మనం మరచిన పరమ వీరులు - Telugu Books

1

ఈ దేశంలో బుద్ధిజీవులది వింతధోరణి. ఎప్పుడూ నకారాత్మక దృక్పథమే. ఒకే వంశస్థులైన బాబర్‌, అక్బర్‌, ఔరంగజేబు, షాజహాన్‌, జహంగీర్‌లకు అధ్యాయాలకు అధ్యాయాలు కేటాయించి చరిత్ర రాస్తారు. అదే విజయనగర సామ్రాజ్యాన్ని గురించో, కాకతీయుల పరాక్రమం గురించో అంటే మాత్రం కొన్ని పుటలకు పరిమితం చేస్తారు. రాణా, ఛత్రపతి, ప్రతాపరుద్రుడు, శ్రీకృష్ణదేవరాయల చరిత్రలను స్థానిక చరిత్రలుగా భ్రమింపచేస్తారు. అది మన చరిత్రకారులకు ముందునుండి ఉన్న పైత్యం. అలాగే ఈ దేశంలో వీరులను విలన్లుగా చూపిస్తారు లేదా అసలే చూపించరు. బుర్హాన్‌ ముజఫర్‌వానీకి ఇచ్చిన ప్రాధాన్యం ఈ దేశం కోసం తన ప్రాణాలను మట్టిలో కలిపిన మేజర్‌ సోమనాథ్‌ శర్మ గురించి చెప్పేందుకు వెనుకంజ వేస్తారు.
ఇలాంటి సంక్లిష్ట రాజకీయాలున్న మన దేశంలో ఓ గొప్ప ప్రయత్నంగా ‘మనం మరచిన పరమ వీరులు’ వంటి ఓ పుస్తకం రావడం ఆశావహుల చరిత్రను సమాజానికి అందించే ఆశావహ దృక్పథం గానే చెప్పొచ్చు. దీనిని కూర్చిన చింతా రాజశేఖర్‌ రావు, పుచ్చా గాయత్రీదేవి, పుచ్చా సుషికాంత్‌, యాకసిరి శ్వేతసాయి.. సవరణలో భాగం పంచుకొన్న రమేశ్‌, వి.వి.వి.లక్ష్మి గార్లను అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే కమర్షియల్‌ జీవితాలను కథలుగా మార్చి క్యాష్‌ చేసుకొంటున్న ఈ రోజుల్లో నిజమైన హీరోల జీవితాలను పుస్తక రూపంలో అందించడం ప్రశంసించదగ్గ విషయం. ఈ పుస్తకంలో 134 పుటలు ఉన్నాయి. 21 మంది పరమవీరచక్ర పురస్కార గ్రహీతల జీవితాలను సూక్ష్మంగా అందించారు. ఇక్కడ కూడా మతపరమైన సెంటిమెంట్స్‌ వస్తాయని ఇలాంటి పుస్తకాలు ప్రచురించాలంటే ప్రభుత్వ సంస్థలు వెనకడుగు వేస్తున్న తరుణంలో ఇందుకు పూనుకోవడం జాతీయవాదులకు బలం.
యుద్ధంలో మరణించినవారికి, సాహసాలు ప్రదర్శించిన వీరసైనికులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారం.. 2017 వరకు 14 మందికి మరణానంతరం ఈ గౌరవం లభించిగా, ఏడుగురికి జీవించి ఉండగా లభించింది. స్వాతంత్య్రం వచ్చాక బ్రిటిషు ప్రభుత్వం తమ సైన్యంలో అత్యున్నత శౌర్య పురస్కారానికి ఇచ్చే విక్టోరియా క్రాస్‌కి సరి సమానంగా భారత సైన్యంలో ఒక పతక రూపకల్పన జరగాలని రక్షణ అధికారులు సంకల్పించారు. ఈ బాధ్యత సిఖ్‌ రెజిమెంట్‌కు చెందిన విక్రమ్‌ ఖానోల్కర్‌ అనే అధికారికి అప్పగిస్తే ఆయన భార్య శ్రీమతి సావిత్రి సహాయంతో ‘పరమ వీరచక్ర పతక’ రూపకల్పన చేసారు. భారతీయ రుషుల్లో త్యాగానికి పత్రీకగా చెప్పే దధీచి మహర్షి చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా ఈ పతకం రూపొందించారు.
ప్రతిఒక్కరి జీవితంలో ‘ప్రాణత్యాగం’ అనేది గొప్ప ఘట్టం. అది చేయగలిగే అవకాశం ఒక సైనికుడికే ఉంటుంది. అదీ తన స్వార్థం కోసం కాకుండా దేశం కోసం! అలాంటి వాళ్లు చరిత్రలో రాజకీయ పొగడ్తలకు, సామాజిక ప్రశంసలకు పాత్రులు కాకున్నా దేశం కోసం చేసే ప్రతి పనిలోను ప్రతిబింబిస్తారు. ఈ వీరుల త్యాగాలను భావితరాలకు అందించే ఈ ప్రయత్నం మ¬న్నతం.
‘శత్రువు 50 గజాల దూరం వరకూ వచ్చేసాడు. మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము. వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా చివరి శ్వాస వరకు, చివరి బుల్లెట్‌ వరకూ పోరాడతాము’ (పు-4) అంటూ మేజర్‌ సోమనాథ్‌ శర్మ చెప్పిన మాటల ఉటంకింపు మన శరీరం గగుర్పొడిచేట్లు చేస్తుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో చేసిన వీరసైనికుల అసమాన త్యాగాలు గుదిగుచ్చిన ఈ పుస్తకాన్ని దేశభక్తులంతా చదివి తీరాల్సిందే.
మనం మరచిన పరమ వీరులు
రచన : మూరిశెట్టి గోవింద్‌
పుటలు : 134,
వెల : రూ.125/-
ప్రతులకు : కసం ఫౌండేషన్‌
సెల్‌ : 8106265900
సాహిత్యనికేతన్‌, హైదరాబాద్‌.
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, విజయవాడ.
సెల్‌ : 9440643348

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top