Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

Father of revolutionary thought in India: Bipin Chandra Pal-బిపిన్ చంద్రపాల్ జీవిత చరిత్ర

‘ఇంకో ప్రభుత్వం ఏర్పడకుండానే ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించాలని ఈ గాంధీ భజనబృందం కోరుకుంటోంది. లేదా మహాత్ముడు ప్రవచిస్తున్న పురోహిత తత్వం ...

‘ఇంకో ప్రభుత్వం ఏర్పడకుండానే ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించాలని ఈ గాంధీ భజనబృందం కోరుకుంటోంది. లేదా మహాత్ముడు ప్రవచిస్తున్న పురోహిత తత్వం కలిగిన ఏకవ్యక్తి పాలన రావాలని అది ఆశిస్తోంది.’1919 తరువాత భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వం గాంధీ చేతికి వచ్చింది. ఆయనకు తొలినాళ్లలో పాతతరం నాయకత్వం నుంచి గొప్ప మద్దతు లభించిన దాఖలాలు కనిపించవు. పైగా తీవ్ర ప్రతిఘటన కూడా ఉండేది. గాంధీజీతో విభేదించినవారు సామాన్యులు కారు. వారికి చరిత్ర రచనలో తగిన స్థానం లభించకపోయినా, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడలేము. అన్నింటికంటే గాంధీజీ కంటే ముందు ఈ దేశంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని నడిపినవారు వారే కదా! అలా గాంధీయుగం తొలినాళ్లలో ఆయన ఉద్యమ పంథాను, ఎత్తుగడలను విమర్శించిన వారిలో బిపిన్‌చంద్ర పాల్‌ (నవంబర్‌ 7,1858–మే 20,1932) ప్రసిద్ధులు. పైన ఉదహరించిన మాటలు ఒక సందర్భంలో పాల్‌ అన్నవే. ‘గాంధీ ఆరాధన’ను ఎద్దేవా చేసినవారిలో ఆయన ఒకరు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం (1905)లో కీలక పాత్ర వహించిన ‘లాల్, పాల్, బాల్‌’ త్రయంలో ఒకరు బిపిన్‌చంద్ర ‘పాల్‌’.

