Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శివాజీ - హిందూ సామ్రాజ్య నిర్మాత - ప్రత్యేక వ్యాసం - Hindu Samrajya Diwas - megaminds

సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఒక మహా యజ్ఞకుండం రూపుదాల్చింది. అందులో ' స్వరాజ్య ' యజ్ఞం ప్రారంభమైంది. జిజాబాయి, శహాజీ దంపతు...

సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఒక మహా యజ్ఞకుండం రూపుదాల్చింది. అందులో ' స్వరాజ్య ' యజ్ఞం ప్రారంభమైంది. జిజాబాయి, శహాజీ దంపతులచే ఆ యజ్ఞం నిర్వహించబడింది. అది దాదాజీ కొండదేవ్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఆయన పురోహితుడు(ఋత్వికుడు). సమర్థ రామదాస స్వామి మార్గదర్శకుడుగా వ్యవహరించాడు. జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం లాంటివారి బోధనలు ఆ మహా యజ్ఞానికి మంత్రాలయ్యాయి. తేజస్వి యజ్ఞపురుషుడిగా యజ్ఞకుండంలోనుండి బయటకు వచ్చినవాడు శివాజీ. భారతీయ ప్రజలు యజ్ఞహవిస్సు స్వీకరించారు.

యజ్ఞకుండంలాంటి జిజాబాయి గర్భంనుండి శివాజి బయటకొచ్చింది 1627 సంవత్సరంలో తోరణ దుర్గాన్ని 1645లో అంటే తన 18 ఏళ్ళ వయసులో జయించాడు. జిజాబాయి కడుపులో ఉండగానే శివాజీలో ఆశలు - ఆకాంక్షలు రేకెత్తాయి. అవే ఆయన విజయానికి దారి తీశాయి. అలా లభించిన విజయాలు మరిన్ని ఆకాంక్షలను మేలుకొల్పాయి. విజయసాధనామార్గం అంటూ ముందే నిర్ణయింపబడిన దారి ఏదీ అతనివద్ద లేదు. ప్రతి సంఘర్షణలోనూ, విజయాన్ని చేజిక్కించుకున్న ప్రతి ప్రయత్నంలోనూ క్రొత్త క్రొత్త వ్యూహాలను అనుసరించాడు. ఆ వ్యూహాలను ఎవరో ఉపదేశించలేదు, అతడే రూపొందించుకున్నాడు. అణుమాత్రం తేడా రాకుండా ఖచ్చితంగా అమలుచేయగలిగాడు

ఆధునిక ప్రపంచ చరిత్రలోకి తొంగి చూస్తే:
ప్రపంచంలో గొప్ప సేనానులుగా పేరొందినవారు - సికిందర్, జూలియస్ సీజర్, నెపోలియన్.
నిరాశా నిస్పృహలు నిండిన సమయంలో, ప్రజల్లో మనోధైర్యం నింపినవారు - లింకన్, చర్చిల్.
జాతీయ భావాలు జాగృతం చేసి జాతిని సంఘటితం చేసినవారు - మేజిని, వాషింగ్టన్, బిస్మార్క్.
జాతి నిర్మాణానికి సర్వస్వార్పణ చేసినవారు - లెనిన్, కెమాల్ పాషా.
గెరిల్లా యుద్ధతంత్రానికి ప్రసిద్ధి చెందినవారు - మావో, చేగువేరా.
పై అయిదు విషయాలకూ విడివిడిగా పేర్కొనబడిన వారందరికీ అన్ని విషయాలలోనూ ధీటుగా నిలబడగల్గిన వ్యక్తిత్వం శివాజీ ది.

దాదాజీ కొండదేవ్ ఆయుధప్రయోగం నేర్పితే, స్వామి రామదాసు హిందవీ స్వరాజ్ కు స్ఫూర్తినిచ్చాడు. శివాజీ కాలానికి దేశంలో ఒక్క హిందూ రాజు కూడా లేడు. ఉత్తరాన మొగల్ షాహీలు, దక్షిణాన నిజామ్ షాహీలు, పశ్చిమాన అదిల్ షాహీలు, తూర్పున కుతుబ్ షాహీలు ఉన్నారు. సమాజంలో తోటి రాజులు విలాసవంతమైన జీవితం కొనసాగించడానికి ఇష్టపడుతుంటే, శివాజీ అవన్నీ వదిలి కష్టతర సాధనామార్గాన్ని ఎంచుకున్నాడు. శివాజీ ప్రారంభించిన ఉద్యమం కేవలం స్థానిక ఉద్యమంగానో, వ్యక్తిగత ఉద్యమంగానో మిగిలిపోలేదు.

దేశప్రజలంతా నిరాశానిస్పృహలకు లోనై ఇక తమకెవరు దిక్కు అని భావిస్తున్న తరుణంలో శివాజీ వెలుగు రేఖలా కనబడ్డాడు. దేశమంతటా విధర్మీయుల పాలన ఉంది. ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలంటే హిందూ రాజ్యం ఏర్పడాల్సిన అవసరం కన్పించింది. శక్తి- యుక్తి రెండూ ఉంటేనే విజయం అని స్వామి రామదాసు చేసిన బోధ శివాజీ మనసులో నాటుకుంది. తనదైన శక్తిని పెంచుకోవడానికి సాధారణ ప్రజలనే నమ్ముకున్నాడు. కొండలకోనల ప్రజలను కలిపి స్వేచ్ఛాజీవన శంఖం ఊదాడు.
 
శివాజీ అనుచరులు మామూలు మనుషులు కారు. శివాజీ కోసం, శివాజీ సూచన పాటించడం కోసం తెగించి పోరాడగలిగారు. నిశ్చింతగా మరణించారు. మరణించడానికి కూడా పోటీపడ్డారు. వారెవరికీ స్వర్గం లభిస్తుందనో, 72 మంది కన్యల పొందు లభిస్తుందనో గ్యారంటీ ఇవ్వలేదు. శివాజీ విజయాల్లో చాలాసార్లు పాలుపంచుకున్న సైనికులు నాలుగైదు వందల లోపు వారే.

ఏ సైనికునిలో ఏ సుగుణమున్నా , అది తప్పక గుర్తింపబడేది. శివాజీ ఏనాడూ బంధుప్రీతిని గాని, కొద్దిమంది పట్ల పక్షపాతాన్ని గాని చూపించలేదు. కేవలం ఆయా వ్యక్తులలోని గుణగణాలను బట్టే నియామకాలు చేసేవాడు.
తానాజీ మాలుసురె శివాజీకి బాల్యం నుండి ప్రాణసఖుడు. అయినా అతని హోదా కాల్బలంలో హజారీ సుబేదారు మాత్రమే. హంబీరరావు మోహితె శివాజీకి బావ అవుతాడు. ఆ చుట్టరికం కలిసి దాదాపు ముప్పై ఏళ్ళు గడిచిన తర్వాతగాని అతనికి సేనాపతి హోదా లభించలేదు.

తను రమ్మన్న సమయానికి రాకుండా విందు కార్యక్రమాల్లో పాల్గొని మరుసటి రోజు వచ్చి తనను కలుసుకున్న నేతాజీ పాల్కర్ ను ' తన పనిని తాను సక్రమంగా , సమయానికి నిర్వహించలేని సైన్యాధిపతి , తన ఆధీనంలోని సైన్యంలో క్రమశిక్షణను ఎలా సాధించగలడు? అని ప్రశ్నించి ఆ పదవినుండి తొలగించాడు.

