శ్రావణ శుక్రవారం - వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత - ఎలా జరుపుకోవాలి?
తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం వ్రతాలకు, నోములకు విశిష్టమైనది. స్త్రీలు తమ సుమంగళితనం కోసం ఈ మాసంలో ఎన్నో నోములు చేస్తుంటారు. వాటిల్లో వరలక్ష్మి వ్రతం ముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అందరు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా చేసుకుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే వరలక్ష్మి వ్రతంలో తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన వ్యతిరేక ఫలితాలు చోటు చేసుకునే ప్రమాదముంది. ఈ కథనంలో వరలక్ష్మీ వ్రతంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?
సహజంగా ప్రతి సంవత్సరం రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటాము. కానీ ఈ నెల మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవాఅరం ఆగస్టు 8 వ తేదీ వచ్చింది.
ముందే అన్ని సిద్ధం చేసుకోవాలి!
అమ్మవారి మండపానికి అవసరమైన అరటి పిలకలు, మామిడాకులు, అమ్మవారి రూపు, పళ్ళు, పూలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంథం, ఇతర పూజ సామాగ్రి ముందురోజే సిద్ధం చేసుకుంటే సమయం కలిసి వస్తుంది.
ఇది చేయవద్దు!
ఇక పండుగ రోజు వ్రతం చేసుకునే మహిళలు తలంటు స్నానం చేయకూడదు. అంటే తలారా స్నానం చేయాలి కానీ తలకు నూనె అంటుకుని స్నానం చేయరాదు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
నూతన వస్త్రధారణ!
వ్రతం చేసేటప్పుడు నూతన వస్త్రాలు ధరించి చేస్తే మంచిది. నూతన వస్త్రాలు లేకపొతే పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవచ్చు. కొంతమంది పూజ పూర్తయ్యేవరకు మడి వస్త్రాలతోనే ఉంటారు. ఇది కూడా మంచిదే! పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకూడదు.
నైవేద్యం తయారీ!
వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి 5 నుంచి 21 వరకు వారి వారి ఇంటి ఆనవాయితీని అనుసరించి ప్రసాదాలను నివేదించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రసాదాలను ముందుగానే తయారు చేసి పూజ సమయానికి సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. వీలైనంత వరకు ఇంట్లో శుచిగా, శ్రద్ధగా తయారు చేసిన ప్రసాదాలను నివేదిస్తే మంచిది.
పూజలో ఈ పొరపాట్లు వద్దు!
అన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత 'అది మర్చి పోయాం, ఇది మర్చి పోయాం' అని తరచుగా పూజ దగ్గర నుంచి లేవకూడదు. ఒకసారి ఆచమనం చేసి పూజ మొదలు పెట్టిన తర్వాత ఇక మధ్యలో లేవకూడదు. నివేదన, మంత్రపుష్పం, మంగళ హారతి పూర్తయ్యాక మాత్రమే పూజ నుంచి పైకి లేవాలి. కథ తరువాత అయినా చదువుకోవచ్చు.
ఆడంబరాలు వద్దు నిరాడంబరమే ముద్దు!
కొంతమంది ఇతరులకు తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుచేత అమ్మవారి పూజలో కూడా అన్ని ఖరీదైన వస్తువులు ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. లక్ష్మీదేవి సకల జనులకు ప్రియురాలు. ఆ తల్లి అనుకుంటే మహారాణి నుంచి కడు పేదరాలిని కూడా కరుణిస్తుంది. వ్రతాల సందర్భంగా చదువుకునే కథలను గమనిస్తే అమ్మవారు కటిక పేదవారిని కూడా కరుణించి ఐశ్వర్యవంతులను చేసిన సందర్భాలను మనం గమనించవచ్చు. అందుకే పూజలో ఆడంబరం కన్నా భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
భక్తిశ్రద్ధలు ముఖ్యం!
వరలక్ష్మీ దేవి పూజలో ప్రధానంగా కావాల్సింది భక్తిశ్రద్ధలు మాత్రమే! భక్తి లేకుండా బంగారుపూలతో పూజ చేసినా ఫలితం ఉండదు. భక్తితో ఒక్క పువ్వు సమర్పించి వేడుకున్నా ఆ తల్లి కరుణిస్తుంది.
ఈ పొరపాట్లు చేయవద్దు!
వరలక్ష్మీ పూజలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పూజ చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. సువాసన భరితంగా ఉండాలి. అలాగే నైవేద్యం తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసాదంలో ఎక్కడ మట్టి బిడ్డలు, రాళ్ళూ, వెంట్రుకలు వంటివి లేకుండా జాగ్రత్త వహించాలి.
వాయనంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక అసలైన ప్రధాన ఘట్టం ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం. ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో ఎంత ఖరీదైనవి పెడుతున్నాం అనే దాని కంటే ఎంత స్వచ్ఛమైనవి పెడుతున్నాం అనేదే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన వస్తువులు తాంబూలంలో ఉంచకూడదు. ఇందువల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదముంది. అలాగే తాంబూలం కోసం వచ్చే మహిళల పాదాలకు పసుపు వ్రతం చేసుకున్నవారు మాత్రమే పూయాలి. తాంబూలం కోసం వచ్చింది సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చేస్తే లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది.
కలశం ఎలా తీయాలి?
ఇక పూజ, వాయినాలు ఇవ్వడం అంతా పూర్తయ్యాక ఆ రోజు రాత్రి అమ్మవారి కలశాన్ని కొద్దిగా పక్కకు జరిపి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన స్నానం చేసాక కలశంలోని జలాన్ని తులసి మొక్కలో పోయాలి. అలాగే పూజ ప్రారంభంలో పూజించిన పసుపు గణపతిని కూడా తులసి మొక్కలో ఉంచితే మనం రోజు తులసి మొక్కకు నీరు పోసినప్పుడు ఆ పసుపు గణపతి కరిగిపోయి తులసి మొక్కలోనే చేరిపోతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః
Varalakshmi Vratam 2025, How to do Varalakshmi Vratam at home, Varalakshmi Vratham step by step procedure, Varalakshmi Pooja vidhanam in Telugu, Varalakshmi Vratham date and time 2025, Significance of Varalakshmi Vratham, Varalakshmi Pooja samagri list, Benefits of Varalakshmi Vratham, Varalakshmi Vratam story in Telugu, Lakshmi pooja procedure for Varalakshmi Vratham