Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పుతిన్ ప్రజాస్వామ్యం వైపరీత్యం.

రష్యా అధ్యక్షుడుగా నాలుగవసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికకావడం ‘విచిత్ర ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం అవుతుండడానికి మరో నిదర్శనం. పద్దెనిమిది...


రష్యా అధ్యక్షుడుగా నాలుగవసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికకావడం ‘విచిత్ర ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం అవుతుండడానికి మరో నిదర్శనం. పద్దెనిమిది ఏళ్లుగా రష్యాలో తిరుగులేని ‘ప్రజాస్వామ్య అధినేతగా చెలామణి అవుతున్న పుతిన్ మరో ఆరేళ్లపాటు రష్యా ప్రజలపై పెత్తనం వహించడానికి ఈ ఎన్నికల విజయం వల్ల వీలు కలిగింది. క్రీస్తుశకం 1915నుంచి 1991 వరకు రష్యా దేశం ‘‘సోవియట్ సామ్యవాద గణతంత్ర రాజ్యాల సమాఖ్య’’- యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్- యుఎస్‌ఎస్‌ఆర్-లో భాగం. ‘యుఎస్‌ఎస్‌ఆర్’ను ‘సోవియట్ రష్యా’ అని పిలిచేవారు. ‘యుఎస్‌ఎస్‌ఆర్’లోని నాలుగింట మూడువంతుల భూభాగం యాబయి ఐదు శాతం జనం రష్యాలోనే ఉండడం ఇందుకు కారణం. సోవియట్ రష్యా భూమి విస్తీర్ణంగా ప్రపంచంలో అతి పెద్దది. 1991లో సామ్యవాద - కమ్యూనిస్టు- ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ అంతరించిన వెంటనే ‘యుఎస్‌ఎస్‌ఆర్’ పదహైదు స్వతంత్ర దేశాలుగా విడిపోయింది. ఇలా విడిపోయిన తరువాత కూడ ప్రజాస్వామ్య రష్యా భూవైశాల్యం ప్రాతిపదికగా ప్రపంచంలోని అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. 1917వరకు ఈ పదిహేను స్వతంత్ర దేశాలు విడివిడిగా ఉండేవి. 1917వ సంవత్సరానికి పూర్వం అనేక ఏళ్లపాటు జరిగిన ప్రజా ఉద్యమం ఫలితంగా రష్యాలో రాజరిక నియంతృత్వ వ్యవస్థ అంతరించి ప్రజాస్వామ్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. అయితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆదిలోనే ‘కమ్యూనిస్ట్’లు దిగమింగారు.‘మెన్షవిక్’ రాజకీయ పక్షాన్ని హింస ద్వారా తుదముట్టించిన ‘లెనిన్’ నాయకత్వంలోని ‘బోల్షవిక్కు’ పార్టీవారు ఏకపక్ష నియంత్రత్వ వ్యవస్థను ఏర్పాటుచేసారు. ఇలా ‘కమ్యూనిస్ట్’ నియంతృత్వ వ్యవస్థగా ఏర్పడిన రష్యా చుట్టుపక్కల పదునాలుగు దేశాలను వివిధ పద్ధతుల ద్వారా విలీనం చేసుకొని ‘సామ్యవాద సోవియట్ గణ రాజ్య సమాఖ్య’- యుఎస్‌ఎస్‌ఆర్-గా ఏర్పడడం చరిత్ర. 1991లో ప్రజాస్వామ్య విప్లవం ద్వారా ‘యుఎస్‌ఎస్‌ఆర్’ ప్రజలు ఏకపక్ష కమ్యూనిస్ట్ నియంతృత్వ వ్యవస్థను నిర్మూలించారు. బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టారు! సోవియట్ రష్యా నాటి పదిహేను దేశాల ఉమ్మడి ‘అంతర్జాతీయ వారసత్వం’ రష్యాకు లభించింది. సోవియట్ రష్యాకు చెందిన అణ్వస్త్రాలు, ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం, అంతర్జాతీయ వాణిజ్యం వారసత్వం అవశేష రష్యాకు లభించాయి. ఇదంతా సహజ పరిణామ క్రమం. కానీ ఒకే వ్యక్తి దశాబ్దులపాటు అధికారాన్ని చెలాయించే ‘నియంతృత్వ సోవియట్ రష్యా’ నాటి రాజకీయ వారసత్వాన్ని ప్రజాస్వామ్య ‘అవశేష రష్యా’లో పునరుద్ధరించిన ఘనత వ్లాడిమిర్ పుతిన్‌కు దక్కింది. నాలుగవసారి ఆయన అధ్యక్షుడుగా ఎన్నిక కావడం సరికొత్త పుష్టీకరణ.
సామ్యవాద నియంతృత్వ రష్యాకు తొలి అధిపతి అయిన వ్లాడిమిర్ లెనిన్ ఏడేళ్లు మాత్రమే పాలించి 1924లో మరణించాడు. ఆయన తరువాత పాలించిన జోసెఫ్ స్టాలిన్ 1953వరకు ఇరవై తొమ్మిదేళ్లు ఏకబిగిన ఆధిపత్యం వహించాడు. ఇలా ఆ జీవన అధికార నిర్వహణ నియంతృత్వం నిరంకుశ వ్యవస్థలలో సహజం. కానీ అదే సంప్రదాయాన్ని ప్రజాస్వామ్య రష్యాలో నిలబెట్టడానికి వ్లాడిమిర్ పుతిన్ నడుమును బిగించి ఉండడం సోమవారంనాడు ధ్రువపడిన దృశ్యం. ఈ ఎన్నిక ద్వారా 2024 వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడుగా కొనసాగడానికి వీలుంది. అప్పటికి ఆయన అధికారానికి పాతికేళ్లు నిండుతాయి. ఆ తరువాత వరకు ఎన్నికయి మరో ఆరేళ్లు పాలించే అవకాశం లేకపోలేదు. అందువల్ల పుతిన్ గతంలో స్టాలిన్ నిలబెట్టిన సుదీర్ఘ పాలన చరిత్రను దీర్ఘతరం చేయగల అవకాశం లేకపోలేదు. 1991లో సోవియట్ రష్యా అధ్యక్షుడుగా ఉండిన మిహాయిల్ గోర్బచేవ్ రష్యా గణతంత్ర రాజ్యానికి అధ్యక్షుడుగా ఉండిన బోరిస్ యెల్టిసిన్ సంయుక్తంగా చేసిన కృషివల్ల ‘కమ్యూనిస్ట్’ నియంతృత్వం అంతరించింది, గోర్బచేవ్‌ను నిర్బంధించి నియంతృత్వ వ్యవస్థను కొనసాగించడానికై కమ్యూనిస్ట్‌పార్టీలోని ఎనిమిదిమంది- దుష్ట అష్టకం- నాయకులు చేసిన కుట్ర బెడిసి కొట్టింది. సోవియట్ రష్యాలో ప్రజాస్వామ్యం అంకురించింది. అవశేష రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్టిసిన్ రెండుసార్లు పదవిని నిర్వహించాడు. మూడవసారి అధ్యక్ష పదవికి ఎన్నిక కారాదన్న ఆదర్శాన్ని పాటించి వైదొలగాడు.
రష్యా గూఢచారి విభాగంలో ఉన్నత అధికారిగా ఉండిన వ్లాడిమిర్ పుతిన్‌ను 1999లో బోరిస్ యెల్టిసిన్ తన ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా నియమించాడు, యెల్టిసిన్ మద్దతుతోనే పుతిన్ అధ్యక్షుడుగా కూడ ఎన్నిక కాగలిగాడు. నాలుగేళ్ల అధ్యక్ష పదవిని రెండుసార్లు నిర్వహించిన తరువాత 2008లో మూడవసారి పోటీచేయలేదు. అందరూ ఆయనను ప్రశంసించారు. ఎనిమిది ఏళ్లలో రష్యాకు అంతర్జాతీయ సమాజంలో గొప్ప ప్రతిష్ఠను పలుకుబడిని సాధించి పెట్టిన అధినేతగా, 1991నాటికి దివాలాతీసి ఉండిన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరిపుష్టం చేసిన పాలకునిగా పుతిన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందువల్ల ఆయన మూడవసారి కూడ అధ్యక్ష పదవికి పోటీచేయాలని, ఇందుకు వీలుగా రష్యా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన ‘అభిమానులు’ ఆర్భాటం చేశారు. కానీ పుతిన్ ఈ ‘‘ఒత్తిడికి లొంగలేదు...’’ తన మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రిగా ఉండిన దిమిత్రీ మెద్విదేవ్‌ను ఎన్నికలలో నిలబెట్టి అధ్యక్షుడుగా ఎన్నిక చేయించ గలిగాడు. అంతవరకు బాగుంది. కానీ మెద్విదేవ్ మంత్రివర్గంలో, మాజీ అధ్యక్షుడైన పుతిన్, ప్రధానమంత్రిగా చేరడం విచిత్ర ప్రజాస్వామ్య సంప్రదాయానికి శ్రీకారం. ఫలితంగా 2008 మే నుంచి 2012 మార్చివరకూ దిమిత్రీ మెద్విదేవ్ ‘నామకార్థం’ అధ్యక్షుడుగా కొనసాగాడు. ప్రధానమంత్రిగా ఉండిన పుతిన్ ‘‘దిగి’’ పాలనాధిపత్య రథానికి ‘‘చక్రమేశాడు’’. మెద్విదేవ్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు, రాజకీయ అధినాయకుడైన పుతిన్ పోటీ చేయనివ్వలేదు. మెద్విదేవ్‌ను తప్పించి పుతిన్ 2012లో మూడవసారి తాను పోటీ చేయడంతో ఆయన అధికారకాంక్ష మరింత ప్రస్ఫుటించింది.
పుతిన్ రాజ్యాంగాన్ని సవరించాడు. ఫలితంగా 2012లో మూడవసారి ఎన్నికైన పుతిన్ 2018 వరకు ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగాడు. 2012వరకు అధ్యక్షుడుగా ఉండిన మెద్విదేవ్‌ను ప్రధానిగా నియమించడం 2008లో మొదలైన విచిత్ర సంప్రదాయానికి కొనసాగింపు. ఇప్పుడు మళ్లీ మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్షుడుగా కొనసాగనున్నాడు. క్రిమియాను ఉక్రెయిన్ నుంచి విడగొట్టి తమ దేశంలో కలుపుకున్న తరువాత పుతిన్ అంతర్గత ప్రాబల్యం అంతర్జాతీయ ప్రాధాన్యం మరింత పెరిగాయి. ఐరోపాతోను అమెరికాతోను పుతిన్ పాలిత రష్యా తలపడుతుండడం పడమటి ప్రపంచాన్ని మళ్లీ సంఘర్షణల మయం చేస్తోంది. బ్రిటన్‌కూ రష్యాకుమధ్య ప్రస్తుతం నడుస్తున్న దౌత్యయుద్ధం ఈ ‘సంఘర్షణ’లను తీవ్రతరం చేసింది. మన దేశానికి అత్యంత మిత్ర దేశమైన రష్యా, పాకిస్తాన్‌కు చైనాకు సన్నిహితం కావడం మన పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం వ్లాదిమిర్ పుతిన్ విధాన వైపరీత్యం.

No comments