జ్ఞానమనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. శాస్త్రజ్ఞానం 2. వ్యవహారజ్ఞానం. దాదాజీ కొండదేవ్ శిష్యరికంలో శివాజీ శాస్త్రజ్ఞానం కన్నా వ్యవహారజ్ఞానాన్ని ఎక్కువగా అలవరచుకున్నాడు. అందులో ఆయనది అందె వేసిన చేయి.
సాటి హిందూ వీరుడైన రాజా జైసింగ్ , విధర్మీయుడికి అనుచరుడైనా, అతనివద్దకెళ్ళినపుడు శివాజీ నిరాయుధుడిగా వెళ్ళాడు. అదే విధర్మీయుడైన శత్రువు వద్ద విధర్మీయ అనుచరుడైన అఫ్జల్ ఖాన్ వద్దకు వెళ్ళినపుడు మాత్రం అన్నిరకాల ఏర్పాట్లతోబాటు ఆయుధాలనూ వెంట తీసుకెళ్ళాడు.

శత్రువు మైమరచిపోయేట్లు చేసే చాకచక్యం శివాజీది. అఫ్జల్ ఖాన్ వధ సందర్భంలో , ' మీరు నా తండ్రి స్నేహితులు. అంటే నాకు తండ్రితో సమానం ' అని లేఖ వ్రాయడం. అది చదువుకున్న అఫ్జల్ ఖాన్ ఆనందంతో మైమరచిపోయాడు. నరసింహస్వామి చేతిలో హిరణ్యకశ్యపుడిలాగా, శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చబడి క్రూరంగా చచ్చాడు.

శత్రురాజును ఓడించాలి; ఆ రాజ్యంలోని ప్రజల మనసులను మాత్రం గెలవాలి. అబ్బాజీ సోన్ దేవ్ నాయకత్వంలోని హిందూ సేనలు కళ్యాణ్ దుర్గాన్ని జయించాయి.అక్కడి దుర్గపాలకుడు ముల్లానా అహమ్మద్ కోడలు అబ్బాజీ సోన్ దేవ్ కు బందీగా చిక్కింది. శివాజీకి కానుకగా సమర్పించాలనుకున్నాడు. ఆమె అందాన్ని చూసి, ' నీకున్న అందచందాలు నా తల్లికి ఉండి ఉంటే , అపుడు నేను కూడా అందంగా ఉండేవాడినిగదా ! ' అని నూతన వస్త్రాభరణాలతో సత్కరించి బిజాపూర్ లోని తన ఇంటికి సగౌరవంగా పంపించాడు. శివాజీ జీవితంలో సాధించిన విజయాలన్నింటిలోనూ స్వయంగా అనుచరులకు ముందుండి నడిచాడు. దీనికి ఒకేఒక మినహాయింపు సింహగఢ్ ముట్టడి.

ఎంతోమంది రాజుల్లాగా పట్టాభిషేకం చేసుకోవడమన్నది శివాజీకి వంశ పారంపర్యంగా వచ్చిన అవకాశం కాదు. స్వశక్తితో రాజ్యం స్థాపించాడు. రాజైన తర్వాత ఘనకార్యాలు కాదు; ఘన కార్యాలెన్నో చేసిన తర్వాత 1674 లో పట్టాభిషేకం చేసుకున్నాడు. తన పట్టాభిషేకం కూడా దేశప్రజలలో ఆత్మవిశ్వాసం నింపడానికే చేసుకున్నాడు. కాశీలోని విశ్వనాథ మందిరాన్ని ఔరంగజేబు మూకలు ధ్వంసం చేయడాన్ని కళ్ళారా చూసిన గాగాభట్టుతో తన పట్టాభిషేక కార్యక్రమాన్ని జరిపించుకున్నాడు. దక్షిణాదిలోని ఒక చిన్న రాజ్యానికి రాజుగా పట్టాభిషేకాన్ని, ఉత్తరాదికి చెందిన గాగాభట్టుతో జరిపించుకోవడం ద్వారా దేశ ప్రజలందరిలో ఒక విశ్వాసం పాదుకొల్పాడు. హిందువు కూడా పాలకుడవుతాడు అనే సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. వారి నవనాడులు ఉత్తేజితమయ్యాయి.

దేశంలోని మిగతా రాజులందరూ సామ్రాజ్యం, సైన్యం, నిండైన ధనాగారం కలిగి ఉండటమేకాదు, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నపుడు పట్టాభిషేకాలు చేసుకున్నవారే. శివాజీకి అలాంటి సౌకర్యాలేవీ లేవు. స్వయంకృషి, స్వయంశక్తి, స్వయంయుక్తితో వాటన్నింటినీ సాధించిన తర్వాతే పట్టాభిషేకం చేసుకున్నాడు. దేశంలో అత్యధిక భూభాగం విధర్మీయుల చేతిలో ఉండగా , శివాజీ తన పట్టాభిషేకం ద్వారా హిందూ సామ్రాజ్యానికి రూపకల్పన చేశాడు. శివాజీ పట్టాభిషేకం చేసుకున్నది వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాదు; కేవలం ధర్మరక్షణ కోసమే.

' హైందవీ స్వరాజ్ ' అనేది కేవలం తన ఏలుబడిలోని భూభాగంలో మాత్రమే ఉంటే చాలనుకోలేదు. సాటి హిందూ రాజుల ఏలుబడిలోని భూభాగం కూడా హైందవీ స్వరాజ్ గా ఉండాలనుకున్నాడు శివాజీ. అందుకే చంపక్ రాయ్, ఛత్రసాల్, ఖాల్సావీరులతో, పతనం తర్వాతి విజయనగర రాజులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు.
శివాజీ స్వయంగా వ్రాసిన లేఖలోని ' హిందవీ స్వరాజ్ ' అనే పదం , కొన్ని సంవత్సరాలపాటు మహారాష్ట్రులను ప్రభావితం చేసింది. శివాజీ ఉద్బోధించిన స్వరాజ్య భావన ఎంత జాజ్వల్యమానమైనదంటే , ఆయన చనిపోయిన తర్వాత రాజుగాని, సైన్యాధిపతి గాని లేకపోయినా , 27 సంవత్సరాల సుదీర్ఘకాలం మరాఠాలు ఔరంగజేబుతో పోరాడారు.

పట్టాభిషేకం తర్వాత ' శివరాయ ఛత్రపతి ' గా వ్యవహరించబడ్డాడు. శివాజీ మహారాజు రాజముద్ర మీద ' ప్రతిపత్ చంద్రరేఖేవ వర్ధిష్ణు విశ్వవందితా ' అనే వాక్యం ఉండింది. ఆ వాక్యానికి ' పాడ్యమి నాటి చంద్రరేఖ వలె వర్ధిల్లుతూ విశ్వమంతటా గౌరవం పొందేది ఈ రాజముద్ర ' అని అర్థం. ఎంతటి భవ్యమైన మహత్వాకాంక్షయో !
శివాజీ రూపొందించిన హైందవీ స్వరాజ్యం భారతదేశపు పశ్చిమ తీరంలో ఒక పొడవాటి రేఖలా ఉండేది. ఉత్తరాన ధరంపూర్ లేదా రాంనగర్ నుండి బెడ్నూరు వరకు ( బాంబె, జంజీరా, పోర్చుగీసు వలసలు మినహాయించి ) విస్తరించింది. హైందవీ స్వరాజ్యంలో బగ్లాన్, నాసిక్ లో కొంత భాగం, థానా, కళ్యాణ్, కొలాబా, పూనా, సతారా, గదగ్, చితల్ దుర్గ్, బాలాపూర్,కొలార్, ఉస్కోట, వెల్లూరు, జింజి, అర్ని బెంగళూరు, శ్రీరంగపట్టణం మిళితమై ఉండేవి.‌ స్వరాజ్యమంతా ప్రాంతాలుగా, తరఫ్ లుగా, మౌజాలుగా విభజించబడింది. అందులో ఇరవై తొమ్మిది జిల్లాలుండేవి.

