Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దూసుకొస్తున్న చైనా-china

చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ మరింతగా విస్తరిస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. హిందూమహా సముద్ర జలాలలో చైనా యుద్ధ నౌకలు ...


చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ మరింతగా విస్తరిస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. హిందూమహా సముద్ర జలాలలో చైనా యుద్ధ నౌకలు నెలకొనడం ఈసారి కొత్త విస్తరణ! మాల్ దీవులలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఈ ‘విస్తరణ’కు నేపథ్యం! హిందూ మహాసముద్రం మనదేశానికి దక్షిణంగా విస్తరించింది. మన దక్షిణ సరిహద్దునకు అత్యంత సమీపంలో నైరృతిగా మాల్‌దీవులు, ఆగ్నేయంగా శ్రీలంక హిందూ మహాసాగరంలో ఏర్పడి ఉన్నాయి. అందువల్ల హిందూ మహాసముద్ర జలాలలో చైనా యుద్ధ నౌకలు తిరుగుతుండడం మన భద్రతను భంగపరచడానికి పొంచి ఉన్న ఘోర ప్రమాదం. మాల్ దీవులలో నెలకొని ఉన్న సంక్షోభాన్ని తొలగించడానికి వీలుగా మన ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడం అనివార్యం! కానీ మాల్‌దీవులలో మన మధ్యవర్తిత్వాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఇలా వ్యతిరేకించడానికి తార్కికమైన, సమంజసమైన కారణం లేదు. మాల్‌దీవులు, శ్రీలంక మనదేశానికి అత్యంత సమీపంలో ఉన్నందున ఆ దేశాల భద్రతతో మనదేశం భద్రత దక్షిణాసియా ప్రాంత విస్తృత భద్రత ముడివడి ఉన్నాయి. అందువల్ల మాల్‌దీవుల అంతర్గత భద్రతను పరిరక్షించడం మన నైతిక విధి మాత్రమే కాదు, భౌగోళిక వాస్తవానికి, శతాబ్దుల చరిత్రకు అనుగుణమైన వ్యవహారం! ఈ చరిత్ర క్రీస్తునకు పూర్వం వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. క్రీస్తుశకం పుట్టిన తరువాత దాదాపు వెయ్యేళ్ల వరకు మాల్‌దీవులు అఖండ భారతదేశంలో భాగం, మాల్‌దీవుల సంస్కృతి భారత జాతీయ సంస్కృతిలో భాగం, వేదమతాలు ఆ తరువాత బౌద్ధమతం మాల్‌దీవులలో పరిఢవిల్లాయి. సంస్కృత భాషలో లిఖితమై ఉన్న శిలాఫలకాలు, తామ్ర శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ఆలయాల అవశేషాలు మాల్‌దీవులలో జరిగిన తవ్వకాలలో బయటపడడం ఈ సాంస్కృతిక సమానత్వానికి సజీవ నిదర్శనాలు. క్రీస్తునకు పూర్వం వేల ఏళ్లుగాను, క్రీస్తుశకం ప్రారంభమైన తరువాత వందల ఏళ్ల వరకు కూడా భాతర సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో కూడ మాల్‌దీవులు లేదా మాలా ద్వీపాలు భాగం కావడం చరిత్ర! ఇస్లాం జీహాదీ, ఐరోపా వాణిజ్య బీభత్సకారులు చొరబడిన తరువాత మాల్‌దీవులు భారత్ నుంచి క్రమంగా విడిపోయింది! బ్రిటన్ దురాక్రమణదారులు నిష్కృమించిన తరువాత మాల్‌దీవులు స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటికీ మనకు, మాల్‌దీవులకూ మధ్య సాంస్కృతిక వారసత్వ సమానత్వం ఉభయ దేశాలను పరస్పరం సన్నిహితం చేయగలిగింది. మన లక్ష ద్వీపాలకు, మాల్‌దీవులకు మధ్య ఇరుకైన సముద్రం నెలకొని ఉండడం ఉభయ దేశాల భౌగోళిక సాన్నిహిత్యానికి నిదర్శనం. మాల్‌దీవులతో చైనాకు ఈ భౌగోళిక సాన్నిహిత్యం కాని, సాంస్కృతిక సమానత్వం కాని లేదు! అందువల్ల మాల్‌దీవులలో చైనా జోక్యం అక్రమ ప్రమేయం మాత్రమే!
