Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అమెరికాపై ఆహారభూతం దాడి - raka sudhakar

పెద్దన్నయ్య అమెరికాకి పెను భయం పట్టుకుంది. సరికొత్త శత్రువు దాడి చేస్తాడన్న భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. రాబోయే ప్రమాదపు భ...



పెద్దన్నయ్య అమెరికాకి పెను భయం పట్టుకుంది. సరికొత్త శత్రువు దాడి చేస్తాడన్న భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. రాబోయే ప్రమాదపు భయంతో అమెరికాకి కంటిమీద కునుకు లేదు. శత్రువుంటే ఆషామాషీ శత్రువు కాదు. ఓ వంద పాటన్‌ టాంకులు, ఓ వెయ్యి యుద్ధ విమానాలనో ఉపయోగిస్తే అయిపోయే యుద్ధం కాదిది. సుదీర్ఘ పోరాటం తప్పని సరి....సర్వశక్తులూ ఒడ్డటం తప్పని సరి....కేవలం సైనికులు పోరాడితే సరిపోదు. మొత్తం దేశానికి దేశమే యుద్ధం చేయాలి. అందుకే దేశాధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు...అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య మిషెల్‌ ఒబామాకీ ఆ శత్రువు భయం పట్టుకుంది. ముందెన్నడూ లేని విధంగా ఏకంగా అమెరికన్‌ మాజీ అధ్యక్షుడి భార్య కూడా యుద్ధంలోకి నడుం కట్టి దిగారు. ఇదే జాతీయ భద్రతకు పెను ముప్పు అని ఆమె స్వయంగా ప్రకటించారు కూడా.
మొత్తం మీద అమెరికా ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో ఉంది....ఎక్కడికక్కడ ప్రకటనలు...ఎక్కడికక్కడ నోటీసులు వెలువడుతున్నాయి. ఆరోగ్య శాఖ నుంచి విద్యా శాఖ కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. హాయిగా తింటూ, పడుకుంటూ ఉండే స్కూలు విద్యార్థులను సైతం పరుగులు తీయిస్తున్నారు. చెమటోడ్చమంటున్నారు. వ్యాయామం చేసి బలం పెంచుకోమంటున్నారు. వార్‌ కి రెడీ కమ్మంటున్నారు. 2018లో రెడీ కాలేకపోతే ఇక అంతే సంగతులు. ప్రళయం ముంచుకొచ్చేస్తోంది అంటూ అమెరికన్‌ ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ఇది కనీవినీ ఎరుగని వార్‌....చరిత్రలోనే ఏ దేశంలోనూ ఎప్పుడూ జరగని వార్‌.
ఇంతకీ ఆ పెను ప్రమాదం పేరేమిటి?
ఇంతకీ అమెరికా మాజీ అధ్యక్షుడి సతీమణిని సైతం వణికిపోయేలా చేస్తున్న ఆ పెను ప్రమాదం ఏమిటి? ఆ భూతం పేరు స్థూల కాయం. అవునండీ....స్థూలకాయమే. ఇప్పుడు అమెరికా దేశంలో నానాటికీ పెరుగుతున్న స్థూలకాయం గురించే వర్రీ అవుతోంది. నానాటికీ లావెక్కిపోతున్న అమెరికాను మళ్లీ సరైన సైజ్‌కి తేవడానికి భారీ యుద్ధమే చేస్తోంది.
అమెరికాలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు భారీ కాయులు...గత 30 ఏళ్లలో బాల స్థూల కాయులు 20 శాతం పెరిగారు. నాలుగేళ్ల వయసులోపు పిల్లల్లో 20 శాతం మంది స్థూలకాయులే. మోయలేని ఈ భారీ కాయాన్ని ఈడుస్తూ ఈడుస్తూ, కదలలేక, మెదలలేక, నడవలేక, పరుగెత్తలేక 30 ఏళ్లకే కిడ్నీలు మార్పిడి చేయాల్సిన పరిస్థితి వస్తోంది. పాలుకారే పసి ప్రాయంలోనే డయాబెటిస్‌ వస్తోంది. స్థూలకాయుల ఆరోగ్య సమస్యల కోసం ఏటా 150 బిలియన్‌ డాలర్ల మేరకు ఖర్చవుతోంది. స్కూళ్లలో, ఆఫీసుల్లో, సినిమా హాళ్ళలో స్థూలకాయులకు స్పెషల్‌ సీట్లు అరేంజ్‌ చేయాల్సి వస్తోంది. పిజ్జాలు, బర్గర్లు ఇబ్బడి ముబ్బడిగా మెక్కేయడం, ఆటపాటలు మాని టీవీలు, విడియో గేమ్స్‌ ముందు గంటలు గంటలు గడిపేయడం, కొవ్వు పదార్థాలను పొట్టల్లో కుక్కేసుకోవడం, కనీసం నడక కూడా అలవాటు లేకుండా అడ్డంగా శరీరం పెంచేయడం వల్ల పసిపిల్లలు భారీకాయులుగా మారిపోతున్నారు.
లెట్స్‌ మూవ్‌ అంటున్న మిషెల్‌
ఈ బాల భారీ కాయులే భవిష్యత్తులో పెద్దవారైతే అమెరికన్‌ సైన్యంలో చేరే వారే ఉండరు. సైన్యంలో రిక్రూట్‌మెంటే లేకపోతే ఎన్ని మిషిన్‌ గన్‌లు ఉన్నా ఏం ప్రయోజనం? అందుకే ఒబామా కూడా అమెరికన్‌ పిల్లల్లో ఒబేసిటీని తగ్గించేందుకు లెట్స్‌ మూవ్‌ అనే ఉద్యమం ప్రారంభించారు. ఊబకాయాన్ని అమె అమెరికా ముందున్న అతిపెద్ద భద్రతాపరమైన సమస్యగా వ్యాఖ్యానించారు కూడా. పిల్లల్లో వ్యాయామం పట్ల, ఆటల పట్ల ఆసక్తి పెంచడం, పిజ్జా బర్గర్ల లాంటి జంక్‌ ఫుడ్‌ను వదిలేసి ఆరోగ్యకరమైన ఆహారం తినేలా చేయడం, స్కూళ్లలో ఇచ్చే మెనూలో కొవ్వు పెంచే పదార్థాలు లేకుండా చూడటం , ఊబకాయంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం ...ఇవే లెట్స్‌ మూవ్‌ ఉద్యమం ప్రధాన లక్ష్యాలు.
ఉప్పు తినొద్దు. కొవ్వు పదార్ధాలు తినొద్దు. తీపి పదార్ధాలకు బై బై చెప్పండి. పళ్లు, ఆకుకూరలు బాగా తినండి. పుష్కలంగా నీరు తాగండి. మితాహారమే సమ్మతం. రోజుకు 1500 మిల్లీ గ్రాములకు మించి ఉప్పు తినకండి. ...తినే దానిలో సగం కాయగూరలు, పళ్లూ ఉండేలా చూసుకొండి. ఇవన్నీ చెబుతున్నది ఏ మంతెన సత్యనారాయణ రాజో, లేక ఏ బాబా రామ్‌దేవో కాదు. ఇవన్నీ అమెరికాలోని ప్రజలకు ఏం తినాలో చెప్పే సర్కారీ డైట్‌ గైడ్‌లైన్స్‌. ఇవన్నిటితో పాటూ కనీసం రోజుకు గంట సేపైనా వ్యాయామం చేయండి. చెమట కారేలా శ్రమించండి. ఇదీ అమెరికా ఇప్పుడు తన ప్రజలకు చెబుతోంది.