‘మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త’ అని పాల్‌ను అరవిందులు కీర్తించారు. పాల్‌ నమ్మిన జాతీయవాదం భారత స్వాతంత్య్రోద్యమంలో ఒక గొప్ప చారిత్రక భూమికను నిర్వహించి, అంతే గొప్ప సందర్భాన్ని సృష్టించింది. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించే ఒక బలీయమైన శక్తిగా భారతీయ సమాజాన్ని ఆవిష్కరించడానికి జాతీయవాదమే ఆయనకు తోడ్పడింది. వీటిని విశ్వసించిన నాటి ఉద్యమం విజయం సాధించిన  మాట వాస్తవం. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజానీకానికి చేరువగా తీసుకు వెళ్లడానికి పాల్‌కు ఉపకరించిన ఆయుధం కూడా ఆ వాదమే. విదేశీ విద్య, అంటే ఆంగ్లం మనకి జ్ఞాపకశక్తిని ఇవ్వవచ్చు. కానీ, విద్య అనే వ్యవస్థ ఇవ్వవలసిన నైతిక ప్రమాణాలని అది ఇవ్వడం లేదు. సమాజం పట్ల పౌరులు చూపించవలసిన బాధ్యతని అది గుర్తు చేయడం లేదు. మనదైన సృజన అడుగంటి పోవడానికి కారణం కూడా విదేశీ విద్యే అని చాటినవారు పాల్‌. విదేశీ వస్తు బహిష్కరణలో ప్రధానంగా కనిపించేది మాంచెస్టర్‌ నుంచి వచ్చే వస్త్రాలు. వాటిని బహిష్కరిస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గుతాయని ఊహించినవారు పాల్‌. అసలు సహాయ నిరాకరణ వంటి సున్నితమైన నిరసన కార్యక్రమాలతో వలస పాలకులను దిగి వచ్చేటట్టు చేయగలమని అనుకోవడమే పెద్ద భ్రమ అని పాల్‌ నమ్మారు.   
పాల్‌ను ఆధునిక భారతదేశంలో ‘విప్లవ భావాలకు పితామహుడు’ అనే అంటారు. ఈ విప్లవ ఆలోచనల పితామహుని రాజకీయ, సాంఘిక జీవితం అస్సాం టీ తోటలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం దగ్గర మొదలైంది. 1880 ప్రాంతంలోనే ఆయన ప్రజాజీవితం అడుగులు వేయడం నేర్చుకుంది. భారత స్వాతంత్య్రోద్యమం తొలిదశలో కనిపించే సురేంద్రనాథ్‌ బెనర్జీ పాల్‌గారి రాజకీయ గురువు. మొదట పాల్‌ మీద కేశవచంద్ర సేన్‌ (బ్రహ్మ సమాజ్‌ నేత), శివనాథ్‌ శాస్త్రి, బీకే గోస్వామి వంటివారి ప్రభావం ఉండేది. పాల్‌ అఖండ వంగదేశంలోని పొయిల్‌ అనే చోట పుట్టారు (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి రామచంద్రపాల్, తల్లి నారాయణీదేవి. తండ్రి పర్షియన్‌ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. అయితే ఆ కుటుంబం జమీందారీ కుటుంబం. పాల్‌ను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చినప్పటికీ చదువు పూర్తి చేయలేదు.  తరువాత కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా, మరి కొంతకాలం కలకత్తా పబ్లిక్‌ లైబ్రరీ అధికారిగా కూడా పనిచేశారు. బిపిన్‌చంద్ర పాల్‌ స్వాతంత్య్రోద్యమానికి చేసిన సేవ అంచనాలకు మించినది. వందేమాతరం నినాదాన్ని దేశమంతా తిరిగి వినిపించారాయన.
ఈ దేశంలో గాంధీజీ కంటే ముందే నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన ఘనత బిపిన్‌పాల్‌కు కూడా దక్కుతుంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన భారత జాతికి సంకెళ్లు ఉన్నాయన్న సంగతినీ, ఈ పురాతన భూమి వలస పాలనలో మగ్గిపోతున్న కఠోర వాస్తవాన్నీ సాధారణ భారతీయుడికి అర్థమయ్యేటట్టు  తెలియచెప్పినవారు పాల్‌. ఇందుకు బెంగాల్‌ విభజన సందర్భాన్ని పాల్‌ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అరబిందొ ఘోష్, రవీంద్రనాథ్‌ టాగోర్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, చిత్తరంజన్‌దాస్, అనీబిసెంట్‌ వంటి మహనీయులతో కలసి నడిచారు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపించిన మరుసటి సంవత్సరమే పాల్‌ ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1886 నాటి  కలకత్తా సభలకీ, 1887 నాటి మద్రాస్‌ సభలకి కూడా ఆయన హాజరయ్యారు. భారతీయుల పట్ల ఎంతో వివక్షాపూరితంగా ఉన్న ఆయుధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన మద్రాస్‌ సభల వేదిక మీద నుంచి పిలుపునిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. కాంగ్రెస్‌ తొలినాటి నాయకత్వం మితవాదులదే. కానీ వారి ధోరణి, పంథా జాతీయవాదులకి సరిపడేది కాదు. విన్నపాలతో వలసపాలకులు లొంగి వస్తారని అనుకోవడం అమాయకత్వమేనని అప్పటికే గట్టిగా విశ్వసించిన వారు లేకపోలేదు. మితవాదుల విన్నపాలు వ్యర్థమనీ, జాతీయవాదుల ఆలోచనలే సరైనవనీ భావించేందుకు వీలు కల్పించినదే బెంగాల్‌ విభజన. దీనితో బ్రిటిష్‌ జాతి పట్ల ఉన్న భ్రమల నుంచి చాలామంది బయటపడ్డారు. స్వరాజ్, స్వదేశీ, జాతీయ విద్య వంటివి ప్రజలను కదిలించాయి. ఇవే కొత్త ఉద్యమానికి బీజాలు వేశాయి. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మేరునగధీరుని వలే కనిపించే విప్లవనేత పాల్‌. బిపి బాబు కలం ఎంతో పదునైనది. పత్రికా రచయితగా, గ్రంథకర్తగా ఆయన స్థానం అసాధారణమైనది. నేషనాలిటీ అండ్‌ ఎంపైర్, ఇండియన్‌ నేషనలిజం, స్వరాజ్‌ అండ్‌ ది ప్రజెంట్‌ సిట్యుయేషన్, ది సోల్‌ ఆఫ్‌ ఇండియా, ది బేసిస్‌ ఆఫ్‌ సోషల్‌ రిఫార్మ్, ది హిందూయిజం, ది న్యూ స్పిరిట్‌ ఆయన గ్రంథాలు. డెమోక్రాట్, ఇండిపెండెంట్‌ పత్రికలకు ఆయన సంపాదకుడు. పరిదర్శక్, న్యూ ఇండియా, వందేమాతరం, స్వరాజ్‌ పాల్‌ ప్రారంభించిన పత్రికలు. ట్రిబ్యూన్‌ (లాహోర్‌) పత్రికకు కొంతకాలం ఆయన సంపాదకుడు. బెంగాల్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ పత్రిక సంపాదక మండలి సభ్యుడు. ఇవి కాకుండా మోడరన్‌ రివ్యూ, అమృతబజార్‌ పత్రిక, ది స్టేట్స్‌మన్‌ పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తూ ఉండేవారు. 

వక్తగా బిపిన్‌ పాల్‌ అంటే వంద ప్రభంజనాలతో సమానం. ఆయన పలుకు విన్న ప్రాంతంలో  చైతన్యం తొణికిసలాడింది. జాతీయ భావాల తుపాను వీచింది. బెంగాల్‌ విభజనను రద్దు చేయాలని కోరే ఒక సందేశాన్ని పట్టుకుని పాల్‌ దక్షిణ భారతదేశం వచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, బందరు, మద్రాస్‌లలో సభలు జరిగాయి. ఇవి కూడా చరిత్రాత్మక ఘట్టాలుగానే మిగిలాయి. రాజమండ్రి గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సభలోనే చిలకమర్తి లక్ష్మీనరసింహం నోటి నుంచి ‘భరతఖండమ్ము చక్కని పాడియావు’ అన్న పద్యం వచ్చింది. ముట్నూరి కృష్ణారావుగారు పాల్‌ గారిని ఆ ప్రదేశాలన్నీ తిప్పారు. రాజమండ్రి సభలో పాల్‌గారిని ఆయనే జనానికి పరిచయం చేశారు. నాడు పాల్‌ విశాఖ నుంచి రాజమండ్రి చేరుకోగానే ఆయన గౌరవార్థం జరిగిన స్వాగతోత్సవం చిరస్మరణీయమైనది. పాల్‌ అక్కడ అయిదారు ఉపన్యాసాలు ఇచ్చారు. అవి రాజమండ్రి సామాజిక, రాజకీయ వాతావరణాన్నే మార్చేశాయి. తెలిసిన వారు ఎదురైతే ‘వందేమాతరం’ అని పలకరించుకోవడం మొదలైంది. అందరి గుండెల మీద వందేమాతరం బ్యాడ్జీలు వెలిశాయి. రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో ‘వందేమాతరం’ అని విద్యార్థులు నినదించినందుకు బహిష్కరణకు గురయ్యారు.  నాడు అక్కడే ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు వారిలో ఒకరు. హరిసర్వోత్తమరావు కూడా పాల్‌గారి వెంట తిరుగుతూ సభలలో పాల్గొన్నారు. ఇది ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు రుచించలేదు. ఆనాటి సభలో పాల్గొన్న, వందేమాతరమని తరగతి గదులలో నినదించిన 111 మందిని కళాశాల నుంచి బహిష్కరించారు.  కాకినాడలో కెంప్‌ అనే ఆంగ్ల వైద్యాధికారి ఎదుట కోపల్లె కృష్ణారావు అనే పాఠశాల విద్యార్థి  అదే నినాదం పలికినందుకు చావు దెబ్బలు తిన్నాడు. కెంప్‌ నిత్య వ్యాయామం చేసే పహిల్వాన్‌. కృష్ణారావు బాలుడు. కెంప్‌ అతడిని స్పృహ పోయేటట్టు కొట్టడమే కాదు, అదే స్థితిలో ఉండగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో పడేసి వెళ్లిపోయాడు. కృష్ణారావు చనిపోయాడని పట్టణంలో వదంతి వ్యాపించింది.  దీనికి ఆగ్రహించిన కాకినాడ వాసులు ఆంగ్లేయుల క్లబ్బును దగ్ధం చేశారు. కెంప్‌ రహస్యంగా పట్టణం విడిచి పారిపోయాడు. మద్రాస్‌ మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన పాల్‌ సభలకు అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో టంగుటూరి ప్రకాశం ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఈ దేశంలో ఉన్నత వర్గాలు చేవ చచ్చి ఉన్నాయని, ఇక ప్రజా బాహుళ్యమే ఉద్యమించాలని పాల్‌ పిలుపునిచ్చారు.  దేశమాతను దుర్గామాతగా దర్శించుకుంటున్న ఈ తరానిదే భవిష్యత్తు అంతానని పాల్‌ చేసిన ప్రసంగాలు సహజంగానే ప్రజలను ఆకట్టుకున్నాయి.  
1907లో తిలక్‌ అరెస్టు తరువాత జాతీయవాదుల మీద బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగించింది. ఏదో విధంగా పాల్‌ను కటకటాల పాల్జేయాన్నదే బ్రిటిష్‌ జాతి ఆశయం. అదే సమయంలో అరవిందుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వడానికి బిపిన్‌పాల్‌ నిరాకరించారు. దీనితో ఆయనకు ఆరు మాసాల జైలు శిక్ష పడింది. బెంగాల్‌ విభజన నేపథ్యంలో పాల్‌ వందేమాతరం పత్రిక నెలకొల్పారు. దీనికి అరవిందులు సంపాదకుడు.  జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత  బిపిన్‌బాబు ఇంగ్లండ్‌ వెళ్లారు. కొన్ని అంశాల మీద తులనాత్మక అధ్యయనం చేయడం ఆయన ఉద్దేశం. అక్కడ ఉన్న మూడేళ్ల కాలంలో ఇండియా హౌస్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇండియా హౌస్‌ అంటే విదేశీ గడ్డ మీద నుంచి భారత స్వాతంత్య్ర సమరానికి సహకరిస్తున్న భారతీయ యువకుల అడ్డా. వీరంతా హింసాత్మక పంథాను స్వాగతించినవారే. అక్కడ ఉండగానే పాల్‌ స్వరాజ్‌ పత్రికను ప్రారంభించారు. కానీ ఇండియాలో 1909 కర్సన్‌ వైలీ హత్య జరిగింది. మదన్‌లాల్‌ థింగ్రా ఈ సాహసం చేశారు. కానీ దీని ప్రభావం ఇంగ్లండ్‌ నుంచి వెలువడుతున్న స్వరాజ్‌ పత్రిక మీద తీవ్రంగా పనిచేసింది. పత్రిక మూత పడింది. పాల్‌ ఆర్థికంగా చితికిపోయారు. కొద్దికాలం మనశ్శాంతి కోల్పోయారు. భారతదేశానికి వచ్చిన తరువాత కూడా ఆయన గాంధీజీ నాయకత్వాన్ని సమర్థించలేకపోయారు. నిజానికి గాంధీ నాయకత్వం వహించే నాటికి పాతతరం నాయకులు తక్కువే ఉన్నారు. వారు కూడా గాంధీ ఆకర్షణలో పడిపోయారు. కానీ పాల్‌ మాత్రం చివరికంటా తనదైన పంథాలోనే నడిచారు. 
బిపిన్‌పాల్‌ ఉద్యమ జీవితంలో చివరి అంకం నిండా ఏకాంతమే కనిపిస్తుంది. ఖిలాఫత్‌ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించారు. అది ఆయన ఉద్యమ జీవితాన్నే తెరమరుగయ్యేటట్టు చేసింది. 1921లో పాల్‌ గాంధీ మీద చేసిన విమర్శ అసాధారణమైనది. ‘మీరు మ్యాజిక్‌ చే శారు. కానీ నేను మీకు లాజిక్‌ను అందివ్వాలని అనుకున్నాను. ప్రజాసమూహాలు సంభ్రమాశ్చర్యాలలో తలమునకలైతే తర్కం (లాజిక్‌) రుచించదు. మీరు మంత్రించారు. నేను రుషిని కాను. కాబట్టి మంత్రం ఇవ్వలేను. సత్యమేమిటో నాకు తెలిసినప్పుడు నేను అర్థసత్యాలను పలకలేను. ప్రజలకి విశ్వాసాలనే గంతలు కట్టి నడిపించాలని నేను ఏనాడూ ప్రయత్నించలేదు.’ బిపిన్‌బాబు రెండు వివాహాల గురించి కూడా చెప్పుకోవాలి. 1881లో ఆయనకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. కానీ ఆమె అనతికాలంలోనే మరణించారు. తరువాత 1891లో మరొకరిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు నృత్యకాళీదేవి, వితంతువు. రెండు విషయాలను స్పష్టం చేయడానికి పాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి సంస్కరణ కోసం. రెండు వయో పరిమితి బిల్లుకు (బాల్య వివాహాలను నిషేధించినది) తన పూర్తి మద్దతు ఉందని చెప్పడం. కానీ వితంతువును వివాహం చేసుకున్నందుకు పాల్‌ తన కుటుంబానికి దూరమయ్యారు. బిపిన్‌బాబు ఆలోచనలలోనివే కాదు, అడుగులలో కనిపించినవీ విప్లవ భావాలే.          

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
            

- ∙డా. గోపరాజు నారాయణరావు
సాక్షి నుండి సేకరణ

No comments