తత్త్వ బోధకుడు తొలి దళిత మహాయోగి దున్నఇద్దాసు - సామల కిరణ్ - About Dunna iddasu in telugu - social reformer

megaminds
0
dunna-iddasu


తత్త్వ బోధకుడు-తొలి దళిత మహాయోగి దున్నఇద్దాసు
సాహిత్యాన్ని,సంస్కృతిని, సామాజిక సమైక్యత ని సుసంపన్నం చేసిన మహనీయలు ఎందరో ధృవతారలై ప్రకాశించారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు దున్న ఇద్దాసు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారి వంటి పరిశోధకులు ఇద్దాసును ‘మాదిగ మహాయోగి’గా కీర్తించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి చరిత్రకారులు, సాహిత్య చరిత్ర రచయితలు ఇద్దాసును ‘తొలి దళిత కవి’గా గుర్తించారు. అచల యోగిగా, సంకీర్తనాకారుడిగా, తత్త్వకవిగా, ప్రసిద్ధుడైన దున్న ఇద్దాసు అట్టడుగు కులాల్లో చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడు.

నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో క్రీ.శ. 1811 ప్రాంతంలో దున్న ఇద్దాసు జన్మించాడు. ఎల్లమ్మ, రామయ్య వీరి తల్లిదండ్రులు. పశువుల కాపరిగా, జీతగాడిగా ఇద్దాసు పనిచేశాడు. మోటకొడుతూ, ఆశువుగా తత్త్వాలు పాడేవాడు. సాధువుల సాంగత్యంతో పూర్తిగా భక్తిమార్గంలోకి వచ్చాడు. లింగధారణ చేశాడు. పంచాక్షరీ మంత్ర ఉపదేశం పొందాడు. రాజయోగ సాధన చేశాడు. కొంతకాలం ఏకాంతంగా యోగసాధన చేశాడు. పూర్ణ యోగిగా మారినాడు. కాలక్రమంలో అనేక మహిమలను చూపినాడు. ఊరూరు తిరుగుతూ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ ప్రజల్లోకి ఉద్యమ తరహాలో భక్తిని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దాసుకు వందలాది శిష్యులు తయారయ్యారు. వందలాది గ్రామాలు తిరుగుతూ ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట సమీపంలో ఉన్న అయ్యవారిపల్లె గ్రామానికి చేరుకొని, అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అనేక తత్త్వాలను, కీర్తనలను, మేలుకొలుపులను ఆశువుగా చెప్పాడు.

ఆధిపత్యంపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు
భగవంతుని ముందు అన్ని కులాల వారు సమానమేనని ఇద్దాసు ప్రభోదించాడు. అగ్రవర్ణ ఆధిపత్య భావనను ఇద్దాసు తన కీర్తనలలో ప్రశ్నించాడు. అత్మన్యూనతనుండి బయటపడమని అట్టడుగు కులాలకు సందేశమిచ్చాడు. ఇద్దాసు మహిమలను అపహాస్యం చేసిన వారినుద్దేశించి చెప్పిన కీర్తన చాలా ప్రముఖమైనది.
‘మీరయ్యవారా? / బ్రహ్మముగన్న వారయ్యగారూ
మీరయ్యవారైతే / మిగుల చెన్నం పురి
కంటిగురుని సేవ కనబరిచి తిరుగక
||మీరయ్య||
బాహ్యశుద్ధి కన్న అంతఃశ్శుద్ధి ముఖ్యమన్నది ఈ కీర్తన సారాంశం. కులం కన్న గుణం ముఖ్యమనే సందేశాన్నిచ్చిన ఎన్నో కీర్తనలను ఇద్దాసు రాశాడు. జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య ఉండే తేడాను స్పష్టంగా చెప్పి ప్రజలను జ్ఞానమార్గంవైపు నడిపిన దున్న ఇద్దాసు సామాన్య జనుల భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు తత్త్వాలను చెప్పాడు. అందుకే అవి ఇప్పటికీ ప్రజల నాల్కలపైన మెదులుతున్నవి.
పల్లవి :
జ్ఞానికెరుకా, సుజ్ఞానుల మరుగు – జ్ఞానికెరుకా
అజ్ఞానికేమెరుక హరుడుండె మరుగు
చరణం :
మొలకతామర పువ్వు మొగిలి తుమ్మెదకెరుకా
కసువునీళ్లలో యున్న కప్పకేమెరుక

వర్షకాలము ఋతువు వనము కోకిల కెరుక
కంపగూటిలో నుండే కాకికేమెరుక

నాగస్వరము సొంపు నాగన్నకు ఎరుక
తువ్వగడ్డిలనున్న తుట్టెకేమెరుక

నానారుచులు తిన్న నాలుకకే ఎరుక
వంటశాలల దిరిగే గంటేకే మెరుక

గునగుననడిచేటి గున్నయేనుగు కెరుక
దుక్కుళ్లు దున్నేటి దున్నకేమెరుక

తెరువు నడిచెడి తేజిగానికె ఎరుక
గరుక భక్షించెడి గాడ్దికేమెరుక
భగవతత్త్వాన్ని గుర్తించడం జ్ఞానులకే సాధ్యమని చెప్పిన ఈ తత్త్వంలో జ్ఞానులకు, అజ్ఞానులకు ఉపమానాలుగా అందరికీ తెలిసిన ఉదాహరణల నిచ్చాడు. అజ్ఞానులను బావిలోని కప్పలుగా, కంపగూటిలో ఉండే కాకులుగా, గడ్డిలో తిరిగే తుట్టె పురుగులుగా, వంటింట్లోని గంటెగా, దుక్కులు దున్నే దున్నపోతుగా, గాడిదిగా పోల్చాడు. జ్ఞానులుగా మారి భగవంతుడిని చేరుకున్నప్పుడే జీవితం సార్ధకమవుతుందనే సందేశం ఇందులో మనకు కనబడుతుంది.
‘‘ఆరుపూవుల తోటోయమ్మ! ఈ తోటలోపల
పదహారులొట్టి పిట్టలు గలవే సుమ్మా
కరణాలు నలుగురు కాపులారుగురు
ఘనముగ తోటకు కావలి యిద్దరు”
వంటి మార్మికత ఉన్న తత్త్వాలను కూడా ఇద్దాసు రాశాడు. ఇది పూర్తిగా అచల ప్రభావం. అచల గురువు శివరామ దీక్షితులు, వీరబ్రహ్మం, ఈశ్వరమ్మల ప్రభావం ఇద్దాసుపై స్పష్టంగా కనబడుతుంది. ఇద్దాసుది రాజయోగమార్గం. సంసారాన్ని చేస్తూనే యోగసాధన కూడా కొనసాగించి దానిలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆయన ప్రభోదించాడు. అందుకే ‘దాటరా మాయను దాటరా ఈ కర్మబంధం / దాటరా మాయను దాటరా’ అనే తత్త్వంలో

‘ఇల్లు సంసారమ్ము ఆలు
పిల్లలన్నదే రాజయోగము
అహము జంపి గూటిలోపల
దీపము ఉన్నంతలోనే…’ అని రాశాడు.
‘మరచితివే మనసా! అలనాటి మాట’ అనే తత్త్వంలో దేవుడిని, గురువును ఎన్నటికీ మరువకూడదనే హితబోధ ఉంది. ఈ భౌతిక జీవితమంతా వారి దయనే తప్ప వేరొకటి కాదని ఆయన భావన.

”ఆలుపిల్లల జూచి / హరుని మరచితివే
హరుడు లేనిది ఆలు పిల్లలెక్కడివారే
గుమ్ములు గాదెలు జూచి
గురుని మరచితివా
గురువులేనిది గుమ్ముగాదెలెక్కడివే ”
ధాత నామ సంవత్సరంలో వచ్చిన ‘కరువు’ను గూర్చి చెప్పిన కీర్తనలో ఆనాటి దుర్భరమైన స్థితిని కళ్ళకు కట్టినట్లు ఇద్దాసు వర్ణించాడు. దీని వల్ల పంటలు ఎండిపోయినవనీ, పశువులకు తాగడానికి నీళ్లు కూడా దొరకలేదని, అప్పులు పుట్టలేదని, భార్యాభర్తల మధ్య అనురాగం దూరమైందని, అడవికి పోయిన పశువులు పెద్దపులులకు ఆహారమైనవని, నిత్యం ఉపవాసాలే దిక్కయ్యాయని తెలుస్తున్నది. ఇద్దాసు తన తత్త్వాలలో తుంగతుర్తి సోమలింగేశ్వరస్వామి, పూదోట బసవయ్య, పోతులూరి వీరబ్రహ్మం, పెనుగొండ బసవయ్య, ఈశ్వరమ్మ, అచలమత స్థాపకులు శివరామదీక్షితులు, కాల్వకోటప్ప మొదలైనవారిని స్మరించాడు.

లౌకిక వ్యవహార జీవితాన్ని ఆరాధించడం, సంసారంలోనే నివృత్తిని దర్శించడం, జీవనపరంగా స్త్రీ పురుష బేధాలను పాటించకపోవడం, కుల, మత బేధాలను పాటించకపోవడం మొదలైన తత్త్వకవుల లక్షణాలు దున్న ఇద్దాసులో పుష్కలంగా కనబడుతాయి. జ్ఞానం, ఎఱుక కలిగిన తత్త్వకవి ఇద్దాసు. దాదాపు 108 సంవత్సరాలు జీవించి 1919లో భగవదైక్యం చెందిన ఇద్దాసు దళితుడిగా పుట్టి దార్శనికుడిగా ఎదిగిన అవధూత. అగ్రకులాల వారికి నైతేం బోధచేసిన ఉత్తమ గురువు. ‘ఎఱుక’తో మసిలిన జ్ఞాని. తన మాటలతో, పాటలతో సమాజంలో చైతన్యం తెచ్చిన సంస్కరణ వేత్త, మానవతావాది. తెలంగాణ పదసంకీర్తన సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నవి. అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడుతున్నవి. దున్న ఇద్దాసు తత్త్వాలపై పరిశోధనలు జరగాలి. అవి మరింత ప్రాచుర్యం పొందాలి. చరిత్రలో తొలి దళిత కవిగా ఇద్దాసు శాశ్వత స్థానం పొందాలి.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top