మిషెల్‌ ఒబామా లెట్స్‌ మూవ్‌ ఉద్యమాన్ని వేళాకోణం చేసే వారూ ఉన్నారు. అసలు ప్రపంచమంతా జంక్‌ ఫుడ్‌ సంస్కృతిని పంచిందే అమెరికన్లు. అణ్వాయుధాల అమెరికా ఇప్పుడు ఆకు కూరలే ఆయుధంగా ముందుకు సాగుతోందంటూ వెక్కిరించే వారూ ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆమె స్వయంగా పిల్లలతో కలిసి ఆడుతున్నారు. పరుగులు తీస్తున్నారు. వ్యాయామం చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.
నిజానికి ఊబకాయం ఒక్క అమెరికా ని మాత్రమే కాదు. మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ప్రపంచ జనాభాలో కనీసం 9.8 శాతం మంది ఊబకాయులే. 1980లో ప్రపంచంలో 5 శాతం మందే స్థూలకాయులుంటే, 2008 నాటికి అది 10 శాతానికి చేరింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఊబకాయం సమస్యను ఒక మహమ్మారిగా పేర్కొంది కూడా. చాలా దేశాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు ఊబకాయంపై యుద్ధం ప్రకటించాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏటా 100 బిలియన్‌ డాలర్ల డైట్‌ ఫుడ్స్‌ అమ్ముడవుతున్నాయి. స్థూలకాయులు బరువు తగ్గించుకునేందుకు ఏటా 79బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. భారీ కాయుల వల్ల అమెరికా, తదితర యూరోపియన్‌ దేశాల్లో విమానాల్లో అదనంగా ఇంధనం ఖర్చవుతోందట. భారీ కాయులు మామూలు వారి కన్నా 6 శాతం తక్కువ పని చేస్తారట. ఇప్పుడు చైనా అమెరికాల్లోనూ బాల స్థూలకాయులు పెరిగిపోతున్నారు.
మన దేశంలోనూ ఊబకాయం పెను సమస్యగా మారుతోంది. ప్రతి అయిదు మంది పురుషుల్లో ఒకరు స్థూలకాయులే. ఆరుగురు మహిళల్లో ఒకరు స్థూలకాయులే. నగరాల్లో ఈ సంఖ్య మరీ పెరిగిపోతోంది. మన బాలల్లోనూ ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోతోంది. భారతీయులు బరువు తగ్గితే 442000 లైఫ్‌ ఇయర్స్‌ అదనంగా పొందవచ్చునట. అంటే ఆ మేరకు ఉత్పాదక శక్తి పెరుగుతుందన్న మాట. స్థూల కాయం వల్ల ఏటా కోట్లాది మంది చనిపోతున్నారు. వీరంతా ఊబకాయం వల్ల వచ్చే వివిధ ఆరోగ్య సమస్యల వల్లే చనిపోతున్నారు.
ఊబకాయం పై అమెరికా మహిళ పోరాటం ఏ రకంగా చూసినా ప్రశంసనీయం. కానీ మన దేశంలో ఊబకాయంపై పోరాటంలో నిజంగానే సీరియస్‌ నెస్‌ ఉందా? మన నేతలు దీనిపై దృష్టి పెట్టారా? మానవ వనరుల ప్రాధాన్యాన్ని మన నేతలు గుర్తించారా? అమెరికా మేల్కొంది....కానీ మనం మేల్కొన్నామా? అన్నిటా అమెరికాను అనుకరించే మనం ఈ విషయంలోనూ అమెరికాను ఎందుకు అనుసరించకూడదు? తన దేశంలో పిజ్జా బర్గర్లపై పోరాటం చేస్తున్న అమెరికా మన దేశంలోకి అవే విషపు పంటకాల్ని కుమ్మరిస్తుంటే మనం ఎందుకు మౌనంగా ఉన్నాం....నిజానికి మనమూ లెట్స్‌ మూవ్‌ అనాల్సిన సమయం ఇంకా రాలేదా?

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments