Type Here to Get Search Results !

నీటిని పొదుపు చేద్దాం - Save Water


నీరు ప్రకృతి ప్రసాదించిన వరo. నీరు లేనిదే నాగరికత, జన జీవనం, చివరికి ఈ సృష్టి కూడా ఉండదు. నగరాలు, బస్తీలలో కలసికట్టుగా ఉండే ఆడవాళ్ళు నీటిపంపుల, ట్యాంకర్ల దగ్గర బిందెలే ఆయుధాలు గా కొట్టుకోవడం నీటి సంక్షోభానికి నిదర్శనం. నీటి సంక్షోభానికి చెందిన ఇటువంటి అనేక చేదు అనుభవాలను ఎన్నో చూస్తున్నాము. భూగర్భ జల౦ తరిగిపోవడంతో వేసవిలో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ నెలలోనే 46-48 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు చూడవలసి వస్తుంది. మనిషి ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఇది.
జల సంక్షోభం:
జల సంక్షోభం దిశగా భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. నీరు వాడే తీరు మార్చుకోకపోతే 2040 నాటికి భారత్ లో గుక్కెడు నీళ్ళు దొరకని పరిస్తితి ఏర్పడుతుంది. దీనికి జవాబుగా మనం మన జీవనవిధానం మార్చుకోవాలి. నీటి పొదుపు దిశగా అడుగులు వేయాలి. లేకపోతే అతి త్వరలో మనం అతిపెద్ద నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
హెచ్చరిస్తున్న నీటి లెక్కలు:
మనదేశంలో తలసరి సగటు నీటి లభ్యత తక్కువ. లభించే కొద్దినీరు కూడా నాణ్యమైనది కాదు. నీటి సరఫరా లో క్రమభద్దతలేదు. ఇలాంటి అనేక అంశాలు నీటి సమస్యలకు కారణం అవుతున్నాయి. భారత్‌లో 2000 సంవత్సరం లో 63,400 కోట్ల ఘనపు మీటర్ల నీరు అవసరమైంది. 2025 నాటికి ఇది 1,09,300 కోట్ల ఘనపు మీటర్ల కు, 2050 నాటికి 1,44,700 కోట్ల ఘనపు మీటర్ల కు చేరుతుంది అని అంచనా. సంవత్సరానికి తలసరి లభిస్తున్న నీరు 1947 లో 6,042  క్యుబిక్ మీటర్లు. 1951 లో 5,177 క్యుబిక్ మీటర్లు, 2001 లో 1,820 క్యుబిక్ మీటర్లు, 2011 లో 1,542 క్యుబిక్ మీటర్లు ఉండగా 2025 నాటికి 1,216 క్యుబిక్ మీటర్లు, 2050 నాటికి 1,140 క్యుబిక్ మీటర్లకు పడిపోవడం ఖాయమని ఒక అంచనా.
కాలుష్య జల0 - పరిస్థితి జటిలo:
గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన సర్వే లో పట్టణాలలో 42 శాతం కాలుష్యపు నీరు అందుతుండగా, పల్లెల్లో ఏకంగా 60  శాతం కుటుంబాలకు కలుషిత జలమే దిక్కవుతుంది. పట్టణ భారతావనిలో 80 శాతం మురుగునీరు నేరుగా నదులు, జలాశయాలలోకి చేరుతుంది. ఈ నీరు ప్రజలను ఆసుపత్రులపాలు చేస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో:
తెలుగు రాష్ట్రాలను జలకాలుష్యము, జల సంక్షోభం పట్టి పీడిస్తున్నాయి. హైదరాబాదు, విశాఖపట్నం లో జల సంక్షోభం ముంచుకొస్తుంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వే ప్రకారం- ముంబాయి, కలకత్తా, హైదరాబాదు, కాన్ పూర్ నగరాల్లో మొత్తం 50లక్షల ఇళ్ళవరకు రక్షిత నీటి సరఫరా లేదు.
ఎవరు కారణం:
ఆధునిక యుగంలో తరుముకొస్తున్న నీటి సంక్షోభానికి మనిషి ఆలోచనలే కారణం. ఆధునిక మనిషి తన ‌సౌకర్యాల కోసం పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాడు.
- తన ఉనికి‌ కోసం అడవులను ‌నరికి నివాస స్థావరాలు గా చేస్తున్నాడు.
- చెరువులను‌ కబ్జాచేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నాడు.
- పచ్చని అరణ్యాలను నాశనం చేసి, సిమెంట్ అడవులను (కాంక్రీట్ జంగిల్) పెంచుతున్నాడు.
- భవనాలకు, షాపింగ్ కాంప్లెక్స్ లకు అడ్డువస్తున్నాయి అని ఒకటి రెండు చెట్లను కూడా నరికివేస్తున్నాడు.
- ఆధునిక సౌకర్యాల కోసం అనేక పరిశ్రమలు స్తాపించి, కాలుష్యాన్ని వాతావరణం లోకి వదులుతూ పర్యావరణం కు హాని చేస్తున్నాడు.
- వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం వలన పర్యావరణ కాలుష్యం పై ప్రభావం చూపుతుంది.
- వర్షాభావంవలన భూగర్భ జలంతగ్గిపోతుంది. వ్యవసాయం భారమై రైతు ఆత్మహత్యల ‌పాలవుతున్నాడు.
- పరిశ్రమలు, కర్మాగారాల వలన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నవి.
దేని కారణంగా అయితేనేమి మానవుడికి నీటి కష్టాలు తప్పవు జాగ్రత్తలు తీసుకోకపోతే.
ప్రభుత్వ పథకాలు:
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నీటి సంక్షోభం ను ఎదుర్కోవడానికి 5 సూత్రాలతో ముందడుగు వేస్తోంది. జన చేతన, నదుల అనుసందానము, శుభ్రపరిచిన నీరు అందించడం, వాన నీటి గరిష్ట వినియోగం, ఉప్పు నీటి జలాల శుద్ధీకరణ ప్రణాళికలు రచించింది. ప్రజలందరికీ తాగునీరు అందించాలి అనే లక్ష్యం తో తెలుగు రాష్ట్రాలు పనిచేస్తున్నాయి.
ప్రజల సహకారం అవసరం:
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రూపకల్పన చేసినా అమలు జరిపినప్పటికీ అవి సఫలం కావలంటే ప్రజల సహకారం కూడా అవసరం. నీటి వినియోగం, నీటి శుభ్రత, నీటి విలువ, ప్రతి ఇంటా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల వృద్ధి, విధ్యుత్ వినియోగం మీద నిగ్రహం, ఆరుతడి పంటల యాజమాన్యం వంటి పలు విషయాలపై ప్రజలు చైతన్యం పొందాలి చైతన్య పరచాలి. నీటి వినియోగం పై మనలో శ్రద్ద పెరిగితేనే జల సంక్షోభం నుండి బయటపడగల౦, అందుకోసం ఈ రోజు నుండే నీరు పొదుపు చేద్దాం. తోటి వారి నీటి కష్టాలను తరిమికొడదాము.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.