పరంపరాగతంగా పదవులు, జాగీర్లు ఇవ్వడం వల్ల పరిపాలన గాడితప్పే అవకాశం ఉంటుందనే భావనతో ఆ పద్ధతిని రద్దుచేశాడు శివాజీ. అధికారి స్థాయి, సామర్థ్యం బట్టి పదవులు , అధికారాలు అప్పజెప్పాడు. అఫ్జల్ ఖాన్ వధలో తనతోబాటు పాల్గొన్న కృష్ణాజీ భాస్కర్ కు , బాబాజీ బాజీ కి; సింధుదర్గాన్ని నిర్మించడానికి స్థల ఎంపికలో ప్రధానపాత్ర వహించిన నలుగురు కోలీలకు; మొగలుల నుండి పురందర్ కోటను జయించుకొచ్చిన రామచంద్రపంత్ కు; తన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న బాలాజీ ఆవ్ జీ కి; షయిస్తఖాన్ మీద హఠాత్ దాడికి రూపకల్పన చేసిన కోయాజీ బంధాల్ కు జాగీర్లు, కోటల మీద అధికారాలు, భూములు అప్పజెప్పాడు. రామదాసి మఠాలకు గ్రామాలను దత్తత ఇచ్చాడు.
' పారంపర్య ఇనాములు ఇవ్వడంవల్ల అన్యాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇస్తూపోతే ఏదో ఒకనాటికి మొత్తం రాజ్యమే ఇనాముల క్రిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి రాజు అనేవాడు భూములను ఇనాములుగా ఇస్తూ పోతే చివరకు బార్లీ చెట్టు నాటడానికి కూడా స్థలముండదు ' అని రామచంద్రపంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వాధికారులను నియమితంగా ఒకచోటినుండి మరొక చోటుకు స్థానచలనం ( Transfer ) చేసేవాడు శివాజీ. నియమితంగా తనిఖీలు చేయడం ఒక విధానంగా ఉండేది. దానికొరకు రాజ్యమంతా పర్యటించేవాడు. అధికారుల మధ్య ఏవైనా పొరపొచ్చాలుంటే వాటిని తొలగించడానికి ఆయా వ్యక్తులమధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడేలా చర్యలు తీసుకునేవాడు. అన్ని వర్గాల ప్రజలకూ ఉద్యోగకల్పన మరొక సంస్కరణ. తన సమయాన్ని వృథా చర్చలు, కబుర్లు,త్రాగుడు, సుఖభోగాలు మొదలగువాటితో వృథా చేయలేదు. తన క్రింది అధికారులూ అలాగే ప్రవర్తించేలా చూసాడు. అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులకు పెద్ద మొత్తంలో జీతాలను ఏర్పాటు చేశాడు. సాధారణ సైనికుల ఎంపిక కూడా శివాజీ కనుసన్నల్లో జరిగేది. శివాజీ సైనికులందరూ అతడికి భక్తిభావనతో సేవలందించారు. మరాఠా సైనికులెవరూ శత్రువు ధనానికి, కానుకలకు లొంగిపోయి కోటలను అప్పగించిన ఉదంతం మచ్చుకు కూడా కనబడదు. అదే మొగలుల సైన్యంలోని జస్వంతసింగ్, ప్రిన్స్ మువాజ్జమ్, బహదూర్ ఖాన్ అలాగే బిజాపూర్ సైన్యం లోని రుస్తుం జమాన్, సిద్ధి జౌహర్ మొదలగువారు శత్రువు అందించే కానుకలకు ఆశపడిన ఉదాహరణలే.

పట్టాభిషేకం చేసుకున్న తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు అష్టప్రధాన్ ( మంత్రిమండలి ) వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.
1. ప్రధాన్ - మోరోపంత్ త్రయంబక్
2. అమాత్య. - నారో నీలకాంత్, రామచంద్ర నీలకాంత్
3. సేనాపతి - హంబీర్ రావు మోహితె
4. సచివ - అణ్ణాజీపంత్
5. మంత్రి - దత్తాజీ త్రయంబక్
6. రాజాధ్యక్ష్ లేదా
ధర్మాధ్యక్ష్ లేదా
పండిట్ రావ్ - రఘునాథ పంత్
7. సుమంత్ - రామచంద్ర త్రయంబక్
8. న్యాయాధీశ్ - నిరాజీ రావ్ జీ

ప్రధాన్ : రాజ్యమంతటా పరిపాలన నిర్వహణకు బాధ్యుడు.
అమాత్య : ఆర్థిక వ్యవహారాలను చూసేవాడు.
సేనాపతి: సైనిక వ్యవహారాలు చూసేవాడు.
సచివ: ఆదాయవ్యయాలను పరిశీలించేవాడు.
మంత్రి: రాజకీయ కార్యదర్శి. గూఢచార వ్యవస్థ ఈయన క్రిందే పనిచేస్తుంది.
సుమంత్: విదేశాంగ కార్యదర్శి.
పండిట్ రావ్: రాజగురువు. మతసంబంధ వ్యవహారాలు చూస్తాడు.
న్యాయాధీశ్ : ప్రధాన న్యాయమూర్తి.
అనేక సంవత్సరాలపాటు అష్టప్రధాన్ లోని మంత్రులు అవే పదవులలో కొనసాగారు. అసమర్థతను ప్రదర్శించిన పీష్వా మహదేవ, నేతాజీ పాల్కర్ తమ పదవులనుండి తొలగించబడ్డారు. మోరోపంత్ త్రయంబక్ తమ పదవిలో 18 ఏళ్ళు కొనసాగారు. అష్టప్రధాన్ వ్యవస్థలో వ్యక్తులను వంశపారంపర్యంగా నియమించడం జరగలేదు. దీనికి మినహాయింపు బాలాజీ ఆవ్ జీ. శివాజీకి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించాడు. అష్టప్రధాన్ సభ్యులెవరికీ జాగీర్లు ఇవ్వలేదు. జీతాలిచ్చారు. శివాజీ నేరుగా ఏ మంత్రిత్వ శాఖనూ నిర్వహించలేదు.పథకాలను నియంత్రించడం, అధికారులను నియమించడం, వివిధ విభాగాల పని సామర్థ్యాన్ని పరిశీలించడం మాత్రమే చేసేవాడు. శివాజీ జన్మించింది కోటలో. కోట అనేది ఆయనకు ఊయలతో సమానం. తన విజయాలకు ఆధారం. తన కోరికలకు కోటలే మెట్లు. కోట అనేది అతడి ఇల్లు, సంతోషం.
 
ఒక్కొక్క కోటకు ఒక్కో అర్థవంతమైన పేరు పెట్టాడు. ఉదాహరణకు:
సింహగఢ్ - సింహపు గుహ.
ప్రతాపగఢ్- వీరత్వపు కోట
పాండవఘర్- పాండవుల కోట
విజయదుర్గ్- విజయపు కోట
రాయఘర్- రాజరికపు కోట
పన్హాల - సర్పం నివాసం
లోహగఢ్ - ఉక్కు కోట
మిత్రగఢ్ - స్నేహపు కోట
సతారా- నక్షత్రపు కోట
శివాజీ ఆధీనంలో 240 కోటలుండేవని సభాసద్ క్రానికల్ చెబుతోంది. అందులో 111 కోటలు స్వయంగా శివాజీ నిర్మించినవి. 49 కోటలను ఆయన జయించాడు. అదే చిట్నిస్ క్రానికల్ 317 కోటలుండేవని, చిత్రగుప్త క్రానికల్ ప్రకారం 361 కోటలున్నాయని తెలుస్తోంది.

