అమెరికా రష్యా ప్రపంచంలో సమానంగా శక్తివంతమైన దేశాలు అయినప్పటికీ ఎవరు ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. రెండు దేశాల వద్ద వినాశకరమైన శతఘ్నులు అనేకం ఉన్నాయి, యుద్ధం సంభవిస్తే ఎవరూ మిగలరని కూడా వారికి తెలుసు. ఈ విషయంలో క్యూబా దేశం మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తున్నది. అమెరికాకి దగ్గరగా ఉండే క్యూబాకు రష్యా రహస్యంగా ఆయుధాలను పంపించి దానిని తన రక్షణ స్థావరంగా మార్చుకున్నది. ఇది అమెరికా
శాంతి భద్రతలకు తలనొప్పిగా మారింది. అయితే అమెరికా త్వరితగతిన స్పందించి రష్యా దుందుడుకు చేష్టలను తిప్పి
కొట్టి, ఈ సంఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా నిలువరించింది. దీనిని ప్రపంచ సమస్య కాకుండా ఆపగలిగింది.
అలాగని బలహీనమైన దేశాలన్ని సురక్షితంగా యుద్ధానికి దూరంగా ఉన్నాయి అనుకోవడానికి అవకాశం లేదు. క్యూబా మాదిరిగా పెద్ద దేశాల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉన్నది. కేవలం ఆఖరి అణుపరీక్ష జరగకుండా ఇప్పటికీ వాయిదా పడుతూ వస్తున్నది. మన దేశంలో ఉన్న చాలా మంది బుద్ధి జీవులు విదేశీ శక్తులతో మనం యుద్ధం చేయకూడదని దానివల్ల మొత్తం మానవాళి అణు యుద్ధంలో నాశనమవుతుందని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు మన వరకు బాగానే ఉంటాయి కానీ అవతలి దేశాలు కూడా ఆ విధంగా ఆలోచిస్తాయి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. అవి యుద్ధ నియమాలను సైతం అతిక్రమించి మనపై దాడి చేసి మన భూభాగాన్ని ఆక్రమిస్తాయి. యుద్ధం ప్రకటించక ముందే పాకిస్తాన్ కాశ్మీర్ ని కచ్ ని, చైనా లద్దాఖ్ మరియు నేఫాని ఆక్రమించిన సంఘటనలు గాయాలుగా రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చైనా సరిహద్దులో, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.
ఒకసారి పాము తనను చూసి అందరూ బెదిరిపోతున్నారని శివుడిని ప్రార్థించి మనుషులకు తనంటే భయం తొలగించమని వేడుకున్నది. శివుడు తథాస్తు అని కాటు వేసే శక్తిని హరించాడు. అప్పటి నుండి పాము అందరికీ లోకువయ్యింది. పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరికీ పాములంటే భయం పోయింది. అందరూ పాము లతో ఆడుకుంటున్నారు. అకారణంగా హింసిస్తున్నారు. దీనితో ఆ పాము మళ్లీ శివుడిని వేడుకొనగా, శివుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, నేను నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. ఆ రకంగా మన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించి శత్రు దేశాలకు మన సామర్థ్యాన్ని రుచి చూపించి, మన దేశంతో తగువు పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితిని తీసుకురావాలి. శక్తిసామర్థ్యాల వల్లనే శాంతి స్థాపన జరుగుతుంది.