్‌లోని కొండదారుల్లో....కరకు లోయల్లో ...కఠిన శిలల మధ్య ఎందుకు తిరుగాడుతున్నాడు? ఏమిటి ఆయన పని...?
వీళ్లందరి మనసులో ఒకే ప్రశ్న!
వీళ్లందరి ముందూ ఒకే సవాలు?
ఒక రహస్యాన్ని ఛేదించేందుకే వీళ్లంతా బయలుదేరారు...ఏమిటా రహస్యం? ఏమిటా ప్రశ్న?
ఆ నది ప్రవాహం ఎక్కడ మొదలైంది?
ఆ నది ఎక్కడ పుట్టింది?
ఇదే ఆ ప్రశ్న!!
ఆ నది ఎక్కడ పుట్టింది?
ఒకటి కాదు...రెండు కాదు....1825 నుంచి 1918 వరకూ అంటే దాదాపు 90 ఏళ్లపాటూ ఆ నదీమూలం ఎక్కడుందో వెతికారు.
పురాణాల్లో పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞపై తల్లిరేణుకను గొడ్డలితో నరికి చంపేస్తాడు. కొడుకు ఆజ్ఞాపాలన జమదగ్నికి నచ్చి ఏం కావాలో కోరుకొమ్మంటాడు. "నాన్నా...అమ్మని మళ్లీ బ్రతికించు" అంటాడు
పరశురాముడు. తల్లి తిరిగి బతుకుతుంది. కానీ మాతృహత్యాపాతకం మాత్రం పరశురాముడిని వదిలిపెట్టదు. చేతికి గొడ్డలి అంటుకుపోతుంది. ఎంత చేసినా విడివడదు. దేశంలోని అన్ని నదుల్లో, తీర్థాల్లో, గుండాల్లో స్నానం చేసినా గొడ్డలి విడివడదు. చివరికి ఈశాన్యభారతానికి వెళ్లాడు పరశురాముడు. అక్కడ అస్సాం, అరుణాచల్‌లు కలిసేచోట ఓ కొండలోయల్లో ఉన్న ఓ కుండంలో స్నానం చేశాడు.
ఆశ్చర్యం...
గొడ్డలి ఊడివచ్చింది. అప్పటినుంచీ ఆ గుండానికి పరశురామ కుండ్‌ లేదా బ్రహ్మకుండ్‌ అని పేరు.
పరశురాముడి గొడ్డలి అక్కడే పడి ఒక పెద్దకొండగా మారిపోయింది. ఆ కొండపేరు ప్రభుకుఠార్‌ ...అంటే ప్రభువు గొడ్డలి.
ఇంత పవిత్రజలాలను మానవాళికి అందించాలన్న తాపత్రయంతో పరశురాముడు బ్రహ్మకుండ్‌ నుంచి దిగువకు దారి తవ్వుకుంటూ వచ్చాడు....అలా బ్రహ్మకుండ్‌ నుంచి పుట్టిన పరశురామ సంతానం అయింది ఆ ప్రవాహం. నదులన్నీ స్త్రీ రూపాలే. గంగ, యమున, గోదావరి...ఇలా...కానీ పరశురామ సంతానం మాత్రం మగ....అంటే పుల్లింగం అన్న మాట. ఆడ నడుల మధ్య మనవాడొక్కడే మహాబాహు మగధీర!
మగాడు కదా....మన నదం (నది స్త్రీలింగం. నదం పుల్లింగం) అల్లరిచిల్లరవాడయ్యాడు. పరశురాముడినే నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. తండ్రిమాట విని తల్లినే చంపేంత పితృవాక్యపరిపాలకుడు పరశురాముడు. "నా పుత్రుడివి...నా మాటే వినవా' అని భగ్గుమన్నాడు. నీ పేరు పుణ్యనదుల జాబితానుంచి తీసేశానుఫో అన్నాడు. అప్పటికి అబ్బాయికి దిగివచ్చింది. "అయ్యా మన్నించు' అన్నాడు. ఎంతైనా తండ్రి కదా...అందుకే "ఇచ్చిన శాపం తిరిగి తిసుకోవడం జరగదు. ఒక్క అశోకాష్టమి రోజు మాత్రం నువ్వు పుణ్యనదానివి. మిగతా 364 రోజులు మాత్రం నిన్నెవరూ పూజించరు' అన్నాడు. అందుకేనేమో మన పురాణాల్లో పెద్దగా ఆ నది ప్రశస్తి, ప్రస్తావన కనిపించడు.
ఆ నది హఠాత్తుగా బ్రహ్మకుండంలోనే పుట్టిందా? లేక ఎగువన ఇంకెక్కడైనా పుట్టిందా? ఇంతకీ ఆ నది ఎక్కడ పుట్టింది?


శతాబ్దాల తరువాత మనదేశం బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇండియా సంపదను కొల్లగొట్టడమే వారి లక్ష్యం. అందుకే దేశంలోని అణువణువునూ శోధించి, ప్రతి అంగుళాన్నీ కొలిచి తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ శోధనకోసమే సర్వేఆఫ్‌ ఇండియా, జూవాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేశాక వాళ్ల ముందుకి వచ్చిన అతి ముఖ్యమైన ప్రశ్న....ఆ నది ఎక్కడ పుట్టింది?
1826 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కల్నల్ విల్ కాక్స్, జె. బెడ్ ఫోర్డ్, 1840 లో చైనాలోకి బ్రిటిష్ అధికారి క్లోప్రోత్ , 1846లో లాయడ్ స్టౌచీ, 1866 లో నైన్ సింగ్, 1904లో మేజర్ రైడర్, గ్రాహమ్ సాండ్ బర్గ్, 1906లో స్వెన్ హెడిన్, డాక్టర్ హెర్మన్, డాక్టర్ సిడ్నీ బురండ్, 1922 లొ డాక్టర్ కింగ్ డమ్ వుడ్ లు ఆ నది మూలాలకు వెళ్లేందుకు ప్రాణాలకు తెగించి కొండ దారులలో, హిమాలయాల మంచు మధ్యలో ప్రయాణం చేశారు.
మానస సరోవరంలో కిన్ థూప్ వదలిన కొయ్య దుంగలు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు ఆ నదీ తీరానికి రెండు వైపులా అబ్జర్వేటరీలను పెట్టారు. ఒకటి రెండు చోట్ల కాదు. పదుల సంఖ్యలో. అక్కడ ఉద్యోగులకు షిఫ్టులు వేశారు. పగలూ రాత్రీ వాళ్ల పని కొయ్య దుంగలు దొరుకుతాయా అన్నది చూడటమే. మిగతా పనేమీ ఉండేది కాదు. ఇలా 27 ఏళ్లు జరిగింది. కొయ్య దుంగలు రాలేదు. కానీ బ్రిటిషర్ పట్టు విడవలేదు. ప్రయత్నం మానలేదు.
ఇన్ని ప్రయత్నాలు చేశాక ఆ నది హిమాలయాల్లోనే, గంగ, సింధునదులు పుట్టిన చోటకి దగ్గర నుంచే పుట్టి, పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం చేసి, అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చాక 180 డిగ్రీల మలుపు తిరిగి, తూర్పు నుంచి పడమరకి ప్రయాణం చేసి, నేటి బంగ్లాదేశ్ లో గంగా నదిని కలుస్తుందని తెలుసుకున్నారు. టిబెట్ లోని సాంగ్ పో నదీ, ఈ నదీ ఒక్కటేనని గుర్తించారు. మనం అదే నదిని బ్రహ్మపుత్ర అని పిలుచుకుంటాం.
ఇదీ బ్రహ్మపుత్ర మూలాల కోసం బ్రిటిషర్ల అన్వేషణ కథ.
ఇదంతా జరిగిన నాడు సాటిలైట్లు లేవు, ఏరియల్ ఫోటోగ్రఫీ లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ చైనా అదే బ్రహ్మపుత్రవై పెద్దపెద్ద డ్యాములు కట్టేస్తోంది. దారి మళ్లించేస్తోంది. మన దేశంలో బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని మార్చేస్తోంది. కానీ మన ప్రభుత్వానికి ఏమీ తెలియడం లేదు. ప్రభుత్వ వెబ్ సైట్లలో టిబెట్ లో ఈ నది పేరును సైతం తప్పుగా వ్రాశారు. \
ఈ దేశంతో తనకు ఏమాత్రం సంబంధం లేని వాడు, కేవలం దోచుకునేందుకు వచ్చినవాడు బ్రహ్మపుత్ర నది మూలాల గురించి ఇంత ప్రయత్నించాడు. ఈ దేశం తప్ప మరో దేశమే లేని మన సర్కారువారు బ్రహ్మపుత్ర గురించి కనీసం పట్టించుకోవడం లేదు.
చైనా వాడు బ్రహ్మపుత్ర ఇంకిపోయేలా చేస్తే ప్రభుత్వం ఏమీ చేసేట్టు కనిపించడం లేదు.మళ్లీ ఏ పరశురాముడో వచ్చి గొడ్డలితో దారి తీసి నదిని ప్రవహింపచేయాల్సిందేనేమో.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments