అర్దచక్రాసన్ (Ardhachakrasana) : అర్ధ-సగ, చక్ర-చక్రం. చివరి స్థితిలో "సగం చక్రం’ లాగా ఉంటుందీ ఆసనం.
స్థితి: చక్కగా నిలబడి, కాళ్ల మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలి పిల్చి భుజాలు కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.
ఒకటి: శ్వాస బయటికి తీస్తూ అరచేతులను నడుముపై ఉంచండి.
రెండు: శ్వాసలోనికి తీస్తూ... నడుము పైభాగాన్ని వెనక్కి వంచండి. మెడ కండరాలు సాగతీస్తూ... మెడను కూడా వెనక్కి వంచండి. ఇలా చివరిస్థితికి చేరిన తరువాత సాధారణంగా శ్వాసించండి.
మూడు: నడుముపై చేతులు ఉంచి, శ్వాస తీస్తూ... నిటారుగా రండి.
నాలుగు: శ్వాస బయటికి విడుస్తూ... చేతులు నడుముపై నుంచీ తీసివేయాలి.
లాభాలు: భుజం కండరాలు, వెన్నెముక కండరాలు గట్టి పడతాయి. రొమ్ముకు, మెదడులో రక్తప్రసరణం పెరుగుతుంది. వెన్ను గట్టిపడుతుంది. శ్వాసకోశాల పనితనంకూడా వృద్ధి చెందుతుంది. తుంటినొప్పి, ఆస్మాను నివారించగలదు. తొడ కండరాలకు విశ్రాంతినిస్తుంది. స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.
సూచన: ఉద్రేకాలు, గుండె జబ్బులు కలవాళ్లు చాలా నెమ్మదిగా చేయాలి. సన్నగా, పొడుగ్గా ఉన్నవాళ్లు కాళ్లు ఎడంగా ఉంచి పడిపోకుండా నిలబడి ఈ ఆసనం వేయాలి.
ముఖ్యాంశాలు: కాళ్లు చక్కగా, నిటారుగా ఉంచి, పాదాలవేళ్లు కలిపి ఉంచి ముందుకు సాగి ఉండాలి.
శ్వాస: వెనక వంగినప్పుడు పైకి లేచేటప్పుడు శ్వాస తీయాలి. చివరిస్థితిలో సాధారణశ్వాస తీయాలి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు... మీ MegaMindsIndia.