Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

చరిత్ర ఎందుకు చదవాలి? - Why Do We Read Indian History? - MegaMinds

చరిత్ర ఎందుకు చదవాలి?: ఓ రకంగా ఇది అవసరమైన ప్రశ్న. ఎందుకంటే గతంలోంచే వర్తమానం, వర్తమానంలోంచే భవిష్యత్తు పుడతాయి గనుక. శాస్త్రజ్ఞ...

చరిత్ర ఎందుకు చదవాలి?: ఓ రకంగా ఇది అవసరమైన ప్రశ్న. ఎందుకంటే గతంలోంచే వర్తమానం, వర్తమానంలోంచే భవిష్యత్తు పుడతాయి గనుక. శాస్త్రజ్ఞానంలో అందుకున్న అగణిత శిఖరాగ్రాలను తెలుసుకున్నాకే ముందుకు సాగటం సాధ్యమవుతంది. మానవ జీవితం అలాగే పురోభివృద్ధి చెందుతోంది. ఈ దేశం, ఈ జాతి తన సుదూర ప్రయాణంలో అధిగమించిన అనేక ఘట్టాలను ప్రతి తరంవాళ్ళూ తెలుసుకుంటూ, అందులోంచి పాఠాలను నేర్చుకుంటూ, జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగిపోతూ ఉంటే అప్పుడే ఆ జాతికి పురోగమనం.

చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందుతాం. చరిత్రవల్లనే ఏ జాతైనా చైతన్యవంతమైనదా, కాదా అని తెలుస్తుంది. చరిత్రలో ఏదో చిన్న సంఘటన విన్నందువల్ల స్ఫూర్తి పొంది జాతి నిర్మాతలయ్యారు మన చారిత్రక పురుషులు. ఉదాహరణకు రామాయణ, మహాభారతాలు, వీరుల చరిత్రలు విన్నందువల్ల ఓ శివాజీ హిందూ జాతికి లభించాడు. వీర సావర్కర్ సన్నిధిలో ఎందరో త్యాగమూర్తులు..... ఇలా ఎన్నో ఉదాహరణలు.

ఇకనుంచి భారతీయ చరిత్ర పుటల్లోంచి సంఘటనలు తెల్సుకుందాం. ఒక్క సంఘటన ఒక్కొక్కరికి స్ఫూర్తి ఇవ్వవచ్చు. జీవిత విలువల్నే మార్చవచ్చు. తెరచాటున మరుగునపడ్డ అనేక వింత విషయాలు తెలియవచ్చు. సంఘటన చిన్నదైనా ఫలితం గొప్పదవుతుంది ఒక్కోసారి.

ఉదాహరణకు బెంగాల్ లో చాలా ఏళ్ళ క్రితం, బెంగాల్ విభజన తర్వాత రోజుల్లో జరిగిన సంఘటన. ఏదో చిన్న ఊరు. నిద్రిస్తూండే ఊరు. పెద్ద నాయకులు పుట్టలేదక్కడ. బెంగాల్ మొత్తం విభజనకు వ్యతిరేకంగా ఊగిపోతుంటే నిర్లిప్తంగా వుండగలిగిన ఊరది. యావద్భారతదేశం వందేమాతర నినాదంతో దద్దరిల్లిపోతోంటే నిశ్శబ్దంగా వుండగలిగిన గ్రామం అది. చైతన్య శూన్యం. అగమ్యగోచరం ప్రతి రోజూలాగే ఆరోజూ తెల్లవారింది. మామూలుగానే అందరు ప్రజలు తమ తమ పనుల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతలో ఓ సంఘటన జరిగింది!.

ఓ పదేళ్ళ పసివాడు, ఎర్రగా, బుర్రగా పాల బుగ్గలతో ముద్దొస్తున్నాడు. తెల్లటి లాల్చీ, పైజమా, నుదుటి మీద పడే నల్లటి ఉంగరాల జుట్టు, చేతిలో చిన్న కర్రకు గుచ్చిన త్రివర్ణ పతాకం నడివీధిలో నడుస్తున్నాడు. అడుగడుక్కు వందేమాతరం! అని అరుస్తున్నాడు. లేత ఎండలో తళుక్కున మెరుస్తూ కదులుతున్నాడు. అటూ ఇటూ వెళ్ళే జనం కొంచెం ఆగి ఆ బుడతడ్ని చూసి తమలో తామే నవ్వుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు నుంచి ఎదురొచ్చాడు ఓ ఆంగ్ల రక్షకభటుడు ఆరడుగుల ఆజానుబాహుడు. భుజంమీద తుపాకీ, నెత్తిన టోపీ బుడతడ్ని చూచాడు. పతాకం పరికించాడు. నినాదం విన్నాడు. ఏ భాష వాళ్ళు పలికినా ఒకే భావం వందేమాతరం నినాదం. ఆ పదం వింటే చిందులు తొక్కే ఆంగ్ల ఉద్యోగి విసవిసా వచ్చి బుడతడికి ఎదురు నిలిచాడు. హూంకరించాడు. వందేమాతరం అన్నాడు బుడతడు. ఆపు! అని గర్జించాడు ఆంగ్లేయ అధికారి, వందేమాతరం!
చిరుగాలికి ముఖాన జుట్టుతో బుడతడు. భుజం మీద తుపాకీ చేతుల్లోకి వందేమాతరం! అటూ ఇటూ వెళ్ళే జనం ఆగి వింత చూస్తున్నారు.

పతాకం పారేసి ఇంటికి పో. లేకుంటే కాల్చేస్తాను. తుపాకీ బుడతడి గుండెల కానింది.వందేమాతరం! మరింతమంది పోగై వింత చూస్తున్నారు. ఆంగ్ల అధికారి ముఖం మరింత ఎర్రనైంది. కుర్రాడిని తుపాకీ గొట్టంతో నెడుతూ, నినాదం ఆపమని గర్జించాడు. వందేమాతరం! వందేమాతరం!! వందేమాతరం!!! ఒకే జవాబు. ఎవ్వరూ ఊహించని విధంగా తుపాకి పేలింది. కుర్రాడు నేలకొరిగాడు. గుండెల్లోంచి రక్తం ధారలు కట్టి నేలలో ఇంకుతుంది. పతాకం పట్టుకున్న పిడికిలి మరింత బిగిసింది. పెదవులు కదులుతున్నాయి. వందేమాతరం కళ్ళు మూతలు పడ్డాయి. తల ఒరిగిపోయింది. దిగ్ర్భాంతులై నిలబడిపోయారు ఆ నిద్రించే ఊరి జనం. హు! అని ఆ కుర్రాడి శరీరాన్ని బూటు కాలితో తన్ని తుపాకిని భుజాని కెక్కించాడు. ఆ ఆరడుగుల ఆంగ్లేయ అధికారి.

అప్పుడు కళ్ళు తెరిచారు ఆ ఊరి జనం. అప్పుడు వచ్చింది ఆవేశం, జనంలో ఎవరో అన్నారు  వందేమాతరం అని గొంతు చించుకుని. నాలుగువైపుల నుంచీ జనం ముందుకు దూకారు. అనుకోని సంఘటనకు బిత్తరపోయి అరుస్తూ తుపాకిని భుజం దించటానికి ప్రయత్నించాడు ఆంగ్లేయ అధికారి. తుపాకి భుజం దిగలేదు. ఆ జన సమూహం మధ్య అతనేమయ్యాడో ఎవడిక్కావాలి?.

జనంలో ఎవరో కుర్రాడిని భుజం మీద ఎత్తుకున్నారు. వందేమాతరం! ఒక గొంతుకు వెయ్యి గొంతుకుల జవాబు. ఊరు ఊరంతా కదిలివచ్చింది. పెద్ద ఊరేగింపుతో బుడతడికి అంత్యక్రియలు జరిగాయి.

ఆ రోజు నుంచి స్వాతంత్ర్య సమరంలో ఆ ఊరి నుంచి ఎందరో యువకులు పాల్గొన్నారు. ఎవరో ఒక వ్యక్తి భారతమాత శృంఖలాచ్చేదనకు బలిపెట్టని ఇల్లు మిగల్లేదు. ఒకే సంఘటన, ఆ ఊరి చరిత్రను మార్చింది. ఆ ఊరి పేరు ఎవరిక్కావాలి? ఆ ఊరు కృష్ణనగర్ సమీపాన వున్న ఛాప్రా అట!. ఆ బుడతడి పేరు ఏదైతేనేం? జతిన్ అట! పనికిరాని ఊరునుంచి సింహాలు ముందుకురికాయి. అదే చరిత్ర అందుకే చరిత్ర పులకింప చేస్తుంది జాతిని! అందుకే చరిత్ర చదవాలి... చదివించాలి.

2 comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..