Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కమలహాసన్ జాతీయవాదం

తమిళ హీరో కమల్‌హసన్ ఇటీవల తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించిన సందర్భంగా పార్టీ గుర్తును వివరించిన తీరు జాతీయ భావనకి భంగం కలిగించేలా వుం...

తమిళ హీరో కమల్‌హసన్ ఇటీవల తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించిన సందర్భంగా పార్టీ గుర్తును వివరించిన తీరు జాతీయ భావనకి భంగం కలిగించేలా వుంది. ఆ పార్టీ గుర్తులో ఆరు చేతులు ఒక దానిని మరొకటి పట్టుకున్న రీతిలో ఉంది. ప్రాంతాలకు అతీతంగా ఒకరికొకరు సహకరించుకొనేదిగా తన పార్టీ గుర్తు ఉందని ఆయన చెప్పి వుంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. పార్టీ గుర్తులోని ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకగా ఆయన చెప్పటంతో జాతీయ భావనపై సందేహం  ఏర్పడింది.
ఆమధ్య సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ దక్షిణ భారతదేశం విడిపోయే పరిస్థితి వస్తోందన్న అర్థం వచ్చేలా ప్రకటన చేశాడు. మరో తెలుగు హీరో పవన్ కల్యాణ్ నోటి నుండి కూడా దక్షిణ భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ప్రకటన వచ్చింది. ఈ ముగ్గురు సినీనటుల మాటలను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? వీరి ఆలోచనలు సినిమా స్క్రిప్ట్‌ని దాటి బయటకు రావా? హీరోలకు జాతి నిర్మాణం, జాతీయ భావాలు, జాతీయ సంస్కృతి వంటివి అర్థం కావా? తాము ఎంచుకున్న ‘రాజకీయ సినిమా’ని ప్రజలు ఆదరించటం లేదు కాబట్టి, కలెక్షన్ల కోసం కొత్త తరహా ప్రచార పంథాని ఎంచుకుంటారా? ఆ ప్రచార పంథా విధ్వంసక వర్గంలో నడుపుతారా! క్లైమాక్స్‌లో పదిమందిని బాదే ముందు భారీగా డైలాగులు చెప్పటం సినీ హారోలకు అలవాటు. ఆ అలవాటును రాజకీయంలోకి తీసుకురావడం దురదృష్టకరం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవరో రాసిచ్చిన డైలాగ్‌ని వల్లెవేస్తాం అంటే ప్రజలు అంగీకరించరు. రాజకీయంలోకి ఆ ముగ్గురు నటులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సిద్ధాంతం ఆర్య, ద్రావిడ సిద్ధాంతం. అది బ్రిటిష్ వాడి మాయోపాయ సిద్ధాంతం. ఆర్యులు, ద్రావిడులనేవి వేరువేరు జాతులే కాదని, భారతీయులందరూ ఒకటే జాతి అని ఇటీవల ప్రచురించిన జన్యు ఆధారిత పరిశోధనలు రుజువు చేస్తుంటే, ప్రజలను విడగొట్టడానికి బ్రిటిష్ వాడు తెరవెనుక తెచ్చిన ఆ బూజు పట్టిన ఆర్య- ద్రావిడ సిద్ధాంతం గురించి మాట్లాడటం ప్రమాదకర ధోరణి.
బ్రిటీష్ వారు పన్నిన కుట్రలను జర్మనీ వారు గుర్తించారు. ఒకనాటి తూర్పు, పశ్చిమ జర్మనీలు నేడు ఏకమయ్యాయి. ఆ రెండు జర్మనీల ప్రజలు తమలో తాము కలహించుకునేటట్టుగా, బద్ధ శత్రువుల్లా వ్యవహరించేలా సిద్ధాంత పరంగా రెచ్చగొట్టి విడగొట్టింది రెండవ ప్రపంచ యుద్ధపు నేపథ్యం అర్థం లేని ఆ విభేదాల వల్ల తాము ఎంతగా నష్టపోయింది గమనించిన జర్మన్లు ఏకమయ్యారు. వారి మధ్యన కట్టిన బెర్లిన్ గోడను ప్రజలు  ఏకమై పగలగొట్టారు. ప్రపంచంలో జాతి భావన ఎంత బలంగా రక్తంలో జీర్ణించుకున్నదో, ఆ భావనలో ఏకం అవ్వాలన్న కోరికెంత శక్తి వంతమైనదో జర్మన్లు చూపించారు. అటువంటి ఐక్యతా భావం వదిలి తిరిగి మరోసారి ఉత్తర దేశం వారు భారతీయులు కారనే ఆలోచన తీసుకువచ్చే యత్నం సినీనటుల ద్వారా జరగటాన్ని అందరూ ఖండించాలి.
వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో భాషలు, ఆరాధనా పద్ధతులు, ఆచారాలు వేరైనప్పటికీ సంస్కృతి పరంగా ప్రజలందరూ ఒక్కటే. అదే ఏకాత్మభావంతో దేశంలోని సమాజాలన్నీ కలిసి జీవిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో కూడా ప్రజలందరూ ఐక్యతతో ఉండి ప్రాంత,్భషా భేదాలేవీ లేకుండా బ్రిటీష్ పరిపాలనను వ్యతిరేకించారు. గాంధీజీ నడిపిన స్వతంత్ర పోరాటంలో స్వచ్ఛందంగా నిలిచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దేశ సమైక్యత సమగ్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుచేతనే ఆయన రాసిన రాజ్యాంగంలో కాని, ఇతర రచనలలో కాని ఎక్కడా వేర్పాటు వాదానికి చోటు ఇవ్వలేదు. తమిళకవి సుబ్రహ్మణ్య భారతి తన రచనలలో దేశ ఔన్నత్యాన్ని కొనియాడారు.
వివిధ ఆరాధనా పద్ధతులతో ఎవరికి వారే గొప్ప అని దేశ ప్రజలు కలహించుకుంటూ దేశ అఖండత్వం ప్రమాదంలో పడినప్పుడు ప్రస్తుత కేరళ రాష్ట్రం కాలడిలో జన్మించిన శ్రీశంకరాచార్య తన అద్వైత సిద్ధాంతంతో దేశాన్ని ఒక త్రాటిపైకి తీసుకువచ్చారు. రామానుజాచార్యులు కాని, శ్రీమధ్వాచార్యులు కాని దేశ సమైక్యతనే బోధించారే కాని, వేర్పాటు వాదాన్ని కాదు దేశ అఖండత్వానికి గుర్తుగా దేశంలో నాలుగు ప్రాంతాలలోను పీఠాలను స్థాపించారు శంకరాచార్యులు. రాజులు ఎవరైనా, వారి రాజకీయ పరమైన విధానాలు ఏ విధంగా ఉన్నా ప్రజలందరూ కలిసే జీవించారు.
1947లో ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయింది. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలు రాత్రికిరాత్రే పరాయివారై పోయారు. అక్కడ ముస్లింలు జరిపిన దాడులతో హిందువులు మనదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఆ రోజున భారత ప్రజలందరూ ముక్తకంఠంతో పాకిస్తాన్ చర్యలను ఖండించారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని విడిచిపోతూ ఇక్కడ ఉన్న సంస్థానాధీశులను ‘మీరు పాకిస్థాన్‌తో కాని, భారత్‌తో కాని విలీనం అవ్వొచ్చు’ అని నక్కజిత్తుల ఎత్తు వేసినప్పుడు అప్పటి హోమ్ మంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 500 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన సందర్భంలో జాతి యావత్తు ఆ చర్యను సమర్ధించింది. జాతి యావత్తు ఒక ఆత్మ అనే భావనతో ఏకాత్మతో ఉంటుంది. జాతీయ భావనకు భంగం కలిగించటానికి ప్రయత్నించిన వారిని సమర్ధవంతంగా తిప్పి కొడుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం.
మనదేశ మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు జనరల్ కరియప్ప కర్నాటక ప్రాంతానికి చెందినవాడు. మనదేశ సమైక్యతకు, సమగ్రతకు ఆయన చూపిన చొరవ నిరుపమానం. ఈ రోజున కూడా మన సైనిక దళాలు, ప్రాంతభేదం మరచి దేశాన్ని అన్ని వేళలా రక్షిస్తున్నాయి.
కాశీ రామేశ్వరాలు, దేశంలో ఉన్న అన్ని నదీనదాల పుణ్యతీర్థాలు ప్రతిఒక్క భారతీయుడికి శ్రద్ధా కేంద్రాలు, గంగ, గీత, రామాయణ, మహాభారతాలు భారతీయుల అందరికీ ఆమోదయోగ్యాలు. గంగలో స్నానం చేసి అక్కడి గంగను దక్షిణాదిలో ఉన్న రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయటం, రామేశ్వరంలోని సేతువు (ఇసుకను) తెచ్చి గంగలో కలపటం అనేది ఈ దేశ సమైక్యతను సమగ్రతను తెలియజేస్తుంది. దక్షిణాది కొబ్బరికాయను ఉత్తరాది కుంకుమను పూజలో కలపడం దేశం అంతా ఒక్కటే అనే భావనకు చిహ్నం. అదే సాంస్కృతిక జాతీయవాదం.కాశీ, రామేశ్వరాలు వెళ్లడానికి పాసుపోర్టు, వీసాలు తీసుకునే విధానాన్ని భారత జాతి సహించదు.
కర్టసీ - శ్రీ పి.వి.శ్రీరామశాయి సెల్: 98480 76295

No comments