కోడి రామ్మూర్తి నాయుడు గురించి
'ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించి, తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి గురించి క్లుప్తంగా...
ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. కోడి రామ్మూర్తి నాయుడు ఏప్రిల్, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.
కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.
రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.
తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు. పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్. హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు. అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు. లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తి గారిని తమ బక్కింగి హామ్ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.
కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు.
కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.
1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు. మరునాడు సంక్రాంతి, కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వత నిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది.