Type Here to Get Search Results !

Azadi ka amrut mahotsav - బత్తిని మొగిలయ్య జీవిత విశేషాలు - About Battina Mogilaiah in Telugu

battina_mogilaiah_azadi ka amrut mahotsav


స్వామిదయానంద సరస్వతి శిష్యులలో ఒకరైన స్వామి గిరిజానంద సరస్వతి 1892లో సుల్తాన్ బజార్లో ఆర్యసమాజ్ ను ప్రారంభించారు. ఓరుగల్లు ప్రజల స్వతంత్య్ర ఆకాంక్ష అభివృద్ధిలో భాగంగా 1929లో మొలుగు భూమయ్యతో ఆర్య సమాజ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. క్రమంగా అది స్వరాజ్యకాంక్ష ఉద్దీపనగా ఉద్యమవృక్షమై విరబూసింది. దేశభక్తి కలిగిన యువకులను చైతన్యవంతులను చేసి నిజాం పాలనను ఎదిరించే నైతిక స్థైర్యాన్నించింది. చైతన్య కేంద్రమైన ఓరుగల్లు కోటలో బొలుగొడ్డు ఆచారి అనే ఆర్యసమాజ్ కార్యకర్త యువకులను చేరదీసి ఆసనాలు, సాము గారడీలు దేశభక్తికి సంబంధించిన వివిధ సాంస్కృతిక ప్రక్రియలను నేర్పించడం మొదలు పెట్టారు. క్రమంగా ఆర్యసమాజ్ కార్తకలాపాలలో కాళోజీ, హయగ్రీవాచారి, చందా కాంతయ్య, మడూరి శంకరలింగం, బుర్ర కృష్ణస్వామి, దేవరకొండ చంద్రమౌళి, వేముల వెంకట్రామయ్య, ఇటికాల మధుసూదన్ రావు, ఆయన శ్రీమతి అనసూయాదేవి, బత్తిని మొగలయ్య, బత్తిని రామస్వామి మొదలైన వారు అందులో భాగస్తులై వరంగల్ రాజకీయాలను చైతన్యవంతం చేశారు.

1946 ఫిబ్రవరి రెండవారంలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఒక రహస్య సర్క్యులర్ని జారీ చేసింది. నిజాం రాజ్యం పట్టణాలలో, గ్రామాలలో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలంతా రహస్యంగానైనా త్రివర్ణ పతాకాలను ఎగుర వేయాలని, జాతీయ గీతాన్ని ఆలపించాలని దాని సారాంశం. అయితే అప్పటికే నిజాం రాజ్యంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ నిషిద్ధమయింది. బత్తిని మొగలయ్య ఆర్యసమాజ్ కార్యకర్త వరంగల్ తూర్పుకోటలో 1917లో చెన్నమ్మ, మల్లయ్య దంపతులకు ఐదవ సంతానంగా జన్మించాడు. మొగిలయ్య ఆజానుబాహుడు, బలమైన దేహంతో పాటు దేశభక్తిని మదినిండా నింపుకున్న యువకుడు. అన్యాయాన్ని, అధిపత్యాన్ని సహించలేని వ్యక్తి తాళ్ళు ఎక్కే కులవృత్తిని చేపట్టి ఆర్యసమాజ్ కార్యకలాపాలలో భాగమయ్యారు. అతని అన్న రామస్వామి అంకితభావం కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. వీరిద్దరి కారణంగా వరంగల్ కోట పరిసర ప్రాంతాలు స్వాతంత్య్ర ఉద్యమకాలంలో చైతన్య వేదికలుగా మారాయి. నిజాం రాజు తన ఫర్మానా ద్వారా త్రివర్ణ పతాకా విష్కరణను నిషేధించాడు. నిజాం రాజ్యంలో జెండా ఎత్తడమంటే మరణానికి కూడా వెరవకుండా చేసే సాహసోపేత కార్యమే!