రాజ్ గఢ్, రాయగఢ్, సింహగఢ్, లోహగఢ్, మాహులి, పురందర్, పన్హాల, విశాల్ గఢ్, రంగణా, ఫోండా, వెల్లూరు, జింజి, సింధుదుర్గ్ లాంటి కోటలను పునర్నిర్మించాడు. కొండలమీద నిర్మించే కోటలు రాజును, రాజరికాన్ని, ప్రజలను, భూమిని కాపాడతాయనేది శివాజీ నమ్మకం. సింధుదుర్గ్ ను పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో పునర్నిర్మించగా, జింజి కోటను మరమ్మత్తులు చేయడానికి ఆంగ్లేయుల సహాయం కోరాడు. ఏమాత్రం అజాగ్రత్త చూపకుండా కోటగోడలను, ద్వారాలను, బురుజులను మరమ్మత్తులు చేయించేవాడు. ఈ విషయంలో తను, తన అనుచరులేగాకుండా సాధారణ ప్రజలు చేసే సూచనలనూ శ్రద్ధగా విని, వాటిని పాటించేవాడు.

రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా ఉండేది. ప్రొద్దున ఆరింటికి తెరిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారాలు మూసి ఉన్న సమయంలో చీమ కూడా లోపలనుండి బయటకు, బయటనుండి లోపలకు వచ్చే అవకాశం ఇవ్వరాదు. ఇది శివాజీ ఆజ్ఞ. హీరాఖాణి అనే మహిళ రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలు పోయడానికి వచ్చేది. ఆమెకు ఓ పసిపిల్లాడున్నాడు. అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది.‌ఒకరోజు సాయంకాలం పాలు పోయడానికి కోటలోకి వచ్చింది హీరాఖాణి. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సపర్యలు చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది.
 
ఇంటికి వెళదామని సమయం చూస్తే రాత్రి తొమ్మిది దాటిపోయింది. పరుగుపరుగున కోటగుమ్మం వద్దకు వెళ్ళింది హీరాఖాణి. కాపలాదారులకు హీరాఖాణి పట్ల అభిమానమున్నా , శివాజీ ఆజ్ఞ ధిక్కరించలేకపోయారు. ' అయ్యో! ఇంట్లో పసిపిల్లాడున్నాడు. ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి' అని ప్రాధేయపడింది.అయినా కాపలాదారులు ఒప్పుకోలేదు తలుపులు తీయడానికి.దాంతో చేసేదేం లేక హీరాఖాణీ వెనుదిరిగింది. కానీ తల్లిమనసు ఆగలేదు. ఎలాగైనా బిడ్డడి ఆకలి తీర్చడానికి ఇంటికి వెళ్ళాల్సిందే అనుకుంది. కోట గోడ వెంట నడిచింది. మరునాడు ఉదయాన కాపలాదారులు హీరాఖాణిని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమరచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతుంటే కోట గోడ వద్ద పాలకుండ కనిపించింది. ఆమె పూసల గొలుసు కోటగోడ రాయికి వ్రేలాడుతూ కనిపించింది.

ఆశ్చర్యపోయిన కాపలాదారులు శివాజీకి విషయం తెలిపారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అదెలా సాధ్యం అని నివ్వెరబోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ. హీరాఖాణి ని పిలిపించాడు. శివాజీ ముందు నిలబడ్డ ఆమె వణికిపోతూ, మహరాజా ! రాత్రి ఆకలితో ఏడుస్తున్న నా పసిబిడ్డ గుర్తుకు వచ్చాడు. కోటగోడను ఎలా దాటానో నాకే తెలీదు. నా తప్పు క్షమించండి అన్నది.

ఛత్రపతి శివాజీ కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాఖాణీకి సాష్టాంగవందనం చేశాడు. ఆమెతో మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడ ఎంత ? అన్నాడు. రాజభవనానికి తిరిగొచ్చాక , ఒక స్త్రీ కోట గోడను ఎక్కి వెళ్ళిందంటే, ఆ స్థలం , రక్షణ దృష్ట్యా బలహీనమైనది. కాబట్టి అక్కడ ఓ బురుజు నిర్మించాలని నిర్ణయించాడు. అక్కడ నూతనంగా కట్టబడిన బురుజు కు హీరాఖాణి పేరునే పెట్టాడు. ఇప్పటికీ రాయగఢ్ లో హీరాఖాణి బురుజు చూడవచ్చు.

శివాజీ నౌకాసైన్యాన్ని ఒక స్వతంత్ర విభాగంగా భావించాడు. శివాజీ కొత్త రకం నౌకలను ప్రవేశపెట్టలేదు. తద్వారా ఐరోపీయులను ఆ రంగంలో అనుసరించలేదు. దేశీయ నౌకలను నిర్మించి , అవి కొంకణ ప్రజలు సులభంగా నడపడానికి వీలయ్యేలా మరియు కొంకణ ప్రాంతపు రాళ్ళతో కూడిన తీర ప్రదేశానికి సరిపోయేలా శ్రద్ధ వహించాడు.
నౌకాదళం మరియు వ్యాపార నౌకలను తయారుచేయించడమనేది శివాజీ గొప్ప సాధన. ఆనాటి ముస్లింపాలకులు ఎలాంటి నౌకాదళాన్ని గానీ, వ్యాపార నౌకలను గానీ నిర్మించలేదు. ఆవిధంగా వారు తీరప్రాంతాలకు రక్షణ కల్పించడం గురించి, సముద్ర వ్యాపారం గురించి ఆలోచించనే లేదు.

మొగల్ రాజులందరూ ' ప్రపంచ చక్రవర్తులు ' అని పిలిపించుకున్నారేగానీ వారిలో ఏ ఒక్కరూ సముద్రంపై ఆధిపత్యం సాధించనేలేకపోయారు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు నౌకాదళాన్ని అటు రాజకీయ పరంగాగానీ, ఇటు వ్యాపారపరంగాగానీ ఓ విధానంగా భావించలేదు. అలాగే నిజాంషాహీలు గానీ, బిజాపూర్ కు చెందిన అదిల్షాహీలు గానీ ఈ పని చేయలేదు. శివాజీ తన 29 వ ఏటనే నౌకాసైన్యానికి గల ప్రాముఖ్యత గ్రహించాడు. 1659 లో అఫ్జల్ ఖాన్ వధ తర్వాత శివాజీ , కళ్యాణి, భివాండి, పన్వెల్ లలో నౌకల నిర్మాణం చేపట్టాడు. దీనికి పోర్చుగీసువారు అడ్డంకులు సృష్టించినా , ఆ తర్వాత శివాజీ నౌకలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

చిన్నవి గానీ, పెద్దవి గానీ 640 ఓడలు నిర్మించాడు శివాజీ. ఆధునిక నౌకాదళ వైతాళికునిగా శివాజీని మనం గుర్తుంచుకోవాలి. శివాజీకి ' మరాఠా నౌకాదళ పిత ' అనే బిరుదూ దక్కింది. పై విషయాలన్నింటినీ గుర్తుంచుకు‌నే , 2001 లో ముంబై లో జరిగిన ' ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ' కార్యక్రమంలో భారతీయ నౌకాదళం శివాజీకి గౌరవ వందనం సమర్పించింది.

