Type Here to Get Search Results !

భారత స్వాతంత్ర్య ఉద్యమం లో ఓ ఊరి కథ - Chimur Village Story in Indian Freedom movement

సతీసావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకుందన్నది పురాణ గాథ! అదే తరహాలో జాతీయోద్యమ సమయంలో మహారాష్ట్రలోని ఓ ఊరు బ్రిటిష్‌వారి నరరూప రాక్షసత్వాన్ని ఎదిరించింది. యావద్దేశం వెంట నిలవగా... తమ ఊరి యోధుల ప్రాణాలను  ఉరికంబం నుంచి కాపాడుకుంది.

చిమూర్‌... నాగ్‌పుర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడెవరికీ అంతగా తెలియదు. కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ ఊరు దేశవ్యాప్తంగా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. 1942 ఆగస్టు 8న గాంధీజీ ముంబయిలో ‘క్విట్‌ ఇండియా’ అంటూ ఇచ్చిన పిలుపునకు చిమూర్‌ కూడా స్పందించింది. ఆగస్టు 16న గ్రామ ప్రజలు పెద్దఎత్తున ఆందోళన ప్రదర్శన చేపట్టారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అణచివేస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వం... ఈ పల్లెటూరులో ప్రదర్శనను కూడా తీవ్రంగా పరిగణించింది. పోలీసులు నిర్దాక్షిణ్యంగా... తమ వద్ద ఉన్న మందుగుండు సామగ్రి పూర్తయ్యేదాకా కాల్పులు జరిపారు. చాలామంది మరణించారు. వందలమంది గాయపడ్డారు.  ఆగ్రహించిన ప్రజలు తిరగబడ్డారు. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌, సీఐ, నాయిబ్‌ తహసీల్దార్‌, పోలీసు కానిస్టేబుల్‌లపై దాడిచేసి చంపేశారు. టింబర్‌డిపోలకు నిప్పంటించారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆగస్టు 19న ప్రత్యేక రైలులో... 200 మంది ఐరోపా సైనికులు, 50 మంది భారతీయ సిపాయిలను దింపింది. వీరు గ్రామంపై పడి అల్లకల్లోలం సృష్టించారు. ఊరంతటినీ వల్లకాడు చేశారు. అనేకమంది మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. పిల్లలనూ లైంగికంగా వేధించారు. 400 మందిని అరెస్టు చేశారు. ఇదంతా జరుగుతుండగానే... చిమూర్‌కే చెందిన దాదిబాయి బెగ్డే అనే ఓ పెద్దావిడ జిల్లా కలెక్టర్‌ సుబ్రమణ్యాన్ని కలిసి ఈ దారుణాలను ఆపాలని వేడుకోగా... ఆయన ఆదేశాల మేరకు ఆగస్టు 26న బ్రిటిష్‌ సైన్యం వెనక్కి వెళ్లింది. ఊరిపై ప్రభుత్వం లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆంక్షలు విధించింది. 400 మందిపై విచారణ మొదలైంది.

చంద్రపుర్‌ బార్‌ అసోసియేషన్‌, పలువురు మహిళా కార్యకర్తలకు ఈ విషయం తెలిసి చిమూర్‌ వెళ్లి వచ్చారు. అక్కడ జరిగిన ఆకృత్యాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయం ముంబయి రేడియోలో, అక్కడినుంచి బెర్లిన్‌లోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ ఆజాదీ హింద్‌ రేడియోలో ప్రసారం కావటంతో ఆంగ్లేయ ప్రభుత్వం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. చిమూర్‌ గురించి ఎలాంటి వార్తలు రాయవద్దని ప్రసారసాధనాలపై ఆంక్షలు విధించింది. గాంధీజీ శిష్యుడు ప్రొఫెసర్‌ జె.పి.భన్సాలీ ఈ వ్యవహారంపై వార్దాలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష గురించీ రాయవద్దని ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా భారత్‌లో 1943 జనవరి 6న పత్రికలన్నీ ఒక రోజు సమ్మె చేశాయి.  ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది.
13 మంది మహిళలను ఐరోపా సైనికులు అత్యంత దారుణంగా  సామూహికంగా అత్యాచారం చేశారని, బాలికలను సైతం వదలలేదని, గర్భిణి అయిన సర్పంచి భార్యపైనా అత్యాచారం చేశారని కమిటీ తేల్చింది. దీంతో యావద్దేశం రగిలిపోయింది. ఇంతలో పుండుపై కారంలా చిమూర్‌ కేసులోని 400 మందిలో 29 మందికి మరణశిక్ష, 43 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, మత సంఘాలు... మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ ప్రభుత్వానికి లక్షల పిటిషన్లు దాఖలు చేశాయి. సర్కారు 22 మందికి మాత్రం శిక్షను తగ్గించింది. ఏడుగురిని ఉరికి సిద్ధం చేసింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన మహాత్మాగాంధీ ఆ ఏడుగురి శిక్ష కూడా తగ్గించాలంటూ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ముంబయిలో లక్షన్నర మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఇంతలో నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో లండన్‌లోని ప్రివి కౌన్సిల్‌కు అప్పీల్‌ చేశారు. అక్కడా 1944లో తిరస్కరణే ఎదురైంది. వెంటనే భారత నేతలు చిమూర్‌ ప్రజల తరఫున బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌-6 కు వినతి పంపారు. రాజు తన నిర్ణయాన్ని తెలిపేలోపే ఏడుగురిని ఉరితీయాలని ఏర్పాట్లు చేయసాగారు భారత్‌లోని ఆంగ్లేయ అధికారులు. సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ అనసూయబాయి కాలే ఇంగ్లాండ్‌లో తనకున్న పరిచయాలతో ఒత్తిడి పెంచటంతో... 1945 ఆగస్టు 16న ఏడుగురి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నట్లు రాజు ప్రకటించారు. అలా జాతీయోద్యమంలో ఒక ఊరి కోసం యావద్దేశం ఏకమై పోరాడింది. ఉరికంబానికి దగ్గరగా వెళ్లిన ఏడుగురినీ కాపాడుకుంది. ఆ ఏడుగురినీ విప్లవ సప్తరుషుల్లా భావించింది చిమూర్‌! ఇప్పటికీ  ఏటా ఈ ఊర్లో ఆగస్టు 16ను క్రాంతి దినోత్సవంగా నిర్వహిస్తారు.

భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా మీ మీ గ్రామం, మండల, జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం గురించి మాకు వాట్సాప్ ద్వారా పంపండి 8500581928
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.