1946 ఆగస్టు 11 ఉదయం 7.30 గంటలకు తూర్పు కోట ముఖ ద్వారం దగ్గర జెండా ఎగురవేయాలని అందులో కోటలో ఉన్న వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని మొగిలయ్య నిర్ణయించుకున్నారు. అప్పుడు హయగ్రీవాచారి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులుగా భూపతి కృష్ణమూర్తి కోశాధికారిగా ఉన్నారు. వీళ్ళతో పాటుగా ఆర్యసమాజ్ కార్యకర్తలు కాంగ్రెస్ వాలంటీర్ తో పాటు కోటలోని ప్రజలు సుమారు వందమందితో పాటు కె.సమ్మయ్య, వెంకట్రామనర్సయ్య, మడూరి రాజలింగం, కెప్టెన్ మల్లయ్య, ఆరెల్లి బుచ్చయ్య మొదలైన నాయకులంతా కలిసి జెండా ఆవిష్కరణ చేశారు..

ఈ విషయము తెలిసిన రజాకార్లు వారి అనుయాయులు ఆగ్రహావేశాలకు లోనైనారు. సుమారు రెండు వందల మంది మారణాయుధా లతో ఖాసీం షరీఫ్ అనే రజాకర్ నాయకుని ఆధ్వర్యంలో జెండా ఎత్తిన నాయకులను చంపడానికి సమాయత్తమై తూర్పు కోటకు చేరుకున్నారు. బత్తిని రామస్వామి ఇంటి వద్దకు వచ్చారు. ప్రధాన నాయకుడైన భూపతి కృష్ణమూర్తి, హయగ్రీవాచారి, పంచాయితీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య తదితరులు రామస్వామి. ఇంట్లో రాయ్ తాగుతూ భవిష్యత్ జెండా వందన కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు.

రజాకార్లు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళను చంపే ప్రయత్నం చేశారు. లోపల ఉన్న భూపతి కృష్ణమూర్తి ఇక తమకు చావు తప్పదని భయపడుతూ వెళ్ళి ఆ ఇంటి కాంపౌండు గొళ్ళెం పెట్టారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య ఆనంతరం తన కులవృత్తి అయిన తాళ్ళెక్కడానికి తూర్పు కోట చివరనున్న తాటి వనానికి వెళ్ళాడు. శనిగరం మల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త మొగిలియ్య దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళి రాజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలియ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడైనాడు. అతని గుండె ఆ క్షణంలో అగ్ని పర్వతంలా బద్దలయ్యింది. వాయువేగంతో తూర్పుకోటలోని తన ఇంటివైపు పరుగుతీశాడు. అప్పటికే రజాకార్ల దాడి భీకరంగా సాగుతుంది. మొగిలయ్య తన ఇంటి వెనుక దర్వాజ నుండి రజాకార్ల కంటపడకుండా వెళ్ళి మెరుపు వేగంతో ఇంటి చూరులోని తల్వార్ను సర్రున గుంజి మెరుపులా అప్రతిహత మైన సాహసంతో రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్షమయ్యాడు.

కాకతీయ శౌర్య ప్రతాపానికి ప్రతీకగా నిలిచి, రజాకార్ మూకపై పడి నరకడం మొదలు పెట్టాడు. ఖాసీం షరీష్ తో సహా రజాకార్లంతా చెదిరిపోయారు. బెదిరిపోయిన రజాకార్లు తమకు తాము ధైర్యం చెప్పుకొని తిరిగి మొగిలయ్యపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు మొగిలయ్య తన శత్రువును నరకడానికే తన కత్తిని పైకెత్తాడు. అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా ఖాసీం తన బల్లెంతో మొగిలయ్య గుండె మీద పొడిచాడు. అది మొదలు రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య శరీరమంతా రక్తసిక్తమై అమరుడైనాడు జెండా ఎత్తిన నాయకులకు ప్రాణభిక్ష పెట్టిన నిష్కళంక దేశభక్తుడు. బత్తిని మొగలయ్య అమరత్వం చిరస్మరణీయము. ఆయన పేరిట వరంగల్ నడిబొడ్డున 1954లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Amaravirula charitra maruguna padi ndhi! Megha minds chesthunna krusi abhinandaniyam!

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..