శివాజీకి మరాఠా సామ్రాజ్యం వంశపారంపర్యంగా లభించలేదనే విషయం మనకు తెలుసు. అహ్మద్ నగర్, బిజాపూర్, ఢిల్లీ, విజయనగర చక్రవర్తులకు చెందిన భూభాగాలను జయించి హైందవీ స్వరాజ్యం ఏర్పరచాడు. వేర్వేరు చక్రవర్తుల ఏలుబడిలో ఉండిన భూభాగాలలో వేర్వేరు రెవెన్యూ పద్ధతులు అమలులో ఉండేవి. వాటినే కొన్నేండ్లు కొనసాగించాక, తనదైన రెవెన్యూ విధానాన్ని అమలుచేశాడు. శివాజీ తన రాజ్యంలోని భూములను శాస్త్రీయంగా సర్వే చేయించాడు. అధికారులను నియమించి గ్రామగ్రామానికి పంపాడు. వాళ్ళు కొండప్రాంత భూములు, బురద భూములు, సాధారణ భూములు అనే మూడు రకాలుగా భూములను విభజించారు. కొలతలు వేశారు. పన్నులను పునర్వ్యవస్థీకరించారు.

జమిందారీ విధానాన్ని మార్చి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.దాంతో రైతులకు అధికారుల చేతిలో ఇబ్బందులు తప్పాయి. గ్రామీణ ప్రాంతాలలో సైనికులను నియుక్తి చేసి ఆర్నెల్ల పాటు అభివృద్ధి కార్యాలలో పాల్గొనేలా చేశాడు. శివాజీ మద్యం అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తనతోసహా సైనికులు, ప్రభుత్వాధికారులు మద్యానికి దూరంగా ఉండేలా చూసుకున్నాడు. అయితే సాధారణ ప్రజలు మద్యం వాడకుండా నిషేధమేమీ విధించలేదు. మద్యం మీద పన్నులు విధించాడు.

రాజ్యంలోని నగరాలను చిన్న పట్టణాలనేగాదు, కొండలు గుట్టలు,నదులు వాగులను ఎక్కడ ఏవిధంగా ఉన్నాయో సూచించే చిత్రపటాలను తయారు చేయించాడు శివాజీ. ఎపుడూ యుద్ధాలలో మునిగి తేలుతుండిన కారణంగా కళలకు సంబంధించి శివాజీ ఆలోచించలేదనిపిస్తుంది.

మ్లేచ్ఛులనుండి హిందూ ధర్మాన్ని కాపాడమనే పెద్ద బాధ్యతను శివాజీ మీద ఉంచారు పెద్దలు. జిజామాత, దాదాజీ కొండదేవ్, శహాజీ, భూషణకవి, గాగాభట్టు, తుకారాం, రామదాసు మొదలగువారందరూ శివాజీనుండి కోరుకున్నదదే. హిందువుల తలమీదున్న పవిత్రమైన వెంట్రుకలను, భుజాలమీదున్న పవిత్ర దారాన్ని, చేతివ్రేళ్ళ మధ్య తిరిగే మాల ను కాపాడే వాడిగా శివాజీని వీరందరూ భావించారు. శివాజీ ధర్మాన్ని రక్షించి దేవతలను, బ్రాహ్మణులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ రాజ్యం దేవతలు, బ్రాహ్మణుల మంచిని కోరేది అని ప్రకటించాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి , ప్రచారం చేయడానికి శివాజీ తనను తాను సమర్పించుకున్నాడు.

హిందూ ధర్మాన్ని కాపాడటానికే రాజ్యంలోని వనరులను ధారాదత్తం చేశాడు. తనను తాను హిందూ ధర్మానికి సేవకుడిగా భావించాడు శివాజీ. ఢిల్లీనుండి ఔరంగజేబు హిందూ ధర్మాన్ని అణచివేతకు గురిచేయడాన్ని గమనించి, ముస్లిం రాజుల మతోన్మాదానికి వారిదైన భాషలోనే సమాధానమిచ్చాడు. ఔరంగజేబుకు తన స్వంత మతం మీద ఎంత భక్తిభావన ఉండేదో , శివాజీకి కూడా తన హిందూ ధర్మం పట్ల అంతే భక్తిభావన ఉండింది. అయితే ఔరంగజేబు తదితర ముస్లిం రాజుల్లా కాక , ఒక రాజుగా ప్రతి మతాన్ని గౌరవించాడు. రక్షణ కల్పించాడు. అశోకుడు ఎలాగైతే తన సామ్రాజ్యాన్ని బౌద్ధసంఘానికి బహుమతిగా ఇచ్చాడో, శివాజీ కూడా తన సామ్రాజ్యాన్ని స్వామి రామదాసుకు సమర్పించాడు.

శివాజీ మత సంబంధిత విషయాలలో చాలా పట్టుదలతో ఉండేవాడు. ఇస్లాం, క్రైస్తవాల ద్వారా హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి ఛాందసవాదులైన వారితో చర్చించి, వారిని ఒప్పించాడు. బజాజి నింబాల్కర్ ను హిందుత్వంలోకి తీసుకొచ్చాడు. శివాజీ తన సొంత కూతురిని బజాజి నింబాల్కర్ కొడుకుకు ఇచ్చి వివాహం జరిపించాడు. హిందూ సమాజం నింబాల్కర్ కుటుంబాన్ని , వారి హక్కులను గౌరవించడానికి శివాజీ ప్రయత్నం దారితీసింది. అలాగని అధికారబలం వెనుక ఉంచుకుని ప్రజలపై రుద్దిన ప్రయత్నం కాదది.
అలాగే నేతాజీ పాల్కర్ ను ఇస్లాం స్వీకరించిన పదేళ్ళ తర్వాత మళ్ళీ హిందూధర్మంలోకి తీసుకొచ్చాడు.

పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న భూభాగంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయని తెలిసినపుడల్లా, శివాజీ దాడులు చేసేవాడు. పోర్చుగీసువారి అభయంతో మతం మార్చే క్రైస్తవ మిషనరీల ప్రయత్నాలను అడ్డుకునేవాడు. మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్న క్రైస్తవ మిషనరీలకు శిక్షగా, వాళ్ళను హిందూధర్మంలోకి మార్పించేవాడు. తన శిక్షను అంగీకరించని నలుగురు మిషనరీలను 1667 లో తలలు తీయించేశాడు. సిద్దీల ద్వారా అపహరణకు గురై బొంబాయి లో దాచబడిన బ్రాహ్మణులను తనకు అప్పగించకపోతే , బొంబాయి మీద దాడులు చేస్తానని శివాజీ ప్రకటించడంతో, దాన్నుండి బయటపడడానికి ఆంగ్లేయులు సిద్దీలను శిక్షించి , బ్రాహ్మణులను విడిపించి , స్వరాజ్యానికి పంపించేశారు. ఆవిధంగా శివాజీ ఆనాడే ఎంతో ముందు చూపుతో హిందూధర్మంలోకి పునరాగమనాన్ని అనుసరిస్తే, ఈనాటికీ హిందూ ధార్మిక నేతలు, స్వామీజీలు ఆ పని చేయడానికి వెనుకాముందు చూస్తున్నారు.

శివాజీ కాలంలోనూ నేటిలాగే హిందువులు అనేక కులాలుగా, ప్రాంతాలవారీగా చీలిపోయి ఉన్నారు. శివాజీ అలా చీలిపోయిన హిందువులలోని అసూయ, అహంకారాలను రూపుమాపాడు. వారందరిలోనూ జాతీయవాదాన్ని మేల్కొల్పాడు. దేశంకోసం కలిసికట్టుగా పోరాడేలా చేశాడు. హిందూ ప్రపంచానికి బ్రాహ్మణుడంటే కేవలం కలం విదిల్చేవాడేకాదు, అవసరమైతే ఖడ్గాన్ని కూడా ఝళిపించగలడని , సైన్యానికి నేతృత్వం వహించగలడని చూపించాడు.

ఆనాటి సాధుసంతులు కూడా రాజకీయ పునరేకీకరణ, సామాజిక కుల సమీకరణ అవసరాన్ని తమ బోధలద్వారా ప్రపంచానికి వివరించారు. ఉదాహరణకు సమర్థ రామదాసు సమాజానికిచ్చిన పిలుపు ఇలా ఉంది: ధర్మం కోసం చావండి. అయితే శత్రువును చంపేంతవరకూ చనిపోవద్దు. మన మహారాజు అలా శత్రువులను చంపే విజయుడై వచ్చాడు. సాధారణ పరిస్థితులలో రాజు తన రాజరిక విధులు నిర్వహిస్తాడు. క్షత్రియులు తమ క్షాత్రధర్మాన్ని నిర్వహించాలి. బ్రాహ్మణులు తమ విధులను తాము నిర్వహించాలి. అయితే దేవతలు ధ్వంసం చేయబడినపుడు, బ్రతకడంకన్నా చావడమే మేలు. అదలా జరిగిందంటే మన స్వంత ధర్మం నాశనమైందని భావించాలి. మన మరాఠాభూమి ని ఏకం చేయాలి. దాన్ని రక్షించాలి. అలా చేయలేకపోతే మన పూర్వీకులు మనల్ని చూసి నవ్వుతారు. మన దేవతల శత్రువులందరూ నశిస్తారు. దైవ భక్తులంతా విజయం సాధిస్తారు. ఇలాంటి పిలుపులు మహారాష్ట్ర అంతటా జాతీయ ఐక్యత, ధర్మ జాగరణాన్ని తీసుకొచ్చాయి.

పాలించే రాజే గనుక లేకపోతే సమాజంలో అరాజకత్వం ప్రబలుతుంది. ఒకరినొకరు చంపుకు తినేందుకూ వెనుకాడరు. ఒకవేళ ఏదయినా పరిస్థితుల కారణంగా అరాజకాలకు గురైన రాజ్యాలను లేదా దేశాలను రాజ్యకాంక్షతో బలిష్టుడైన వాడెవడైనా ఆక్రమించాలని వస్తే, ఆ వ్యక్తిని ప్రజలు ఎదురేగి సత్కరించాలి. ఆ సమయంలో ఇదే మంచి ఆలోచన. ఆ బలిష్టుడైన వ్యక్తి లేదా రాజు చక్కగా పాలిస్తే రాజ్యం కుశలంగా ఉంటుంది. లేకపోతే రాజ్యం నిశ్శేషమవుతుంది అని ప్రజల కర్తవ్యాన్ని మహాభారతం తెలుపుతోంది.

ఈ రాజనీతి భారతదేశంలోని గణరాజ్యాలకు వర్తిస్తుంది కానీ విదేశీ దురాక్రమణదారుల పట్ల వర్తించదు. అయితే మన సమాజం ఈ విచక్షణను కోల్పోయింది. అలా ముస్లిం పాలనకు ప్రజలు అలవాటుపడ్డారు. నవాబుల కొలువులో ఉద్యోగులయ్యారు. ప్రలోభాలకు లొంగి మతమూ మారారు. కొందరు తమ ఆడబిడ్డలను పదవులు, ధనం కోసం అమ్ముకున్నవారూ ఉన్నారు.‌హిందువుల సహకారం లేకుండా ఈ దేశాన్ని పాలించడం కష్టమని ముస్లిం రాజులు గమనించి, హిందువుల సహకారంతోనే తమ అత్యాచారాలను, మతమార్పిడులను కొనసాగించారు. ఈ పరిస్థితులన్నింటినీ తన దార్శనికతతో గమనించిన సమర్థ రామదాసుకు మనసులో శివాజీని ' హిందూ పదపాదషాహీ ' కి ఛత్రపతిగా అభిషేకించాలని సంకల్పం కలిగింది. వాస్తవంగా, శాస్త్రీయంగా ఈ దేశానికి, ఈ ధర్మ సంస్కృతి సంప్రదాయాలకు రక్షకుడిగా స్వజనుడే రాజు కావాలి. మిగతా ఎవరైనా దురాక్రమణదారులే. ఈ ఆలోచనతోనే శివాజీకి రాజ్యాభిషేకం సంకల్పించాడు.

దేశంలో దేశీయమైన రాజరికం లేదు. 'ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా మనోరథాన్ పూరయితుం సమర్థః' అని ఎంచిన గడ్డు రోజులవి. నాటి వరకు ఢిల్లీ నవాబులకో, బిజాపూర్, వగైరా నవాబుల కొలువుకో అంకితమై బానిస చాకిరీ చేస్తున్న హిందూ సర్దారులు, జాగీర్దార్లు శివాజీని పితూరిదారుగా, చట్టబద్ధ ప్రభుత్వాల వ్యతిరేకిగా, దోపిడీదారుగా భావిస్తూ వచ్చారు. అంతేకాక, స్వజనంలో కూడా ఈయన రాజెలా అవుతాడనే అవిశ్వాసం భవిష్యత్తులో రగుల్కొనవచ్చు. శాస్త్రబద్ధంగా రాజ్యాభిషేకం జరిగితేనే శాస్త్రీయంగా చట్టబద్ధమైన అధికారం శివాజీకి లభిస్తుంది అని సమర్థుని విశ్వాసం.

ఇటువంటివారందరి దృష్టిలో అప్పటివరకు శివాజీ సాధించిన విజయాలను సనాతన ధర్మశాస్త్ర సమ్మతాలని నిరూపించి, శివాజీకి యావద్భారత ప్రజలను పరిపాలించే హక్కు ఉన్నదని తెలియజేయటానికే పట్టాభిషేక రచన చేశాడు సమర్థరాముడు. ఇక్ష్వాకు, రఘువు, రామచంద్రుడు, దుష్యంతుడు, భరతుడు, ధర్మనందనుడు వంటి చక్రవర్తులవలె శివాజీ కూడా పట్టాభిషిక్తుడై సింహాసనాన్ని అధిరోహించి ఈ పుణ్యభూమిని గొప్ప అధికారంతో పరిపాలించటానికి సనాతనధర్మశాస్త్రాలకు అనుగుణంగా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సమర్థ రామదాసు పండితసభని ఏర్పాటుచేశాడు.

ఆ సభలో విక్రమశకం 1596( క్రీశ1674) ఆనందనామ సం జ్యేష్ట శుక్ల త్రయోదశి శుభదినాన ఛత్రపతి శివాజీ మహరాజుకు పట్టాభిషేకం జరుగుతుందని గురుతుల్యులందరూ తీర్మానించారు. దానికి కాశీపండితుడు గాగాభట్టు ప్రముఖుడుగా హాజరైనాడు. కర్ణాటక, తమిళ , ఆంధ్ర దేశాలనుంచి కూడా శాస్త్ర పండితులు హాజరైనారు.

