చార్లీ కిర్క్ - వెలుగు అంతలోనే చీకటయ్యింది, స్వరం మూగబోయింది.
ఒక చిన్న పట్టణం నుండి మహా ఉద్యమం వరకు: అక్టోబర్ 14న 1993లో ఇల్లినాయిస్‌లోని ఆర్లింగ్టన్ హైట్స్ చికాగో శివారు ప్రాంతంలో పుట్టిన చార్లీ, రాజకీయాలంటే చిన్నప్పటి నుంచే అభిరుచి కలిగినవాడు. స్కూల్ రోజుల నుంచే స్వచ్ఛందం కార్యక్రమాలలో పనిచేస్తూ, అమెరికా రాజకీయ వ్యవస్థపై లోతైన అవగాహన సంపాదించాడు. చాల పిన్న వయసులోనే అమెరికా జాతీయవాద సిద్ధాంతాలపై, చరిత్ర పై పూర్తి అవగాహన తో ఒక ఉద్యమకారుడిగా తనని తాను మలచుకున్నాడు.
టర్నింగ్ పాయింట్ – ఒక విప్లవం: 2012లో, కేవలం 18 ఏళ్ల వయసులోనే టర్నింగ్ పాయింట్ USA (TPUSA) స్థాపన ఆయన జీవితాన్ని కొత్త దిశలో నడిపింది. ఈ సంస్థ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, యువతలో సంప్రదాయ విలువలు, స్వేచ్ఛా భావం, దేశభక్తి పెంపొందించడానికి కేంద్ర బిందువైంది. ఒక విద్యార్థి స్థాయిలో మొదలైన ఉద్యమం అనతికాలంలోనే అమెరికా వ్యాప్తంగా విస్తరించి, చార్లీని జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టింది.
యువతను మేల్కొల్పిన గొంతుక చార్లీ: 2016 ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్‌కు బహిరంగ మద్దతు తెలిపిన తర్వాత, చార్లీ అమెరికా రాజకీయ వేదికపై ప్రధాన యువ నాయకుడుగా ఎదిగాడు. ఆయన రాసిన పుస్తకాలు, ఇచ్చిన ప్రసంగాలు, “ది చార్లీ కిర్క్ షో” వంటి మీడియా వేదికల ద్వారా లక్షలాది మంది యువతను ప్రభావితం చేశాయి. అమెరికా సంప్రదాయవాద పునరుజ్జీవనానికి ఆయన ఒక అప్రతిహత శక్తిగా నిలిచాడు.
కుటుంబం, విలువలు: రాజకీయాలపైనే కాకుండా కుటుంబం, గ్రామాల పట్ల, సంస్కృతి సాంప్రదాయల పైనా ఆయనకి మక్కువ. 2021లో ఎరికా ఫ్రాంట్జ్వేను వివాహం చేసుకొని, ఇద్దరి పిల్లలకు తండ్రయ్యాడు. ఒక క్రైస్తవుడిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవాడు, ఆధ్యాత్మిక విలువలతో క్రైస్తవులు అమెరికన్ లు జీవించాలని కోరుకునేవాడు.
అత్యంత పిన్న వయసులోనే కిర్క్ సాధించిన విజయాలు వేరేవ్వరూ ఇంతకు ముందు అమెరికాలో ఆస్థాయిలో ఎదగలేదు. దురదృష్టం అతన్ని వెంటాడింది ఉతా వ్యాలీ యూనివర్సిటీలో కార్యక్రమం ఓ అగంతకుడు గన్ షాట్ తో అతని వెలుగులు ఆరిపోయేలా చేసింది.
అమెరికాలో జాతీయవాదాన్ని పునరుద్ధరించాలన్న ఆయన కల అకాలంగా ఆగిపోవడం అనుచరులందరికీ భరించలేని నష్టంగా మారింది. కానీ ఆయన చూపించిన దారి, నిర్మించిన ఉద్యమం, రాసిన పుస్తకాలు, స్ఫూర్తి నింపిన ప్రసంగాలు యావత్ అమెరికా యువతలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఒక చిన్న పట్టణం నుండి ప్రారంభమై జాతీయ స్థాయికి చేరుకున్న ఈ ప్రయాణం, కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచంలోని దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు చార్లీ కిర్క్.
అతన్ని చంపడానికి గల కారణాలు: చిన్న వయసులోనే అమెరికా మొత్తానికి ఒక యువ నాయకుడుగా గుర్తింపు. వోకిజం, లిబరేషన్ థియాలజీ, డీప్ స్టేట్, లెఫ్ట్ భావాల కు వ్యతిరేకంగా, LGBTQ కి వ్యతిరేకంగా, గన్ కల్చర్ కి వ్యతిరేకంగా ఇలా అమెరికా కి నష్టం చేకూర్చే ప్రతి అంశాన్ని స్పృశిస్తూ అతను చేసిన గొప్ప ప్రసంగాలు అతన్ని ఎందరికో ప్రేరణనిస్తే మరికొందరికి నిద్రపట్టకుండా చేశాయి.
అతనో క్రైస్తవుడిగా జీవిస్తూ తన దేశంకోసం అహర్నిశలు పనిచేశాడు. అలానే ఎవరు ఏ మతం వారైనప్పటికీ వారు ఏ దేశం లో ఉంటే ఆ దేశాన్ని ప్రేమించాలని ప్రతి ఒక అమెరికన్ కి పిలుపిచ్చాడు. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు తమ దేశ అభివృద్ధికి పాటుపడాలని కలలు కన్నాడు. కానీ అర్దాంతరంగా ఇలా తన జీవితం ముగిసిపోయింది. అయినప్పటికి అతని ప్రేరణ ముందుకెళ్లాలని ఆశిద్దాం.-రాజశేఖర్ నన్నపనేని. MegaMinds.

