1857 స్వాతంత్ర్య సంగ్రామంలో అపజయం పాలైన హిందూ సమాజం ఒకరకంగా అంతర్ముఖం అయింది, ఈ సమయంలో స్వాతంత్రం కోసం సుదీర్ఘ సమరానికి సమాజాన్ని సిద్ధం చేయడానికి అనేకమంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలలో కీలకమైన కొన్ని విషయాలు నెమరు వేసుకోవడం అవసరం 1) దయానంద సరస్వతి 1875 సంవత్సరం లో ఆర్యసమాజ్ స్థాపించారు 2) వాసుదేవ బలవంతఫడ్కే వ్యక్తిగత స్థాయిలో బ్రిటిష్ వారిపై సమరం సాగించాడు 3 )1885 సంవత్సరంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది 4) తిలక్ నాయకత్వంలో ఉద్యమ రాజకీయాలు ప్రారంభమైనవి 5) కాంగ్రెస్ లో అతివాదులు మితవాదులు గా చీలిపోయారు 6) హిందూ మహాసభ ప్రారంభమైంది. ఇక్కడే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, 1857 స్వతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ పార్లమెంటు నేరుగా భారత దేశాన్ని పరిపాలించటం ప్రారంభమైనది, దానితో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దానితో ఈ దేశం జాతీయతను పునర్ నిర్వచించుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఒకే దేశంగా ఉండేది, పాలనాపరంగా అప్పుడప్పుడు శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉన్నప్పటికీ, దేశంలో అనేక రాజ్యాలు ఉండేవి, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపరంగా ఒకే పాలన క్రింద ఉన్నప్పడు జాతీయవాదాన్ని నిర్వహించు కోవలసిన అవసరం ఏర్పడింది. దానికే ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బంకించంద్ర, వివేకానంద, అరవింద పునాదులు వేశారు, ఆ తర్వాతి కాలంలో స్వాతంత్ర వీరసావర్కర్, డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్, శ్రీ గురూజీ మొదలైన వాళ్ళు ఆ భావాలను పటిష్టం చేసి దేశ వ్యాప్తం చేసేందుకు పని చేశారు.
మనదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలం లోనే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే, 1939 సెప్టెంబర్ 1 నుండి రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనది. రెండవ ప్రపంచ యుద్ధానికి కంటే ముందే స్వతంత్ర వీరసావర్కర్ సమర శంఖం పూరించారు. 1906 నుండి 66 వరకు అవిశ్రాంత పోరాటం చేశారు, ఈ దేశంలో ఒక సైద్ధాంతిక కర్తగా, విప్లవాల నాయకుడిగా, రాజకీయాలలో అటు బ్రిటిష్ వాళ్లకు, ఇటు కాంగ్రెస్ వాళ్లకు ఒక విస్మరించని నాయకుడిగా గుర్తింపబడి, తనదైన శైలిలో పని చేసిన వారు స్వతంత్ర వీరసావర్కర్ వారి జీవితం లోని కొన్ని ప్రముఖ సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆనాటి దేశ పరిస్థితులు మరియు స్వాతంత్ర పోరాటం తీరు తెన్నులు మనకు సులభంగా అర్థం అవుతాయి.
1883 సంవత్సరం వాసుదేవ బలవంత ఫడ్కే, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఇరువురు మరణించారు, ఆ ఇరువురి పనులను కొనసాగించటానికి అన్నట్లు 1883 మే 28వ తేదీన వినాయక్ దామోదర్ సావర్కర్ నాసిక్ సమీపంలో భగూర్ గ్రామంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థి గానే వీరగాథలను, కావ్యాలను, రచించడం ప్రారంభించారు, అవి అనేక పత్రికలలో ప్రచురించబడుతూవుండేవి, 1900 సంవత్సరంలో మిత్ర మేళ పేరున విప్లవకారుల బృందం ఏర్పాటు చేశాడు, అభినవ భారత్ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంస్థను 1904 సంవత్సరంలో ప్రారంభించారు. 1906 సంవత్సరంలో న్యాయవాద విద్య కోసం లండన్ చేరి అక్కడ శ్యామ్ జీ కృష్ణ వర్మ స్థాపించిన ఇండియన్ హౌస్ లో నివాసం ఉన్నారు, అక్కడి నుండే మనదేశంలో విప్లవ కార్యకలాపాలకు పునాదులు వేశారు. 1906 సంవత్సరంలో లండన్ లో సావర్కర్ కు మొట్టమొదటిసారి గాంధీజీ తో పరిచయం జరిగింది. 1909 మార్చి మొదటి వారంలో రష్యా అధినేత లెనిన్ తో సావర్కర్ కలిశారు, భారత స్వతంత్ర పోరాటంలో విప్లవ కార్యకలాపాలు గురించి చర్చించారు, అట్లా నాలుగు సార్లు ఇరువురు కలవడం జరిగింది. విప్లవకారులు భగవద్గీత గా భావించే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గ్రంధాన్నిసావర్కర్ బ్రిటిష్ మ్యూజియంలో చాలా రోజులు అధ్యయనం చేసి వాస్తవ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చాడు, దానిని ముద్రణ కాకముందే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిది, దానితో ఆ పుస్తకాన్ని 1909వ సంవత్సరంలో హాలెండ్ దేశంలో ముద్రించారు. అట్లా లండన్ నుండి విప్లవ సాహిత్యం, ఆయుధాలు మహారాష్ట్రకు చేరుతు ఉండేవి, మహారాష్ట్ర లో బాంబులు, పిస్తోలు మ్రోతల తో బ్రిటిష్ ప్రభుత్వము అప్రమత్తమైంది, ఈ సందర్భంలో వీర సావర్కర్ అన్న గారైన గణేష్ సావర్కర్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత దేశంలోని క్రూరుడైన ఆంగ్లేయ అధికారి కర్జన్ వాయిల్ ను 1909 జూలై 1వ తేదీన లండన్ లో మదన్ లాల్ దింగ్రా చంపేసి అక్కడే నిలబడ్డాడు దానితో పట్టుపడిన దింగ్రాను విచారణ చేసి 1909 ఆగస్టు 17న ఉరి శిక్ష విధించారు. ఆ సమయంలో నెహ్రూ లండన్ లో ఉన్నాడు ఉరి శిక్ష గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 1910వ సంవత్సరంలో మార్చి 13న ప్యారిస్ నుంచి లండన్ రైల్ లో దిగిన సావర్కర్ ను ప్లాటుఫారం మీదే బ్రిటిష్ వాళ్ళు నిర్బంధించారు. కర్జన్ వాయిల్ హత్యకు కుట్రదారుడు గాసావర్కర్ ను విచారించేందుకు భారతదేశం తీసుకు వస్తున్న సమయంలో 1910 జూలై 10వ తేదీ నాడు ఓడ నుండి తప్పించుకొని సముద్రంలో దూకి ఈదుతూ ఫ్రెంచ్ గడ్డమీద చేరాడు. అక్కడ ముందు యోజన ప్రకారం సురక్షిత ప్రాంతానికి తీసుకు వెళ్ళవలసినవారు సమయానికి రాని కారణాన బ్రిటిషు పోలీసులకు తిరిగి పట్టుబడి భారత్ కు తీసుకోని వచ్చారు. న్యాయ విచారణ 1910 అక్టోబర్ 23న పూర్తి చేసి సావర్కర్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అదే సమయంలోనాసిక్ కలెక్టర్ జాన్సన్ హత్య గావించ బడ్డాడు, దాని వెనుక కూడా సావర్కర్ కుట్రనే ఉన్నాదని విచారణ చేసి 1911 జనవరి 30న మరో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దానితో రెండు యావజ్జివ కారాగార శిక్షలు విధించబడ్డాయి, దానితో సావర్కర్ ను అండమాన్ నికోబార్ దీవుల లోని జైలు కు తరలించారు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూనే అనేక కవితలు రచించాడు. వ్రాయటానికి పెన్ను పేపరు లేని కారణంగా జైలు గోడల పైన మేకులతో 15 వేల పంక్తులు రాశారు. అక్కడే హిందువు అంటే ఎవరు అనే నిర్వచనం ఒక శ్లోకం లో వివరించాడు.
"ఆ సింధు సింధు పర్యన్త
యస్య భారత భూమికా పితృభూ:పుణ్యభూశ్చవ
సవై హిందు రితి స్మృతః"
అంటే సింధువు నుండి సింధువు వరకు వ్యాపించి ఉన్న ఈ దేశాన్ని పుణ్యభూమిగా, పితృ భూమిగా ఎవరు భావిస్తూ ఉంటారో వారే హిందువులు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ ప్రభుత్వంపై సావర్కార్ విడుదలకు 1921 మార్చి లో ఒక తీర్మానం చేసింది, ఆ ఒత్తిడి కారణంగా 1921లో సావర్కర్ ను అండమాన్ జైలు నుండి అలీపూర్ జైలుకు కొంతకాలం తరువాత రత్నగిరి జైలుకు తరలించారు. 1922లో రత్నగిరి జైల్లో ఉన్నప్పుడు ''హిందుత్వ'' అనే పుస్తకం రాసి పేరు లేకుండా నాగపూర్ లోని వి.వి కేల్కర్ గారికి పంపించారు, వారు దానిని ముద్రించారు తుదకు 1926 జనవరి 6వ తేదీ నాడు ఐదు సంవత్సరాల పాటు ఏ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్న రాదు అని షరతులతో, పరిమిత స్వేచ్ఛతో విడుదల చేశారు.1924 సంవత్సరంలో రత్నగిరి లో అంబేద్కర్ సావర్కర్ ను కలిశారు. అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్ కూడా సావర్కర్ ను కలిశారు. 1937 మే 10న సావర్కర్ పై అన్ని ఆంక్షలు తొలగించబడ్డాయి, సావర్కర్ అక్కడి నుండి తన నివాసాన్ని ముంబై కి మార్చుకున్నారు, అప్పటినుండి హిందుత్వ భావ చైతన్యానికి తెరలేపారు దానికి హిందూ మహాసభను తన రాజకీయ వేదికగా మలుచుకున్నారు. అట్లాగే స్వాభిమాన హిందూ సమాజం పరాక్రమ చరిత్రే వారు రచించిన ''చరిత్రలో ఆరు స్వర్ణపుటాలు'' అనే పుస్తకం.
సావర్కర్ గాంధీజీ: సావర్కారుకు 1906 సంవత్సరంలో లండన్లో మొట్టమొదటిసారి గాంధీజీ తో పరిచయం జరిగింది. 1909 సంవత్సరం యూకే లో జరిగిన విజయ దశమిఉత్సవం లో గాంధీజీ సావర్కర్ ఒకే వేదిక మీద ఉన్నారు, గాంధీజీ రాముని త్యాగ మూర్తి అని ప్రస్తుతిస్తే, సావర్కర్ దుష్టశక్తులను సంహరించిన దుర్గామాత ను వర్ణించారు. 1927 మార్చి 1న రత్నగిరిలో సావర్కార్ ను గాంధీజీ కలుసుకున్నారు, ఆరోగ్య పరామర్శ తర్వాత గాంధీజీ సావర్కర్ చేస్తున్న శుద్ధి కార్యక్రమాలు ఆపాలని నర్మగర్భంగా సావర్కర్ కు సూచించారు దానితో సావర్కర్ ''అంటరానితనం, శుద్ధి కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని'' గాంధీజీ ని అడిగారు, దానికి గాంధీజీ నాకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు నీవు రత్నగిరి లోనే ఉంటావు గదా నేను వీలు చూసుకుని రెండు మూడు రోజులు నీతో పాటు ఉండేట్లు వస్తాను అప్పుడు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామని చెప్పి గాంధీజీ దాటవేశారు. 1933 ఫిబ్రవరి 25న గాంధీజీ సావర్కార్ కు వ్రాసిన ఉత్తరంలో సామాజిక సమస్యల పరిష్కారానికి సావర్కార్ కృషిని ప్రశంసించారు. గాంధీజీ తన ఆత్మ కథలో వాల్యూమ్ 38-138 వ పేజీలో రాజకీయ ఖైదీల గురించి నేను మాట్లాడను అయినా సావర్కర్ భాయి జైలు నుండి విడుదలకు నా ప్రయత్నం నేను చేశాను అని వ్రాసుకున్నారు. 1120 సంవత్సర భారత్ పై గజినీ దాడి తర్వాత ఈ దేశానికి అంతగా నష్టం జరిగిన సంవత్సరం 1920వ సంవత్సరం అని సావర్కర్ వర్ణించారు ఎందుకంటే ఆ సంవత్సరమే గాంధీజీ ఒక ప్రక్క సహాయ నిరాకరణ ఉద్యమం, మరోపక్కఆత్మహత్య సదృశమైన ఖిలాఫత్ ఉద్యమంకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ప్లిట్ ఇండియా ఉద్యమంగా సావర్కర్ వ్యాఖ్యానించారు, ఈ ఉద్యమం దేశ సమైక్యతకు నిలిచే పక్షంలో హిందూ మహాసభ కూడా మద్దతు ఇస్తుందని అని ప్రకటించారు.
సావర్కర్ ను వెంటాడిన కాంగ్రెస్: గాంధీజీ హత్య సందర్భంలో సావర్కర్ ను అదుపులోకి తీసుకొన్నారు. గాంధీజీ హత్య కేసు ఢిల్లీలోని ఎర్రకోట లో విచారణ జరిగింది ఆ విచారణలో సావర్కర్ నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్పింది, తీర్పు వచ్చిన వెంటనే ఎర్ర కోట నుండి బయటకు వెళ్లరాదని సావర్కర్ పై కోర్ట్ ఆంక్షలు పెట్టింది, మరికొద్ది గంటల్లోనే సావర్కర్ మూడు నెలలపాటు ఢిల్లీలో అడుగు అడుగుపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది, దానితో సావర్కర్ ను ఢిల్లీ పోలీసులు ప్రత్యేక రైలులో 1949 ఫిబ్రవరి 12న రహస్యంగా ముంబయి లో వదిలిపెట్టరు. 1950వ సంవత్సరం ఏప్రిల్ 4న నెహ్రూ లియాకత్ అలీఖాన్ ల మధ్య జరిగిన ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం పాకిస్తాన్ ముస్లింలకు అనుకూలంగా హిందూ శరణార్ధులకు అవమానకరంగా ఉంది దానికి నిరసనగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ కేంద్ర మంత్రి మండలి పదవికి కి రాజీనామా చేశారు, ఆ సందర్భంగా నిరసన తెలియ చేసిన హిందూ మహాసభ నాయకులను కూడా అప్పటి ప్రభుత్వం నిర్బంధించింది. సావర్కార్ గూడా నిర్బంధించ బడ్డాడు, సావర్కార్ విడుదలకు వారి కొడుకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు, అప్పుడు హైకోర్ట్ సావర్కర్ ను ఒక సంవత్సరం పాటు రాజకీయ కార్యకలాపాలు పాల్గొన రాదని షరతుతో జూలై 13వ తేదీ నాడు విడుదల చేసింది. హైకోర్టు విధించిన షరతువ్కారణంగా సావర్కర్ హిందూ మహాసభకు రాజీనామా చేశారు, ఆ సమయంలో 1950 ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర ఉత్సవాలలో సావర్కర్ జాతీయ జెండా ఎగురవేయవచ్చు కానీ ఎటువంటి ఉపన్యాసం ఇవ్వకూడదని షరతు విధించారు.
వివిధ సందర్భాలు: 1915 మార్చ్ 9న అండమాన్ నుండి సావర్కర్ వ్రాసిన లేఖలు హిందువులు ఆధునిక యుద్ధ పరిజ్ఞానం లో సైనిక శిక్షణ పొంది సైనిక జాతిగా రూపొందాలని దానికి అడ్డు వచ్చే శాస్త్రాలు, శాస్త్రార్ధాలు ప్రక్కకు నెట్టి వేయాలనిపిలుపు నిచ్చారు. 1937 డిసెంబరు నాగపూర్ లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఏర్పడే ప్రమాదంగురించి మాట్లాడారు. 1939 అక్టోబర్ 27న ఆర్యసమాజ్ కార్యకర్త మాణిక్యరావు ను ముస్లింలు హత్య చేసారు దానికి నిరసనగా సావర్కర్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు, గాంధీజీ ఆర్య సమాజ్ వాళ్ళపై వత్తిడి తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నించరు కానీ అది ఆగలేదు ఆ సమయంలో 15 వేల మంది హిందువులు జైలుపాలయ్యారు 18 మంది మరణించారు దానితో నిజాం దిగివచ్చి హిందువులకు కూడా పౌర హక్కులు కల్పించారు. సుభాష్ చంద్రబోస్ 1941 జనవరిలో దేశం వదిలివెళ్లేందుకు కొన్ని నెలలు ముందుగా వీర సావర్కర్ ను కలుసుకుని రెండవ ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ పరిణామాలు, భారతదేశ స్వతంత్ర పోరాటం ఉదృతం చేయటానికి దేశం బయట విప్లవం నిర్మాణం చేయాలని అంశాలను చర్చించడం జరిగింది. ఏ బ్రిటిష్ ప్రభుత్వం కారణంగా సావర్కారు 29 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారో ఆ బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ లార్డ్ లిన్ లిల్గో 1939 సెప్టెంబర్ 1 సావర్కర్ తో రెండవ ప్రపంచ యుద్ధం పరిణామాలపై చర్చించారు. ఆ సమయంలో సావర్కర్'' దేశ సరిహద్దుల రాష్ట్రాలలోసిఖ్, గుర్ఖా ల సైన్యాన్ని ఉంచాలని సూచించారు, తూర్పు నుండే భారతదేశంపై దండయాత్ర జరగవచ్చునని'' చెప్పారు. 1944 అక్టోబర్ 7, 8 తేదీలలో ఢిల్లీలో అఖండ హిందుస్థాన్ సంస్థ నాయకుల సమావేశం జరిగింది దానిలో మాస్టర్ తారా సింగ్ మాట్లాడుతూ అఖండ హిందుస్తాన్ పొలిమేరలు రక్షించటానికి మీకు సహాయం చేయడానికి నేను రాలేదు కానీ అఖండ హిందుస్థాన్ రక్షించడానికి ప్రతినపూనిన సిక్కులకు మీ సహాయం కోసం నేను వచ్చాను అని చెప్పారు. స్వతంత్ర ఉద్యమానికి ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించడానికి పూనాలో 1952 మే 9న ఒక పెద్ద సభా కార్యక్రమం జరిగింది ఆ సభకు అధ్యక్షత స్థానంలో సుభాష్ చంద్రబోస్ పటం పెట్టబడింది వ్యవహారిక అధ్యక్షుడిగా సేనాపతి బాపట్ ఉన్నారు, ఆ సభలో వీర సావర్కర్ మరియు పూజ్యశ్రీ గురూజీ పాల్గొన్నారు. 1952 ఆగస్టు ఆరో తేదీ శ్యాం ప్రసాద్ ముఖర్జీ సావర్కార్ కలుసుకున్నారు, ఆ సందర్భంగా ముఖర్జీ బెంగాల్ లో హిందువులు ముస్లింలు సయోధ్యతో ఉన్నారని అన్నారు దానికి వీర సావర్కర్ కలకత్తాలో, తూర్పు పాకిస్తాన్లో హిందువులపై జరిగిన మారణకాండను మీరు విస్మరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ సిక్కులు హిందూ జాతిలో భాగమని గురు గోవింద్ సింగ్'' ఖల్సా పంథా సకల జగత్తు లో ప్రఖ్యాతి కావాలి, హిందూ ధర్మం చిరస్థాయిగా నిలవాలి మిధ్యా తత్వాలు నశించాలి అని'' చెప్పిన మాటలను సావర్కర్ గుర్తు చేశారు. సావర్కార్ అంటే త్యాగము, ఒక సిద్ధాంతం. వేరు వేరు రాజకీయ దృష్టికోణాలు ఉన్న గాంధీజీని సావర్కర్ ను వర్ణిస్తూ గాంధీజీ ని మహాత్ముడు అని, సావర్కర్ ను వీర సావర్కర్ అని ప్రస్తుతించారు.
ముగింపు: వీర సావర్కార్ 1966 ఫిబ్రవరి 26న యోగ మార్గంలో ఈ లోకాన్ని వదలిపెట్టరు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ హిందుత్వ జాతీయ వాదాన్ని , హిందూ సంస్థలను వ్యతిరేకిస్తూ సమాజంలో ఆసంస్థలపై దుష్ప్రచారం చేస్తుండేది, అందుకే స్వతంత్రభారతంలో కూడా సావర్కర్ కు అడుగడునా ఆంక్షలు, అవమానాలకు గురి అయ్యారు. హిందూ మహాసభ చరిత్రలో కలిసిపోయింది, రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కూడా వేటాడుతూ వెంటాడుతు వచ్చారు. దేశంలో దానికి ఇంకా ముగింపు రాలేదు. ఇంకో ప్రక్క ఇస్లాం క్రిస్టియన్ మతం మార్పిడులు ఏకపక్షంగా కొనసాగుతూనే ఉన్నాయి, దేశ రాజకీయాలపై, సామజిక వ్యవస్థపై ఇస్లాం వత్తిడులు చేస్తూనే ఉన్నది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న పరిస్థితులలో పూర్తి మార్పు రాలేదు. ఆ మార్పు కోసం వేగంగా అడుగులు వేయటమే సావర్కార్కు మనం సమర్పించే నిజమైన నివాళీ. -రాంపల్లి మల్లికార్జున్.
సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
or Directly Buy
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.
వెబ్సైట్ లో గల ఆర్టికల్స్ బాగా లోతుగా పరిశీలించి వ్రాసినట్టు గా ఉన్నాయి. రాంపల్లి రచన వీర్ సావర్కర్ inspiring గా ఉంది. చిరకాలం స్ఫూర్తి దాయకమైన వ్యాసాలు అందించాలని కోరుతున్నాను
ReplyDelete