పట్టాభిషేకానికి పూర్వం శివాజీ కులగోత్ర చరిత్రలను వంశవృక్షమును తయారుచేయవలసి ఉంటుంది. దానికై శివాజీ వంశచరిత్రను పరిశోధించిన పండితులు కాశీ మొదలయిన క్షేత్రాలలోని పురోహితులు వ్రాసిన శివాజీ యొక్క వంశావళీ, వాళ్ళు చేసిన దాన ధర్మాలూ అన్నీ వెలికి తీశారు. ఆ పురాతనపత్రాలలో శివాజీ ముందుతరాల వాళ్ళయిన భోంస్లేలు క్రీ॥పూ॥ 3వ శతాబ్దంలో రాజ్యపాలన చేసిన 'శిశోడియా' అనే సూర్యవంశపు క్షత్రియులనే ఆధారాలు లభించాయి. శివాజీ సూర్యవంశజుడు అని నిర్ధారణ అయింది. ఉదయపూర్ మహారాణాల వంశంలో జన్మించాడని తెలిసింది.

పట్టాభిషేక ఉత్సవానికి రాయగఢ్ కోట మధ్యలోనున్న విశాలమైన మహామండపాన్ని పత్రపుష్పాది తోరణాలతో సుందరంగా అలంకరించారు. పట్టాభిషేకానికి విచ్చేసిన అతిథుల అంతస్తుకు తగినట్లుగా వివిధ వరుసలలో ఆసనాలను అమర్చారు. నగరమంతా దేదీప్యమానమైన దీపాదులతో అలంకరించారు.

రాజమహేంద్రవరం నించి అమాత్య బ్రహ్మరాయుడనే బ్రాహ్మణుడిని పిలిపించారు. ఈయన చతుర్వేదాలలోని అస్త్రశస్త్ర విద్యలనూ అధ్యయనంచేసి ఆయుధాలకు దైవీశక్తులను ఆపాదించగల నిష్ణాతుడు-యజ్ఞయాగాదులకు మండప నిర్మాణం చేయటంలో లబ్ధప్రతిష్ఠుడు. ఆంధ్ర, తమిళ దేశాలనించి ఋగ్వేద, యజుర్వేద ఘనాపాఠీలనూ, గుజరాత్ నుంచి శుక్లయజుర్వేదంలోనూ, కేరళ నుంచి సామవేదంలోనూ నిష్ణాతులైన పండితులను ఆహ్వానించారు. తంజావూరునించి నాదస్వర, డోలు విద్వాంసులూ, వారణాశి క్షేత్రంనించి షహనాయి, ముఖవీణ వంటి వాద్యకళాకారులనూ ఆహ్వానించారు.

వాళ్ళంతా విచ్చేసిన తరువాత పట్టాభిషేకానికి నాలుగురోజుల ముందరే కార్యక్రమాలు ప్రారంభమైనాయి. యాగశాలలో, చతుస్సాగరాలలోని తీర్థంతో నింపిన సువర్ణ కలశాలను సుందరంగా అలంకరించి ఉంచారు. వాటి చుట్టూ యావద్భారత దేశంలోని పుణ్యనదీ తీర్థాన్నీ అష్టాదశ రజత కలశాలలో నింపి ఉంచారు. యాగవేదికలో రక్షణ మంత్ర హెూమాలూ, అస్త్రశస్త్ర మంత్ర హెూమాలూ, మహాధీవలా హెూమమూ ప్రారంభమైనాయి. వేద పండితులు గుంపులుగా విడివడి వేదపారాయణ చేశారు. వాద్య కళాకారులు ఒకరితరువాత మరొకరుగా మార్చిమార్చి తమ కళాప్రదర్శన చేస్తూ ప్రజలను ఆనందపరచారు. విచ్చేస్తున్న గౌరవ అతిథులకు రాజప్రతినిధులు సముచిత రీతిన స్వాగతం పలికి ఉచితాసనాలలో ఆసీనులను చేయసాగారు. రాజ్యాభిషేక తంత్రగ్రంథంలో వర్ణించిన ప్రకారం శివాజీకి ఉపనయన వివాహాది సంస్కారాలను నిర్వర్తించిన తరువాత శివాజీని చిప్లూన్ లోని పరశురామ మందిరానికీ, ప్రతాపగఢ్ లోని భవానీ మందిరానికీ వెళ్ళి దర్శనం, పూజలు చేసుకురమ్మన్నారు.
 
శివాజీ భవానీమాతకు మేలిమి బంగారు ఛత్రాన్ని చేయించాడు. తెలిసో తెలియకో తాను గో, బ్రాహ్మణ, స్త్రీ, బాల, వృద్ధుల ఎడ ఏదైనా అపచారం చేసి ఉంటే దానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం జరిగి ధర్మపాలనార్హత పొందేటందుకుగాను కఠోర వ్రతాలను ఆచరించాడు. జూన్ 5వ తేదీ (శుక్ల ద్వాదశి) దాకా ఈ తంతులు కొనసాగాయి. అంతవరకూ సంయమ నిగ్రహాలకై అతడు శాస్త్రోక్తంగా కఠిన ఉపవాస దీక్షలను పాటించాడు.

పట్టాభిషేకపు రోజు రానేవచ్చింది: నాడు జ్యేష్ఠశుద్ధత్రయోదశి. నాటి ఉదయం శివాజీ తన పట్టపురాణి సోయరాబాయి, జ్యేష్ఠ కుమారుడు శంభాజీలతో కలిసి, సముద్రజలాలతో వేదఘోష మధ్యన అభిషేకస్నానం చేశాడు. పదహారుమంది ముత్తయిదువులు హారతులిచ్చారు. నాలుగు వర్ణాల ప్రజలూ శివాజీని అభిషేకించి ఈదేశపు పరంపరాగత సమాజానికీ, దేశానికీ సాధికార ఛత్రధారియైన రాజు శివాజీయేనని నినదించారు.

తరువాత శివాజీ తన శస్త్రాస్త్రాలను పూజించి, వాటిని దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ, ధర్మరక్షణకూ మాత్రమే ఉపయోగిస్తానని ప్రతిజ్ఞచేశాడు. తనకు మహోద్యమంలో సహకరించిన మహా విద్వాంసులకూ, వీరులకూ, ప్రజలకూ, ఆబాలగోపాలానికీ ఆర్ధ్రంగా, అశ్రుసిక్త నయనాలతో, సవినయంగా ప్రణామం చేశాడు. సింహాసనానికి ఇరువైపులా ఛత్రచామర దండాలవంటి రాజలాంఛనాలను నిలిపారు. సింహాసనమందిరం వెలుపల రెండు గజకిశోరాలనూ, సాలంకృతాశ్వాలనూ నిలిపారు. సువర్ణపుష్ప వృష్టి మధ్యన శివాజీ ప్రతి మెట్టుకూ నమస్కరిస్తూ సింహాసనాన్ని చేరి పూజించాడు.

గాగాభట్టు, వేదఘోషమధ్యన, అష్టప్రధానులతో కలిసి అతడిని మహారాజాధి రాజుగా సింహాసనారూఢుని చేశాడు. మంత్రపూరితంగా ఛత్రాన్ని పెట్టి, మొదటిగా “ఛత్రపతి శివాజీ మహారాజుకీ జయ్" అంటూ నినదించి, స్వతంత్ర సార్వభౌమునిగా ధార్మికంగా ప్రకటించి ఆశీర్వదించాడు.