ముప్పయి ఏళ్లక్రితం మాల్‌దీవుల ప్రభుత్వాన్ని కిరాయిగుండాలు కూలదోసినప్పుడు, ఆ ప్రభుత్వం మనదేశ సహాయాన్ని అర్థించడం ఈ చారిత్రక సమానత్వానికి అనుగుణమైన వ్యవహారం. మన నౌకాదళంవారు మాల్‌దీవులకు వెళ్లి కిరాయి మూకల నిర్బంధం నుంచి మాల్‌దీవుల ప్రభుత్వాన్ని విముక్తం చేశాయి. అది మాల్‌దీవులకు మరోసారి లభించిన స్వాతంత్య్రం! అప్పటికి చైనాకు మాల్‌దీవులతో ఎలాంటి సంబంధం లేదు. దౌత్యసంబంధాలు లేవు, వాణిజ్య సంబంధాలు లేవు! కానీ దశాబ్దుల పాటు మన ప్రభుత్వాల నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా చైనా మాల్‌దీవులలోకి చొరబడగలిగింది. 2010లో మాల్‌దీవులలో చైనా దౌత్య కార్యాలయం నెలకొనడం ఈ చొరబాటుకు పరాకాష్ట! ఇలా చొరబడిన చైనా క్రమంగా మాల్‌దీవులతో మనదేశం కంటె సాన్నిహిత్యాన్ని సాధించడం గత ఏడేళ్ల చరిత్ర. ఇపుడు మాల్‌దీవులలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడానికి మళ్లీ మన ప్రమేయం అవసరమైంది. మన ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మాల్‌దీవుల ‘సుప్రీంకోర్టు’ వారు అభ్యర్థించారు. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత దేశ బహిష్కృతుడు మొహమ్మద్ నషీద్ కోరాడు. పజాస్వామ్య వ్యవస్థలను కోరుతున్న అంతర్జాతీయ సమాజం కూడ మాల్‌దీవులలో మన ప్రమేయాన్ని అభిలషిస్తోంది... కానీ చైనా మాత్రం మన ప్రమేయాన్ని వ్యతిరేకిస్తోంది!
మాల్‌దీవులలోకి 1988లో వలె మళ్లీ మన నౌకాదళం ప్రవేశించి నట్టయితే ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడానికి యత్నించినట్టయితే తాము అడ్డుకోనున్నట్టు చైనా ప్రభుత్వం వారు చాటింపు వేస్తున్నారు. రెండు వారాలుగా సాగుతున్న ఈ ‘చాటింపు’లో భాగంగానే హిందూ మహాసముద్రం తూర్పు భాగంలో ఆస్ట్రేలియా సమీపంలో వారం రోజులుగా నాలుగు చైనా యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి. ఈ నౌకల ఉనికిని చైనా ప్రభుత్వం ప్రచార మాధ్యమాలు స్వయంగా వెల్లడించాయి. ఆఫ్రికా దక్షిణ ప్రాంతం నుంచి మరో రెండు యుద్ధ నౌకలు కూడా హిందూ మహాసాగర జలాలలో ప్రవేశించడం సమాంతర విపరిణామం! ఓడ దొంగలను అరికట్టే నెపంతో చైనా యుద్ధ నౌకలు ఇదివరకే అరేబియా సముద్రంలోను, హిందూ మహాసముద్రం పడమటి ప్రాంతంలోను గస్తీ తిరుగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో సైతం చైనా యుద్ధ నౌకల సంచారం ఆరంభం కావడంతో మొత్తం పదకొండు చైనా యుద్ధ నౌకలు హిందూ సాగర జలాలలో తిష్ఠ వేసి ఉన్నాయి. మాల్ దీవులకు రెండు వేల ఐదువందల మైళ్ల పరిధిలో చైనా నౌకలు లేవని మన ప్రభుత్వం అంటోంది. అయినప్పటికీ తమకు ఏమాత్రం సంబంధం లేని హిందూ సాగర జలాలలో చైనా యుద్ధ నౌకలు నడయాడడమే అంతర్జాతీయంగా ఆసక్తిని కలిగిస్తున్న అంశం! డియోగో జార్సియా హిందూ మహాసముద్రంలోని చిన్నదీవి. బ్రిటన్ అధీనంలో శతాబ్దులపాటు ఉండిన ఈ దీవిని 1966 నుంచి అమెరికా తన వైమానిక దళ స్థావరంగా మార్చుకొంది. సుదూర ప్రాంతంలోని ‘అమెరికా’- హిందూసాగర జలాలలో కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనడం వల్ల ఈ ప్రాంతపు దేశాలు నిరసన తెలపడం చరిత్ర. ఈ చరిత్ర పునరావృతం అవుతోంది, పునరావృతం చేస్తున్నది చైనా!
గోటితో పోయే దానికి గొడ్డలి తీసుకున్నట్టుగా మాల్‌దీవుల పట్ల మన విధానం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన మహమ్మద్ నషీద్‌ను 2012 ఫిబ్రవరిలో ‘పోలీసులు’ తిరుగుబాటు చేసి కూలదోశారు. 1988లో వలెనే మన ప్రభుత్వం మాల్‌దీవులకు సైన్యాన్ని పంపి ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ఉండాలి! కానీ సహాయ పడవలసిందిగా అప్పటి అధ్యక్షుడు 2012లో చేసిన అభ్యర్థనను మన ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువల్ల నషీద్ పదవీచ్యుతుడయినాడు, ప్రజాస్వామ్య వ్యవస్థ భంగమైంది. మన ప్రభుత్వం నషీద్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సైనిక దళాలను మాల్‌దీవులకు పంపి ఉండినట్టయితే 2012 తరువాత మాల్‌దీవుల రాజకీయ చరిత్ర రాజ్యాంగ గతి మరో విధంగా ఉండేది. 1988నాటి విజ్ఞత 2012లో మన ప్రభుత్వానికి లేకపోవడం మాల్‌దీవులలో చైనా ‘చొరబాటు’నకు కారణం.

No comments