Type Here to Get Search Results !

కొమరం భీం జీవితం - komaram bheem biography in telugu

కొమరం భీం


భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతం నైజాం నవాబుల పాలనలో ఉండేది. రాజకీయ వ్యవహారాల్లోను, పరిపాలనా పద్దతిలోను కచ్చితమైన నిబంధనలుపాటించని ఆ నవాబుల కారణంగా గిరిజనుల జీవితాలు ఎన్నో కష్టనష్టాలకు గురువుతూ ఉండేవి.గోండులు అడవిలో కొన్ని చోట్ల చెట్లు సరికి భూమిని చదునుచేసుకుని పోడు వ్యవసాయం చేస్తూ పండిన కాడికి అదే భగవంతుడు ఇచ్చినదని భావిస్తూ సంతృప్తిపడే మనస్తత్వం వారిది.
ఆనాటి వ్యాపారులు, పట్వారీలు, గ్రామాధికారులు, తెల్లవారు గిరిజనులపై అనేక దౌర్జన్యాలు చేసేవారు.రక్తమోడ్చి పంటకు అనువుగా చేసుకున్న భూమిని పంటలతో సహా ఆ దళారులు ఆక్రమించుకునేవారు. ఒకోసారిగూడేలను ఏకమొత్తంగా తగుల బెట్టేవారు. వారి మానప్రాణాలను హరించేవారు. 1900 సంవత్సరంలో ఆసిఫాబాద్ సమీపంలో గల సుంకేపల్లిలో కొమరం భీం జన్మించారు. తండ్రి మరణానంతరం అతడి చిన్నాన్నలు కురు, ఇస్తులతో కలిసి కెరమెరి మండలంలోని సుర్గాపూర్ కు వలసపోయాడు.
అక్కడ కూడా కొంత అడవిని పోడు చేసుకుని వ్యవసాయం ప్రారంభించాడు. అయితే ఒక పట్టాదారు ఆ భూమి తనకు చెందినదని తగువు పెట్టుకున్నాడు. కొమరం భీం చిన్నాన్నలు ఎదురు తిరగ్గా ఆ పట్టాదారు పఠాన్లతో కొట్టించాడు. యువకుడిగా ఉన్న కొమరం భీం ఉడుకురక్తం ఆ దురంతాన్ని చూసి సహించలేకపోయింది. ఆ పక్కనే ఉన్న ఒక మొడ్డును చేతిలోకి తీసుకుని ఆ పట్టేదారైన సిద్ధిక్ తలపై గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు కుప్పకూలిన పట్టేదారు అక్కడికక్కడే కన్నుమూసాడు.
అతడిపై నేరం మోపి నైజాం పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా కొమరం భీం పోలీసులకి చిక్కకుండా తప్పించుకుని అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. అలా తప్పించుకుపోయాక చంద్రపూర్ మీదగా కొమరం భీం అస్సాంకు చేరి తేయాకు తోటలో కూలీగా పని చేశాడు. తన తెగ ప్రజలు వెనుకబడిపోయి బడుగు జీవితాలు గడపడానికి కారణం, చదువుకోకపోవడమే అన్న సత్యాన్ని గ్రహించిన కొమరం భీం ఎంతోకష్టపడి చదవడం, రాయడం నేర్చుకొన్నాడు. తన తెగను నైజాం ఉక్కు సంకెళ్లనుండి విముక్తి గావించాలని నిర్ణయించుకుని, తన స్వస్థలం చేరుకున్నాడు.
నైజాం పాలనలో తీవ్ర హింసను, అత్యాచారాలను చవిచూస్తున్న గిరిజనులకు భీం రాక ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వారంతా భీంకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. బాబేఠారి చుట్టుపక్కల అడవిని నరికి వందలాది ఎకరాల భూమిని పోడు చేసుకుని వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. ఆ కారణంగా ఆ భూమిని ఆశ్రయించి 12 గ్రామాలు వెలిశాయి. ఎంతగానో ఆలోచించిన మీదట తన ఆశయాలను సాధించుకోవాలంటే ఆయుధాలు చేతబట్టడం తప్ప మార్గాంతరం కనిపించలేదు. దాంతో తన చుట్టుపక్కల గిరిజనులందర్నీ సంఘటితం పరచి సాయుధపోరాటానికి సమాయత్తమయ్యాడు.అందరికీ సైనిక శిక్షణ ఇచ్చి గెరిల్లా పోరాటంలో తర్ఫీఫీదు ఇచ్చాడు.
నైజాం నవాబు అధికారులెవరైనాగానీ ఆ 12 గ్రామాల పొలిమేరల్లో అడుగు పెట్టడానికి భయపడే స్థితి వచ్చింది. దాడులు, ఎదురుదాడులు ఆ ప్రాంతంలో నిత్యకృత్యాలయ్యాయి. ఆసిఫాబాదు తహసిల్దారు కొందరు నైజాం సైనికులను వెంటబెట్టుకుని 1940 సంIIలో భీంను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాడు. అయినప్పటికీ భీం ఆచూకీని కనిపెట్టలేకపోయాడు. భీం అనుయాయి చేసిన మోసం వలన నైజాం సైనికులు భీంని చుట్టుముట్టారు.
గాఢనిద్రలో వున్న భీం ఆ అలజడికి మేల్కొని ఆయుధం చేతబట్టి పోరుకు తలబడ్డాడు. కొద్దిమంది అనుయాయుల అండతో పెద్ద నైజాం సైన్యంతో తలపడిన భీం అనుచరులు ఒక్కొక్కరూ నేలకొరిగారు. భీం శరీరంలో లెక్కలేనన్ని తూటాలు దూసుకుపోవడంతో అతడి శరీరం జల్లెడలా మారిపోయింది. నిస్సహాయులుగా నిస్తేజంతో సతమతమవుతున్న గోండుల హృదయాలలో బీజప్రాయంగానైనా సరే స్వతంత్రేచ్ఛను రగిల్చిన ఖ్యాతి భీముకుదక్కుతుంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.