"భారతీయ సంస్కృతిలో రాజు నరరూపంలో నిలిచిన ఒక మహా దేవతాస్వరూపం. రాజు ఆయా సమయాలకు తగినట్లు అగ్ని , సూర్యుడు, మృత్యువు, కుబేరుడు, యముడు అనే అయిదు రూపాలు పొందుతాడు. రాజు తన సమీపంలో ఉన్న పాపాల్ని కాల్చివేస్తున్నపుడు అగ్ని రూపం ధరిస్తాడు. గూఢచారులతో సర్వప్రాణుల ప్రవృత్తులను చూసేటప్పుడు, ప్రజలకు క్షేమం కలిగించేటప్పుడు, సూర్యుని రూపం ధరిస్తాడు. శుచిత్వం లేని ప్రజలను కోపంతో వందల కొద్దీ పుత్రపౌత్రులతో, అమాత్యులతో సహా చంపేటప్పుడు మృత్యువు రూపం ధరిస్తాడు. అధార్మికులందరినీ తీవ్ర దండాలతో శిక్షిస్తున్నపుడూ, ధార్మికులను అనుగ్రహించేటప్పుడు యముని రూపం ధరిస్తాడు. ఉపకారులను ధనధారలతో తృప్తిపరుస్తున్నపుడూ, అపకారుల నుండి వివిధ రత్నాలు లాక్కునేటప్పుడూ, ఒకనికి ధనమిచ్చేటప్పుడూ, ఒకని నుండి ధనం లాక్కునేటప్పుడూ రాజు కుబేరుని రూపం ధరిస్తాడు" అని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రాల స్ఫూర్తితో ప్రజలకు పాలనను అందించమని వేదపండితులు ఆశీర్వదించారు.

తలపై అందమైన తలపాగా, నడుమున భవానీ ఖడ్గమూ, నెడద రొమ్మున ఆణిముత్యాల సరాలూ, , గరుడ నాసికా, మెరిసే నేత్రాలూ, నుదుట విదియచంద్రుని పోలిన కుంకుమరేఖ, నల్లగడ్డంతో కొదమసింహంలా ఉన్న శివాజీని ప్రజలు ఆశతో గౌరవంతో వీక్షిస్తూ, ఆకాశానంటేలా జయజయ ధ్వానాలు చేశారు. ఆ విజయఘోష అటుఢిల్లీ దర్బారులో ఇటు బీజపూర్, గోల్కొండ నవాబుల గుండెలలో పిడుగులు కురిపించింది. ఆ ఉత్సవానికి యాభైవేలమంది వేదవేదాంగ కోవిదులు, శాస్త్రజ్ఞులూ, యతులూ, సన్యాసులూ, సాధువులూ యావద్భారత దేశంనించీ వచ్చారు. పట్టాభిషేకానికి దాదాపు ఒకకోటి నలభైరెండు లక్షల రూపాయల ధనం వ్యయమయింది. శాస్త్ర దృష్ట్యా గాగాభట్టునడిపిన కార్యక్రమాలతోపాటు ప్రజల తృప్తికీ, విశ్వాస సమన్వయానికీ, 'నిశ్చలపురి'అనే తాంత్రికుని ద్వారా కార్యక్రమాలు నడిచాయి.

వేదోక్తంగా మంగళ ఆశీర్వాదాలను స్వీకరించిన శివాజీకి మంత్రులందరూ వరుసలో నమస్కరిస్తూ సాగారు. తరువాత వారు బ్రాహ్మణులూ, కళాకారులూ ఉన్న చోటకువెళ్లి వారిని నూతన వస్త్రాలతో సువర్ణ ఆభరణాలతో, దక్షిణలతో సత్కరించారు. సత్కారాలనందుకున్న వారంతా మంత్రాక్షతలను జల్లుతుంటే శివాజీ సింహాసనం దిగి శిరస్సువంచి వారికి అభివాదం చేస్తూ నిలుచున్నాడు.

సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఈస్టిండియా కంపెనీ తరఫున రాయబారి వచ్చి కానుకలు సమర్పించాడు.
శివరాజ పట్టాభిషేకం హిందూ పదపాదషాహీ నిర్మాణాన్ని ప్రపంచానికి నిర్ద్వంద్వంగా ప్రకటించిన నూతన శకారంభం. శివాజీ బానిసకాదు. స్వతంత్రుడు.

"తన మాతృభూమిలో హిందువు తిరిగి తన జాతిని (రాష్ట్రాన్ని) పునర్నిర్మించుకోగలడు స్వరాజ్యాన్ని స్థాపించుకోగలడు, యుద్ధాలలో శత్రువులను నిర్మూలించగలడు, తన స్వరక్షణను తాను స్వయంగా చేసుకోగలడు. తన సాహిత్య కళా, విద్యా కౌశలాలను పోషించుకొని, రక్షించుకోగలడు, తన వాణిజ్య వ్యాపారాభివృద్ధులను సాధించుకోగలడు. భూనౌకా సైన్యాలను నిర్మాణం చేసుకోగలడు. సముద్ర వాణిజ్యానికి వేరే దళాలను ఏర్పాటు చేసుకోగలడు. సముద్ర యుద్ధాలలో విజయాలు సాధించగలడు. విదేశీయులతో సమాన ప్రతి పత్తులతో సాధికారంగా వ్యవహార రాయబారాలు జరుపుకోగలడు" అని ప్రపంచానికి చాటి, హిందవీస్వరాజ్య వికాసాన్ని పూర్తిగా సాధించ పూనుకున్న నవజీవన నిర్మాత శివాజీ మహరాజ్.

శివాజీ రాజకీయ జీవితాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు
1645 - 1655. నిశ్శబ్ద విప్లవం
1656 - 1658 బహిరంగ తిరుగుబాటు
1659 - 1668. రక్షణాత్మక మరియు ఎదురుదాడులు
1669 - 1674. పట్టాభిషేకం కూడా కాని రాజు విజయాలు
1675 - 1680. పట్టాభిషేకం జరుపుకున్న రాజు విజయాలు మరియు ఏకీకరణం

నిశ్శబ్ద విప్లవంలో రక్తం చిందించకుండానే తోరణ, రోహిడా, కొండణా, పురందర్ కోటలను జయించాడు. శహాజీని విడిపించాడు.
 
బహిరంగ తిరుగుబాటు లో బిజాపూర్ నవాబు అదిల్ షా నుండి జావళి, రైరి కోటలు జయించాడు. పూనా జాగీర్ ను చిన్న రాజ్యంగా మార్చేశాడు.
 
రక్షణాత్మక యుద్ధాలలో అఫ్జల్ ఖాన్ వధ, రుస్తుంజమాన్ ,ఫజల్ ఖాన్ లను జయించడం
ప్రమాదకర యుద్ధాలలో ఆగ్రా కోట నుండి తప్పించుకు రావడం. షయిస్తఖాన్ చేతివ్రేళ్ళు నరకడం, రాజా జైసింగ్ ను కలవడం, సూరత్ ను దగ్ధం చేయడం.

పట్టాభిషేకం కాకుండా మొఘలులు, బిజాపూర్, సిద్ధి నవాబులకు వ్యతిరేకంగా యుద్ధాలు. మొగలులకు అప్పగించిన కోటలన్నింటిని ( సింహగఢ్, పన్హాల, పురందర్ ) తిరిగి స్వాధీనం చేసుకోవడం.బిజాపూర్ నవాబు నుండి పాత విజయనగర సామ్రాజ్య భూభాగాలను జయించడం. 5 వ దశను మనం ఇప్పటి వరకు చదివాము.
chatrapati shivaji maharaj


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments